ఖరీఫ్‌కు ఊరట.. రబీకి సానుకూలం..!

ABN , First Publish Date - 2022-10-03T05:33:32+05:30 IST

జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలు సాగుకు ఊతం ఇచ్చాయి. ఖరీఫ్‌ పైర్లకు ప్రాణం పోశాయి. రబీ సాగుకు సానుకూల వాతావరణాన్ని కల్పించాయి. రెండురోజుల వ్యవధిలో సుమారు 58.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఇది ఈనెల సాధారణ వర్షపాతంలో నాలుగోవంతుగా ఉంది. కొన్ని మండలాల్లోఏకంగా 100 మి.మీపైగానే కురిసింది.

ఖరీఫ్‌కు ఊరట..     రబీకి సానుకూలం..!
పశ్చిమ ప్రాంతంలో కళకళలాడుతున్న పత్తి పైరు

రెండు రోజుల్లో 58.8 మి.మీ వర్షం 

సాగులో ఉన్న పత్తి, కంది, మిర్చి పైర్లకు మేలు

పొగాకు, మినుము, శనగ, మిర్చి విస్తారంగా సాగుకు అవకాశం

ఒంగోలు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలు సాగుకు ఊతం ఇచ్చాయి. ఖరీఫ్‌ పైర్లకు ప్రాణం పోశాయి. రబీ సాగుకు సానుకూల వాతావరణాన్ని కల్పించాయి. రెండురోజుల వ్యవధిలో సుమారు 58.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.  ఇది ఈనెల సాధారణ వర్షపాతంలో నాలుగోవంతుగా ఉంది. కొన్ని మండలాల్లోఏకంగా 100 మి.మీపైగానే కురిసింది.  పొలం ఆరిన వెంటనే జిల్లావ్యాప్తంగా రబీ సాగును రైతులు ముమ్మరం చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 1.71 లక్షల హెక్టార్లు, రబీలో 1.66 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సరిగా వర్షాలు లేక పంటలు పూర్తి స్థాయిలో సాగు కాలేదు. దాదాపు 20 శాతం విస్తీర్ణంలో పంటలు పడకపోగా, మరో 10 నుంచి 15 శాతం విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. కీలకమైన సెప్టెంబరులో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ఆ నెలలో సగం కూడా కురవలేదు. మొత్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 366.2 మి.మీ సాధారణ వర్షపాతానికి సుమారు 12 శాతం లోటుతో 322.7 మి.మీ మాత్రమే పడింది. ఇంచుమించు 20 మండలాల్లో 20 నుంచి 60 శాతం లోటు వర్షపాతం ఉంది. సెప్టెంబరు సాధారణ వర్షపాతంలో సగం కూడా పడకపోవడంతో సాగులో ఉన్న కీలక ఖరీఫ్‌ పైర్లు అయిన పత్తి, మిర్చి, కంది, మొక్కజొన్న తదితరాలు ఎండుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు రెండు రోజుల వ్యవధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.ఈ రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో సగటున 58.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 

ఊపందుకోనున్న రబీ సాగు 

సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 206.50 మి.మీ కాగా అందులో ఇంచుమించు నాలుగో వంతుపైగా ఈ రెండు రోజుల్లోనే కురిసింది. కొత్తపట్నం, మద్దిపాడు, ఒంగోలు, టంగుటూరు, నాగులుప్పలపాడు, ఎస్‌.ఎన్‌.పాడు మండలాల్లో ఏకంగా 110 నుంచి 170 మి.మీ వర్షపాతం నమోదైంది.  చీమకుర్తి, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు, పీసీపల్లి, తాళ్లూరు, దొనకొండ, తర్లుపాడు, పెద్దారవీడు, త్రిపురాంతకం తదితర మండలాల్లో 40 నుంచి 90 మి.మీ వర్షం కురిసింది. ఇతరచోట్ల ఒక మోస్తారుగా పడింది. సెప్టెంబరులో తీవ్ర వర్షాభావ నెలకొన్నా అనేక మండలాల్లో ప్రస్తుతం మంచి వర్షాలే కురిశాయి. జిల్లాలో రబీ సీజన్‌లో సుమారు లక్ష 65వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. అందులో ప్రధానమైన పొగాకు, శనగ, మిర్చి మినుము వంటివే ఇంచుమించులక్ష 30వేల హెక్టార్లలో ఉంటాయి. ప్రస్తుత వర్షాలు ఆ పంటల సాగుకు పూర్తిగా ఉపకరించనున్నాయి. పశ్చిమ ప్రాంతంలో తక్షణమే పొగాకు నాట్లు, శనగ సాగుకు రైతులు ఉపక్రమించనున్నారు. మిర్చి, మినుము పైర్ల సాగు కూడా ఊపందుకోనుంది. ఇక పశుగ్రాసంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య కూడా ఈ వర్షాలతో తీరనుంది. 

మండలాల వారీ రెండు రోజుల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇవీ..

మండలం నమోదైన వర్షపాతం (మి.మి)

కొత్తపట్నం 171.60

మద్దిపాడు 144.40

ఒంగోలు 137.80

టంగుటూరు 115.20

ఎన్‌జిపాడు 147.00

ఎస్‌ఎన్‌పాడు 113.40

చీమకుర్తి 90.80

కొండేపి 91.00

.జరుగుమల్లి 87.00

శింగరాయకొండ 71.00

తాళ్లూరు 81.80

పుల్లలచెరువు 78.40

మార్కాపురం 76.40

దొనకొండ  76.20


Updated Date - 2022-10-03T05:33:32+05:30 IST