ఎట్టకేలకు మోక్షం

ABN , First Publish Date - 2022-01-23T06:06:33+05:30 IST

దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కందుకూరు పట్టణంలో రిజిస్ట్రేషన్లు నిలిచిన సర్వే నంబరు 865/1ఏ1ఏ2ఏ1కు ఎట్టకేలకు న్యాయస్థానం జోక్యంతో మోక్షం లభించింది.

ఎట్టకేలకు మోక్షం

కందుకూరులో 305.39ఎకరాల్లో రిజిస్ట్రేన్లకు క్లియరెన్స్‌

రెండేళ్లుగా నిషేధిత జాబితాలోనే సర్వే నెంబరు 865/1ఏ-1ఏ,2ఏ-1

కోర్టు ధిక్కార పిటిషన్‌తో  దిగివచ్చిన దేవదాయశాఖ

రేపటి నుంచి  ప్రక్రియ ప్రారంభం

కందుకూరు, జనవరి 22 : దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కందుకూరు పట్టణంలో రిజిస్ట్రేషన్లు నిలిచిన సర్వే నంబరు 865/1ఏ1ఏ2ఏ1కు ఎట్టకేలకు న్యాయస్థానం జోక్యంతో మోక్షం లభించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల వినతులను పెడచెవిన పెట్టిన ఆ శాఖ అధికారులు చివరికి కోర్డు ఆదేశాలతో వారి భూమి మినహా మిగిలిన దాంట్లో రిజిస్ట్రేషన్లకు అనుమతించారు. కందుకూరులో సర్వే నెంబరు 865/1ఏ1ఏ2ఏ1లో మొత్తం 311.40 ఎకరాల భూమి ఉంది. ఇదే నంబరులో ప్రధానంగా కందుకూరు పట్టణం ఉంది. దీంతోపాటు పట్టణంలోని 14 దేవాలయాలకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. వాటి విస్తీర్ణం కేవలం 6 ఎకరాల ఒక్క సెంటు మాత్రమే. అయితే ఆ శాఖ అధికారులు సర్వే నంబరు మొత్తం  తమదిగా చూపుతూ రిజిస్ట్రేషన్‌ శాఖకు తెలియజేశారు. దీంతో ఆ శాఖ అధికారులు  మొత్తం 311.40 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు.


ఇదీ నేపథ్యం

కందుకూరులో పలు విద్యాసంస్థలను నడుపుతున్న వ్యక్తి మరికొందరితో కలిసి పట్టణంలోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో 328 సర్వే నెంబరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. తీరా ఆ నంబరు అంకమ్మతల్లి దేవస్థానానికి సంబంధించిన ఆస్తిగా నమోదైంది. దీంతో వారు దేవదాయ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ నంబరును తొలగించుకోగలిగారు. సర్వే నంబరు 328ని తమ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన దేవాదాయ శాఖ అధికారులు ఆ జాబితాలో దాని బదులు సర్వే నెంబరు 865/1ఏ1ఏ2ఏ1ని చేర్చారు. అది పాత కందుకూరు నంబర్‌. అంటే ఒకప్పుడు కందుకూరు అనగానే గుర్తుకొచ్చే ప్రధాన ప్రాంతాలన్నీ ఈ నంబర్‌లోనే ఉన్నాయి. ఆ నంబర్‌లో దేవాలయాలు ఉన్నమాట వాస్తవమే కానీ మొత్తం విస్తీర్ణం దేవాలయాలది కాదు. ఈ నంబరును పూర్తిగా ప్రస్తుతం నిషేధిత జాబితాలో చేర్చారు. రమారమి రెండేళ్లు అలానే వదిలేశారు. ఈ సమస్యపై పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది.ఎన్ని కథనాలు వచ్చినా, ప్రజాప్రతినిధులు పదేపదే ప్రస్తావించినా ఆశించిన ఫలితం రాలేదు. దేవదాయశాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో సమస్య తమది కాదన్నట్లు వ్యవహరించారు. దీంతో న్యాయవాది పెట్లూరి రామకృష్ణమురళి, మేడా మల్లికార్జున, షేక్‌ మహబూబ్‌ బాషా అనే వ్యక్తులు వేర్వేరుగా హైకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటి ఆధారంగా న్యాయస్థానం పట్టణవాసులకు అనుకూలంగా తీర్పులిచ్చింది. అవి కూడా అమలుకాకపోవటంతో కందుకూరుకి చెందిన వేదం ప్రసాదు అనే వ్యక్తి కోర్టు ధిక్కారం కింద మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో దేవదాయశాఖలోని మూలవిరాట్‌లు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేశారు. 


విలువైన ఆస్తులన్నీ ఈ సర్వే నంబరులోనే..

సర్వే నంబరు 865/1ఏ-1ఏ, 2ఏ-1లో కందుకూరులోని విలువైన ప్రైవేటు ఆస్తులన్నీ ఉన్నాయి. పాత కందుకూరుగా భావించే ప్రస్తుతం పట్టణంలో ప్రధాన వాణిజ్య ప్రాంతాలున్నాయి. పామూరు రోడ్డు, కనిగిరి రోడ్డు, పెద్దబజారు, వెంకటనారాయణ బజారుతోపాటు తూర్పుపాలెం, గుర్రంవారిపాలెం, పడమర బలిజపాలెం, ముత్యాలకుంట, జనార్దనస్వామి గుడి ఏరియా, శివాలయం ఏరియా, గుణ్ణంకట్ట, రాజ్‌ థియేటర్‌, మార్కెట్‌ సెంటర్‌, కోటేశ్వర థియేటర్‌ తదితర ప్రాంతాలన్నీ ఈ నంబరులోనే ఉన్నాయి.  


Read more