ముగిసిన ఓట్ల దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2022-11-08T00:53:29+05:30 IST

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు ప్రక్రియ సోమవారంతో ముగిసింది.

ముగిసిన ఓట్ల దరఖాస్తుల స్వీకరణ

జిల్లావ్యాప్తంగా 1,08,923 మంది దాఖలు

19 నాటికి ముసాయిదా జాబితా సిద్ధం

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 7 : చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. నమోదుకు అక్టోబరు 1న ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆరోజు నుంచి జిల్లావ్యాప్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు అయితే ఈసారి శాసనమండలి ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఓట్ల నమోదుపై జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించాయి. ఇంకోవైపు జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం కూడా ఓట్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఆదివారం జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు స్పెషల్‌ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అలా జిల్లావ్యాప్తంగా అందిన సమాచారం మేరకు పట్టభద్రుల నుంచి 1,08,923 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఉపాధ్యాయులు సుమారు మూడువేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఎన్నికల కమిషన్‌ మ్యాన్యువల్‌తోపాటు ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా నమోదు చేసుకున్నారు. ఇంకోవైపు ప్రధాన పార్టీలు కూడా సానుభూతిపరుల ద్వారా ఓట్ల నమోదు కోసం దరఖాస్తులు చేయించారు. అయితే స్వీకరణ ముగియడంతో వచ్చిన దరఖాస్తులపై అధికారులు విచారణ చేసి ఈనెల 19 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధంచేసేందుకు చర్యలు చేపట్టారు. ఓటర్ల జాబితాలపై వచ్చిన క్లైయిమ్స్‌, అభ్యంతరాలను ఈనెల 23 నుంచి డిసెంబర్‌ 9వతేదీ వరకు స్వీకరిస్తారు. అనంతరం వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి తుది జాబితాను డిసెంబరు 31న ప్రచురించనున్నారు.

Updated Date - 2022-11-08T00:53:29+05:30 IST

Read more