గుర్రుగా ‘టంగుటూరు’ వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2022-01-04T04:46:08+05:30 IST

మండల పరిషత్‌కు రెండో ఉపాధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలన్న విషయమై వైసీపీ అధిష్టానం నేటికీ గుట్టువిప్పలేదు. మండలంలోని సీనియర్‌ నేతలతో సోమవారం రాత్రి వరకు ఎటువంటి సమాలోచనలు చేయకపోవడంతో వారందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గుర్రుగా ‘టంగుటూరు’ వైసీపీ నేతలు

రెండో ఉపాధ్యక్ష పదవి ఎంపికపై గుట్టుగా అధిష్టానం

ఇంతవరకూ సమాలోచనలు చేయని అధికార పార్టీ

ముమ్మర ప్రయత్నాల్లో ఆశావహులు

నేటి ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు


టంగుటూరు, జనవరి 3 : మండల పరిషత్‌కు రెండో ఉపాధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలన్న విషయమై వైసీపీ అధిష్టానం నేటికీ గుట్టువిప్పలేదు. మండలంలోని సీనియర్‌ నేతలతో సోమవారం రాత్రి వరకు ఎటువంటి సమాలోచనలు చేయకపోవడంతో వారందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఎన్నిక జరుగుతున్నందున పదవి ఎవరిని వరిస్తుందనేది అధికార పార్టీలోని వారందరికీ అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే తమకు ఏం తెలియదని చెబుతున్నారు. ఈ నెల 4వ తేదీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకారణం చేతనైనా వాయిదాపడితే మరుసటి రోజు నిర్వహిస్తారు.

  

రెండో ఉపాధ్యక్ష పదవి కోసం పలువురు ప్రయత్నాలు

రెండో ఉపాధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీటీసీ సభ్యులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ మాదాసి వెంకయ్యతోపాటు మండల పార్టీ నాయకులు సూదలగుంట శ్రీహరిరావు, నారాయణరావులను కలసి పదవి తమకు కావాలంటే తమకు కావాలంటూ అభ్యర్థించారు. అధిష్టానం మనస్సు అంతుబట్టక ఎంపీటీసీ సభ్యులతో మిగిలిన అందరూ సతమతమవుతున్నారు. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటూ ఈ అవకాశం తమకంటే తమకని కొన్ని సామాజిక వర్గాలు పట్టుబడుతున్నాయి. ఆశావాహుల్లో ప్రధానంగా ఎస్సీల్లోని మాల, మాదిగ సామాజిక వర్గాలు, ఓసీల్లోని కమ్మ సామాజిక వర్గం ఉంది. ఇప్పటికే పదవులున్న సామాజిక వర్గాలను తప్పించి ఏ పదవీ లేని సామాజిక వర్గాలకు ఈసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.


అధిష్టానం చూపు ఎటువైపు

మొదటి ఉపాధ్యక్ష పదవి విషయంలో చివరివరకు కారుమంచి ఎంపీటీసీ సభ్యుడు ప్రదీప్‌ పేరు వినిపించినా అనూహ్యంగా అదే గ్రామంలోని మరొక ఎంపీటీసీ సభ్యుడు సుమన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. గతంలో జరిగిన ఆ ఇబ్బందిని పూడ్చుకోవాలని మండల స్థాయి నాయకులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకే పంచాయతీలోని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులకు ఉపాధ్యక్ష పదవులు కట్టబెడితే జనం ఏవిధంగా భావిస్తారోనని నాయకులు ఆలోచనలో పడ్డారు. జమ్ములపాలెంలో ఒకటికి మించి పదవులున్నందున కారుమంచిలో ఉంటే తప్పేంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.


మంత్రి మదిలో తూర్పునాయుడుపాలెం

మండలంలో అధికార పార్టీకి అధిష్టానం అంటే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డేనని ప్రచారం జరుగుతోంది. మంత్రి ఆలోచనల మేరకు తూర్పునాయుడుపాలెం ఎంపీటీసీ సభ్యుడు నాగయ్యకు కల్పించవచ్చని కూడా చెబుతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో తన ప్రత్యర్థి దామచర్ల జనార్దన్‌ స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో వైసీపీ నుంచి వైస్‌ ఎంపీపీని పెట్టుకోవడం ద్వారా తన ప్రత్యర్థి స్వగ్రామంలో వైసీపీని బలోపేతం చేయవచ్చని, ప్రత్యర్థికి సొంత ఊళ్లోనే బలం లేదని చెప్పవచ్చని మంత్రి భావిస్తే నాగయ్యకు రెండో వైస్‌ ఎంపీపీ ఖాయంగా రావచ్చని చెప్పుకుంటున్నారు. దీనిపై సోమవారం నాటికి ఎలాంటి ఆదేశాలుకానీ, సూచనలు గాని ఇవ్వలేదని సమాచారం. పార్టీలోని సీనియర్లుగా ఉన్న ముఖ్యనాయకులతో ఈ విషయమై చర్చించిన వారు లేరు. అధిష్టానం నామమాత్రంగానైనా మండలంలోని ఇతర నాయకులతో సంప్రదింపులు జరపకపోవడంపైనా అధికార పార్టీని కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

Updated Date - 2022-01-04T04:46:08+05:30 IST