కలగా ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం

ABN , First Publish Date - 2022-12-10T00:41:08+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిం చేందుకు త్రిపురాంతకం చెరువులో ఎస్‌ఎస్‌.ట్యాంకు నిర్మాణం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

కలగా ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం

త్రిపురాంతకం, డిసెంబరు 9: మండలంలోని పలు గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిం చేందుకు త్రిపురాంతకం చెరువులో ఎస్‌ఎస్‌.ట్యాంకు నిర్మాణం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మండలంలోని లేళ్లపల్లి, దువ్వలి, మిట్టపాలెం, రామసముద్రం, టి.చెర్లోపల్లి గ్రామాలతోపాటు త్రిపురాంతకం పట్టణానికి, ఎర్రగొండపాలెం మండలం రామచంద్రాపురం, అయ్యంబొట్లపల్లి గ్రామాలకు తాగునీటిని అందించేందుకు త్రిపురాంతకం చెరువులో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. అప్పటి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చొరవతో 2017 జూన్‌ నెలలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సంజీవరెడ్డి, ఈఈ మల్లికార్జునరావు, నాయకులు త్రిపురాంతకం చెరువును పలుమార్లు పరిశీలించారు. బాలాత్రిపుర సుందరీదేవి ఆలయానికి పడమర వైపున చెరువులో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మించేందుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక, ప్రతిపాదనలు తయారు చేసి రూ.16.9 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలు నిధుల కోసం ప్రభుత్వానికి పంపారు. దీంతో అప్పటి నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎస్‌ఎస్‌.ట్యాంకు నిర్మించడమే తరువాయి అంటూ వాగ్దానాలతో కాలం వెళ్లదీశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మొత్తం మొదటికి వచ్చింది. అనంతరం ప్రస్తుత అధికార పార్టీ నేతలు పట్టించుకోక పోవడంతో ఈ ప్రతిపాదనకు చెదలు పట్టినట్లు అయ్యింది. నిర్మాణం సగతి ఎలా ఉన్నా తాజాగా పెరిగిన అంచనాలతో ప్రతిపాధనలు కూడా ప్రభుత్వానికి నివేదించలేకపోవడం గమనార్హం.

వేసవిలో తాగునీటి సమస్య తీవ్రం

కాగా ఆయా గ్రామాల్లో వేసవిలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటా తాత్కాలికంగా సమస్యను తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ట్యాంకర్లతో నీటి సరఫరాకు లక్షల్లో ఖర్చు అవుతోంది. దీనికి తోడు ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు సాగు చేసిన మిర్చి ఇతర పంటలను కాపాడుకునేందుకు లారీ ట్యాంకర్లను, ట్రాక్టర్‌ ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్నారు. వాటితో సాగర్‌ కాలువతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేసుకొని పంటను తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎస్‌ఎస్‌.ట్యాంకును ఏర్పాటు చేసి పరిష్కరించాలని కొన్నేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం లేళ్లపల్లి, దువ్వలి, టి.చెర్లోపల్లి గ్రామాలకు గొల్లపల్లి ఎస్‌ఎస్‌ ట్యాంకు ద్వారా పైపులైన్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు ఉన్నా చివరి గ్రామాలు కావటంతో నీరు చేరటం లేదు. రామసముద్రం, మిట్టపాలెం, అయ్యంబొట్లపల్లి, రామచంద్రాపురం గ్రామాలకు ముటుకుల ఎస్‌ఎస్‌ ట్యాంకు ద్వారా నీరు సరఫరా కావాల్సి ఉన్నా మంచినీరు గ్రామాలకు చేరడంలేదు. దీంతో ఆయా గ్రామాలలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకులన్నీ దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం జరిగితే దాని ద్వారా వచ్చే మంచినీటిని ఆయా ట్యాంకులను నింపి ప్రజలకు సరఫరా చేయవచ్చు.

Updated Date - 2022-12-10T00:41:11+05:30 IST