దేవుడికే శఠగోపం

ABN , First Publish Date - 2022-08-25T06:52:33+05:30 IST

ఆలయ సొమ్ముకు రక్షకుడిగా ఉండాల్సిన అధికారే భక్షకుడిగా మారాడు. దేవుడికే శఠగోపం పెట్టాడు. ఖర్చులు అధికంగా చూపి ఏడు నెలల్లో రూ.15లక్షలు స్వాహా చేశాడు. బ్రహ్మోత్సవాల పేరుతో హడావుడి చేసి నిధులు బొక్కేశాడు.

దేవుడికే శఠగోపం
శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

లక్ష్మీనరసింహుడు  నిధుల  వినియోగంలో గోల్‌మాల్‌

ఏడు నెలల్లో రూ.48లక్షల ఖర్చు చూపిన పూర్వ  ఈవో

చెల్లింపుల్లో నిబంధనలకు నీళ్లు

రూ.15లక్షలు స్వాహా  చేసినట్లు ఆరోపణలు 

వైసీపీ నేతలకూ వాటాలున్నట్లు ప్రచారం 

ప్రస్తుతం ఆలయ ఖాతాలో జీరో నిల్వ

సింగరాయకొండ, ఆగస్టు  23  : ఆలయ సొమ్ముకు రక్షకుడిగా ఉండాల్సిన అధికారే భక్షకుడిగా మారాడు. దేవుడికే శఠగోపం పెట్టాడు. ఖర్చులు అధికంగా చూపి ఏడు నెలల్లో రూ.15లక్షలు స్వాహా చేశాడు. బ్రహ్మోత్సవాల పేరుతో  హడావుడి చేసి నిధులు బొక్కేశాడు. అందులో వైసీపీ నేతలకూ వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చోటుచేసుకున్న ఈ గోల్‌మాల్‌ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 మండ లంలోని పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఇన్‌చార్జి ఈవోగా ఓ అధికారి ఏడు నెలలు పని చేశారు. ఆయన 2021 డిసెంబర్‌ 8న బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి దేవస్థానం ఖాతాలో రూ.2.43 లక్షలు ఉన్నాయి. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి అఖరు నాటికి ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం రూ. 9.94 లక్షలకు చేరింది. దీంతోపాటు 2022 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూలై 11 నాటికి మొత్తం రూ.28.89 లక్షల ఆదాయం సమకూరింది. ఇలా పూర్వ ఈవో పనిచేసిన ఏడు నెలల్లో దేవస్థానికి వివిధ మార్గాల్లో రూ.38.84లక్షలు సమకూరాయి. జూన్‌ 9 నుంచి 19 వరకూ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. వీటికి కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఖర్చుచేయాలన్న నిబంధన ఉంది. అయితే ఇన్‌చార్జి ఈవో నిబంధనలకు ఉల్లంఘించి నిధులను దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌చార్జి ఈవో జూలై 11న ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. 


ఏడు నెలల్లో ఖర్చు రూ.38 లక్షలు.. బకాయిలు రూ.22 లక్షలు!

ఇన్‌చార్జి ఈవో ఏడు నెలలు పనిచేసిన సమయంలో వచ్చిన రూ.38 లక్షల ఆదాయాన్ని వివిధ ఖర్చుల కింద వెచ్చించినట్లు చూపారు. దీంతోపాటు బ్రహ్మోత్సవాల ఖర్చు తాలుకా ఇంకా రూ.10లక్షల బకాయి ఉంది. అంటే మొత్తం 7 నెలల్లో రూ.48 లక్షలు వెచ్చించినట్లు చూయించారు. మరోవైపు దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులకు, సిబ్బందికి సుమారు రూ.12 లక్షల వరకూ జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.  ప్రస్తుతం ఆలయ ఖాతాలో జీరో నిల్వ చూపిస్తోంది. 


నిబంధనలకు తూట్లు

దేవదాయశాఖ నిబంధనలు ప్రకారం ఆలయ  ఖాతాలోని నగదును ఖర్చు చేయాలంటే ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ (ఆర్‌జేసీ) అనుమతి తప్పని సరి. ఆ ఖర్చు వార్షిక బడ్జెట్‌కు లోబడి మాత్రమే ఉండాలి. ప్రతిదానికీ పత్రసహిత ఆధారాలు ఉండాలి. దేవస్థానంలో ఇలాంటివేమీ పాటించకుండా నిబంధలను యఽథేచ్చగా తుంగలో తొక్కి నిధులను గోల్‌మాల్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా పూర్వపు ఈవో సుమారు రూ.15 లక్షలకు పైగా స్వాహా చేసి ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.  


Updated Date - 2022-08-25T06:52:33+05:30 IST