పెళ్లయిన నాలుగు నెలలకే నవవధువు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-04T04:44:46+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో పెళ్లయిన 4 నెలలకే నవ వధు వు తనువు చాలించింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని లక్ష్మీభార్గవి(20) ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది.

పెళ్లయిన నాలుగు నెలలకే నవవధువు ఆత్మహత్య
లక్ష్మీభార్గవి మృతదేహం

రాచర్ల, జనవరి 3 : కుటుంబ కలహాల నేపథ్యంలో పెళ్లయిన 4 నెలలకే నవ వధు వు తనువు చాలించింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని లక్ష్మీభార్గవి(20) ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. మండలంలోని జెపుల్లలచెరువు గ్రామానికి చెందిన పార్శ వెంకటశివకుమార్‌కు అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి లక్ష్మీభార్గవితో వివాహమైంది. పెళ్లయి నాలుగు నెలలు గడవక ముందే లక్ష్మీభార్గవి సోమవారం అత్తవారి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. వీఆర్‌వో రంగస్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గిద్దలూరు సీఐ ఎండీ ఫిరోజ్‌, రాచర్ల ఎస్‌ఐ మహేష్‌ జె.పుల్లలచెరువు గ్రామానికి వెళ్లి లక్ష్మీభార్గవి మృతదేహాన్ని పరిశీలించారు. అన్ని కోణాలలో పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. 


రైలు పట్టాలు దాటుతూ వృద్ధురాలి మృతి

గిద్దలూరు టౌన్‌, జనవరి 3 : రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకుని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. గిద్దలూరు పట్టణంలోని రాచర్లగేటు సమీపంలో రైలు గేటు దాటుతుండగా గుర్తు తెలియని వృద్ధురాలు (75)ని రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె మృతిచెందింది. ఆమె వివరాలు తెలియలేదని సీఆర్పీ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఆర్పీ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. 


కంభం చెరువులో యువకుడి గల్లంతు

చేపలు పడుతుండగా ప్రమాదం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

కంభం, జనవరి 3 : కంభం చెరువు లో చేపలు పడుతూ పొరపాటున కాలుజారి పడి యువకు డు గల్లంతైన సంఘటన ఆదివారం జరిగింది. ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు కథనం ప్రకారం... కంభం చెరువులో 10 రోజుల నుంచి వేలం పాడుకున్న వారు పడవలతో చేపలు పడుతున్నారు. సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన నాంచారయ్య కుమారుడు పిన్ని కార్తీక్‌(19) ఒంగోలులో చేపలుపట్టే వారితో కలిసి రెండు రోజులక్రితం కంభం చెరువుకు వచ్చారు. ఆదివారం సాయంత్రం బోటులో చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల కోసం వేసిన వలను బయటకు లాగుతూ పొరపాటున కాలు జారి చెరువులో పడిపోయాడు. మిగిలిన వారు గమనించి గల్లంతైన కార్తీక్‌ కోసం గాలించారు. చెరువులో ప్రస్తుతం 18 అడుగుల మేర నీరు ఉండడంతో జాడ కనిపించలేదు. ఈలోగా చీకటి పడడంతో గాలింపు నిలిపివేసి తిరిగి సోమవారం ఉదయం నుంచి పోలీసులు, మత్స్యకారులు గాలింపు చేపట్టారు. కానీ కార్తీక లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Read more