స్మార్ట్‌గా దోపిడీ!

ABN , First Publish Date - 2022-09-30T05:44:20+05:30 IST

మారుతున్న సమాజంలో అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతోపాటు ఆర్థిక మోసాలు అధికమయ్యాయి. అదేక్రమంలో అందిపుచ్చుకున్న పరిజ్ఞానంతో అన్నివిధాలా అభివృద్ధి చెందాల్సిన యువత విపరీత పోకడలతో పెడత్రోవ పడుతోంది. అదేక్రమంలో పెరుగుతున్న నిరుద్యోగం, అవసరాలు వారిని దారిమళ్లిస్తున్నాయి.

స్మార్ట్‌గా దోపిడీ!

జిల్లాలో పెరుగుతున్న ఆర్థిక నేరాలు


ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

పోలీసుల పేరుతో టోకరా

లోన్‌ యాప్‌లతో వేధింపులు

భూముల విక్రయాలలో తిరకాసు

ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 29 :

మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నగర సంస్కృతి పెరిగిపోయింది. విలాసవంతమైన జీవితానికి ఎక్కువగా అలవాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తేలిగ్గా సంపాదించాలనే ఆలోచనతో కొందరు మోసాలకు తెగుబడుతున్నారు. అలాగే యువత కూడా పెడదోవ పడుతున్నారు. మూలంగా రోజురోజుకు ఆర్ధిక నేరాలు పెరిగిపోతున్నాయి. రెండేళ్ల కాలంగా పోలీసు స్పందన కార్యక్రమంలో వస్తున్న వినతుల్లో 50 శాతం ఆర్థిక నేరాలకు సంబంధించినవి కావడం గమనార్హం. వీటిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడంతోపాటుగా లోన్‌యా్‌పల పేరుతో వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు సెల్‌ఫోన్లు నుంచి, ల్యాప్‌ట్యా్‌పలు, బైక్‌లు, ఇళ్లలో దొంగతనాలు అధికమయ్యాయి. పోలీసులకు ఈ తరహా కేసులు తలనొప్పిగా మారాయి..


 మారుతున్న సమాజంలో అభివృద్ధి, ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానం పెరగడంతోపాటు ఆర్థిక మోసాలు అధికమయ్యాయి. అదేక్రమంలో అందిపుచ్చుకున్న పరిజ్ఞానంతో అన్నివిధాలా అభివృద్ధి చెందాల్సిన యువత విపరీత పోకడలతో పెడత్రోవ పడుతోంది. అదేక్రమంలో పెరుగుతున్న నిరుద్యోగం, అవసరాలు వారిని దారిమళ్లిస్తున్నాయి. వీటితో పాటు చెడు అలవాట్లకు బానిసలుగా మారి అప్పనంగా డబ్బు సంపాదించేందుకు వక్రమార్గాల వైపు పయనిస్తున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. చివరకు ఇంజినీరింగ్‌ చదువుకున్న పిల్లలు సైతం వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం దొంగలుగా మారి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చైన్‌ స్నాచింగ్‌లతోపాటు స్మార్ట్‌గా నగదు మోసాలకు తెగబడుతున్నారు. సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపి వారి వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్లు సృష్టించి వారి స్నేహితులు, బంధువుల నుంచి అర్జంట్‌ పేరుతో వారి ఖాతాలకు నగుదు బదిలీ చేయిస్తున్నారు. అలాగే అమాయకులు, నిరక్షరాస్యులే లక్ష్యంగా చేసుకుని ఏటీఎంలు, బ్యాంకుల వద్ద మోసాలకు పాల్పడుతున్నారు. ఇక లోన్‌యా్‌పల ఆగడాలు మితిమీరిపోయాయి. ఇటీవల వెలుగుచూస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా యువకులు నేరస్థులుగా మారి అనేకమంది జైళ్ల పాలవుతున్నారు. 

