ఉమ్మడి జిల్లాలో టీడీపీ మహానాడు

ABN , First Publish Date - 2022-04-24T05:34:36+05:30 IST

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈసారి ఒంగోలు వేదిక కానుంది. ఆ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యూనిట్‌గా ఒంగోలుకు అటు, ఇటు పాతిక కిలోమీటర్లలోపు మహానాడు ప్రాంగణం ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా టీడీపీ మహానాడు ఎన్టీఆర్‌ జయంతి రోజైన మే 27 నుంచి మూడురోజుల పాటు అట్టహాసంగానే జరుగుతుంది.

ఉమ్మడి జిల్లాలో టీడీపీ మహానాడు

ఒంగోలు పరిసరాలకు ప్రాఽధాన్యం

26న స్థలపరిశీలనకు రానున్న అచ్చెన్న బృందం

వచ్చేనెల 27, 28 తేదీల్లో కార్యక్రమం

తొలిరోజు ప్రతినిధుల సభ, 

రెండవ రోజు లక్షమందితో బహిరంగసభ

ఒంగోలు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈసారి ఒంగోలు వేదిక కానుంది. ఆ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యూనిట్‌గా ఒంగోలుకు అటు, ఇటు పాతిక కిలోమీటర్లలోపు మహానాడు ప్రాంగణం ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా టీడీపీ మహానాడు ఎన్టీఆర్‌ జయంతి రోజైన మే 27 నుంచి మూడురోజుల పాటు అట్టహాసంగానే జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతరప్రాంతాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. అయితే ఈసారి మహానాడును ఒంగోలు ప్రాంతంలో నిర్వహించాలని ఆధిష్ఠానం నిర్ణయించగా వేలాదిగా తరలివచ్చే కార్యకర్తలు, నాయకులకు ఇక్కడ వసతులు కల్పన పెద్ద సమస్యగా జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మూడురోజులకు బదులు రెండు రోజులకు కార్యక్రమాన్ని కుదించారు. ఆ ప్రకారం వచ్చేనెల 27, 28 తేదీల్లో మహానాడు జరగనుంది. తొలిరోజున ఎంపిక చేసిన 4వేల నుంచి 5వేల మంది ప్రతినిధులతో మహానాడు జరగనుండగా రెండవరోజైన 28న మధ్యాహ్నం భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. దాదాపు లక్షమందికిపైగా ప్రజలతో ఆ సభ ఏర్పాటుచేయాలని తలపెట్టగా ప్రధాన సమీకరణ అంతా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచే అన్నది కూడా అధిష్ఠానం ఆదేశం. ఆ మేరకు కార్యక్రమంపై ఒక స్పష్టత రావడంతో ఉమ్మడి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. ప్రాథమికంగా జాతీయరహదారిపై మద్దిపాడు నుంచి టంగుటూరు లోపల అలాగే చీరాల రోడ్డులోనూ ఖాళీ పొలాల్లో మహానాడు నిర్వహణకు అనుకూలమైన స్థలాలు ఎక్కడ ఉన్నాయనేది ఆ పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. అలాగే మేదర మెట్ల నుంచి మార్టూరు మధ్య అనువైనన ప్రాంతాన్ని పరిశీలన చేస్తున్నారు. కాగా ఇలా ప్రాథమికంగా గుర్తించిన స్థలాలను పరిశీలించేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో నేతల బృందం ఈనెల 26న ఒంగోలు ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈనెల 25న సాయంత్రం బాపట్లలో ఆ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనే అచ్చెన్నాయుడు ఆ రాత్రికి ఒంగోలు చేరి బసచేసి 26న స్థలాల పరిశీలన చేస్తారు. అనంతరం మహానాడు నిర్వహణ ఎక్కడనే దానిపై స్పష్టత రానుంది. టీడీపీ వర్గాల సమాచారం అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా యూనిట్‌గా ఒంగోలు పరిసరాల్లో మహానాడు నిర్వహణ అన్నది ఖాయమని స్థలం ఎక్కడనేదే రాష్ట్ర అధ్యక్షుడి పరిశీలన అనంతరం పూర్తి నిర్ధారణకు వస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 

Read more