జిల్లాలో పెరిగిపోయిన మోసాలు

జిల్లాలో ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్ల ఆర్థిక మోసాలతో భూఅక్రమాలు పెరిగిపోయాయి. చిట్టీల పేరుతో కోట్లు వసూలు చేసి పారిపోతున్న ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. అలాగే వడ్డీల పేరుతో డబ్బులు తీసుకుని ఐపీ పెడుతున్న వారు ఉన్నారు. ఇవి కాకుండా భూముల కొనుగోళ్లు, అమ్మకాల పేరుతో డబ్బులు కాజేసి తర్వాత పత్తాలేకుండా పోతున్నారు. అలాంటి వాటిపైనా ఎస్పీ స్పందన కార్యక్రమంలో వినతులు తరచుగా నమోదవుతున్నాయి. అలాగే ఖాతాల్లో డబ్బులు మాయం కావడం, ఒకరి పేరుతో మరొకరు రుణం తీసుకోవడం వంటి వాటిపైనా ఫిర్యాదులు పెరిగాయి. అదేవిధంగా ఏకంగా ఎటువంటి తాకట్టు లేకుండా రుణం అంటూ ఆశ పెట్టి ఇచ్చిన దానికి పదింతలు వసూలు చేస్తున్నారు. ఇక రుణం కట్టలేని వారి పరువు బజారున వేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. అనేకరకాలుగా అమాయకులు వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఎస్పీ సీరియ్‌సగా పరిగణనలోకి తీసుకున్నారు. లోన్‌ యాప్‌లపై ప్రజలలో అవగాహన పెంచుతున్నారు. అదేవిధంగా ఆయా పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు.

పోలీసుల పేరుతో బురిడీలు

కొయంబత్తూరుకు చెందిన బంగారు అభరణాల వ్యాపారిని వారం క్రితం ఒంగోలు బస్టాండ్‌లో స్మార్ట్‌గా దోచేశారు. స్థానిక గాంధీరోడ్డులో ఉన్న బంగారం దుకాణాల వద్ద గదిలో ఉన్న వ్యాపారి తన విధి నిర్వహణలో భాగంగా చీమకుర్తి వెళ్లడానికి ఉదయం 10గంటలకు లేచి అక్కడ ఆటో ఎక్కి స్థానిక బస్టాండ్‌కు బయలుదేరాడు. అతనిని ఇరువురు వ్యక్తులు వెంబడించారు. ఆటో దిగిన బంగారు వ్యాపారి బాలాజీని తాము పోలీసులమంటూ దబాయించారు. గంజాయి రవాణా చేస్తున్నట్లు అనుమానం ఉంది తనిఖీ చేయాలని సోదాలు ప్రారంభించారు. బ్యాగులోని ఆభరణాల సంచిని చాకచక్యంగా మాయం చేశారు. వారిలో ఒకరు అతనిని మాటల్లో పెట్టగా రెండో వ్యక్తి బ్యాగ్‌లోని అర కిలో బంగారం(రూ.25లక్షలు విలువ) అపహరించి పరారయ్యారు. ఇలాగే గతంలో పోలీసులమంటూ ఆర్టీసీ బస్టాండ్‌లోనే కొందరు వ్యక్తులు కృష్ణా జిల్లాకు చెందిన బంగారు వ్యాపారిని మోసం చేసి భారీగా బంగారం దోచుకెళ్లారు.

ఇటీవల  ఆర్థిక నేరాలు

కొండపి గ్రామానికి చెందిన ప్రసంగు మహేష్‌ అనే వ్యక్తి ట్రాక్టరు ట్రక్కులు, వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని చెప్పి అదే గ్రామానికి చెందిన గోనెల మాల్వాద్రి వద్ద రూ.4.72 లక్షలు తీసుకుని పరికరాలు ఏవి అడిగినందుకు బూతులు తిడుతూ బెదిరించాడు.

-తాళ్లూరుకు చెందిన మారం వెంకటేశ్వరరెడ్డి తండ్రి వద్ద రూ.3,26,000 నగదు విడతల వారీగా అదే గ్రామానికి చెందిన దోసకాయల చెన్నయ్య తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమని అడిగితే అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీనిపై స్పందనలో ఫిర్యాదు అందింది.

-త్రిపురాంతకానికి చెందిన గుమ్మడిదల వెంకటప్రతాప్‌ తమ్ముడు వద్ద విజయవాడకు చెందిన రావులపాటి అయప్పశర్మ రూ.10లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో బాధితులు ఎస్పీకి పిర్యాదు చేశారు.

- తాను ప్రైవేటు హాస్పటల్‌ వైద్యుడినని, ఫర్నిచర్‌ కావాలంటూ దుకాణ యజమానికి ఫోన్‌ చేసిన ఒక మోసగాడు ఫర్నిచర్‌తో రావాలంటూ పిలిపించాడు. తన వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, వాటికి రూ.500 నోట్లు కావాలంటూ రూ.44వేలు తీసుకుని పరారైన ఘటన ఇటీవల కిమ్స్‌ ఫైఓవర్‌ వద్ద చోటుచేసుకుంది.

-పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పిస్తామని ఢాకా రాజీవ్‌రెడ్డి నాగులుప్పలపాడు మండలం చిన్నంగారిపాలెంనకు చెందిన కోడూరి ఏడుకొండలు వద్ద రూ.25వేలు తీసుకొని డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని ఎస్పీకిపిర్యాదు అందింది.

- రైల్వేలో పుడ్‌ కాంట్రాక్ట్‌ ఇప్పిస్తామని ఒంగోలుకు చెందిన అడిగి సుస్మిత, ఆమె స్నేహితుడు పాతగుంట భరణికుమార్‌లు కనిగిరికి చెందిన చెక్కా ప్రసాద్‌ వద్ద రూ.5లక్షలు తీసుకొని మోసం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది.

.

- గిద్దలూరుకు చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌కు బ్యాంకు ఖాతా నుంచి ఐదారు రోజుల్లో మొత్తం రూ.1.34లక్షలు కట్‌ అయ్యాయి. బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి అడ్డగ్గా టీచర్‌ తాను తీయలేదని చెప్పడంతో విచారణ చేశారు. వివిధ బ్యాంకుల ఖాతాలకు ఆ సొమ్ము జమ చేసుకున్నట్లు తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

-గిద్దలూరుకు చెందిన ఒక వ్యక్తి ఈకామర్స్‌లో వస్తువును ఆర్డర్‌ పెట్టగా ఆలస్యమైంది. అయితే తనకు ఆర్డర్‌ అందలేదని కంపెనీ ఇచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేయగా వారు ఒక లింక్‌ ఇస్తున్నాం దానిని క్లిక్‌ చేస్తే ఎక్కడ ఉంది తెలుస్తుందని చెప్పారు. అయితే వారు పంపిన లింక్‌ ఓపెన్‌ చేయగా తన ఖాతా నుంచి రూ.25వేలు వెళ్లిపోయాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ డబ్బులు న్యూయార్క్‌లో ఒక ఖాతాలో జమైనట్లు తేలింది.

-గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమానికి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి రూ.60వేలు ఫోన్‌పే కొట్టమని అడిగారు. ఎవరు మీరంటే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నామని, బంగారం బిస్కట్లు వచ్చాయి, రూ.40వేలకు ఒకటి వస్తుందని చెప్పి అకౌంట్‌ నంబర్‌ పంపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అకౌంట్‌ నెంబరును పరిశీలించగా మేదరమెట్లకు చెందిన గుడుపూటి నాగబ్రహ్మం అని తేలింది. 

ఆశకు పోవద్దు...వేధింపులకు గురికావద్దు:

- మల్లికగర్గ్‌, ఎస్పీ

నకిలీ లోన్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చట్టబద్ధత లేని యాప్‌ల ద్యారా రుణాలు తీసుకొని వారి వేధింపులకు గురికావద్దు. ఇలాంటి వేధింపులకు గురవుతున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్లలో పిర్యాదు చేయాలి. అదే విధంగా ఆర్ధిక నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Read more