రాంగ్‌రూట్‌లో రేషన్‌బియ్యం

ABN , First Publish Date - 2022-12-30T02:03:24+05:30 IST

యర్రగొండపాలెం, మార్కాపురం కేంద్రాలుగా రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది.

రాంగ్‌రూట్‌లో రేషన్‌బియ్యం

కోట్లు ఆర్జిస్తున్న దళారులు

కంభం, డిసెంబరు 29 : యర్రగొండపాలెం, మార్కాపురం కేంద్రాలుగా రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ దందాలో కొంతమంది వ్యాపారులు, ఎండీయూ ఆపరేటర్లు, డీలర్ల కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతోంది. వీరికక్కుర్తితో ఇంటింటికి రేషన్‌ బియ్యం పథకం ద్వారా కార్డుదారులకు నేరుగా సరుకులు అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరు గారి పోతోంది. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణం. డీలర్లే అనధికారికంగా పంపిణీలో జోక్యం చేసుకుంటున్నారు. కార్డుదారులకు కిలోకు రూ.10 ఇచ్చి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. డీలర్లతో ఎండీయూలు కుమ్మక్కు కావడంతో ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఇంటింటికి రేషన్‌ బియ్యం పథకాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎక్కడా పంపిణీ సక్రమంగా సాగడం లేదు. రేషన్‌బియ్యం ఇంటింటికి పోకుండా అడ్డదారిలో నల్లబజారుకు తరలిపోతోంది. కంభం మండలంలోని 31 రేషన్‌ దుకాణాలకు గాను 1897 క్వింటాళ్లు, అర్థవీడు మండలంలో 26 రేషన్‌ దుకాణాలకు గాను 1575 క్వింటాళ్లు, బేస్తవారపేట మండలం లో 39 రేషన్‌షాపులకు గాను 2179 క్వింటాళ్లు, బియ్యం ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వీటి సరఫరా సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవు.

రాత్రివేళలో తరలింపు

ఆయా మండలాల్లో సేకరించిన అక్రమ రేషన్‌ బియ్యాన్ని అనుమానం రాకుండా ప్లాస్టిక్‌ సంచుల్లో నింపి రాత్రివేళల్లో ఆయా డీలర్ల దుకాణాల నుంచి గాని, వేరే ప్రాంతంలో డంప్‌ చేసిన చోట నుంచి గాని లారీల్లోకి ఎత్తించి అధికారుల కళ్లు గప్పి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ప్రతి నెలా 100 నుంచి 200 టన్నులకు పైగా బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాలో కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున అర్థవీడు మండలం నాగులవరం నుంచి 400 బస్తాల రేషన్‌ బియ్యాన్ని మార్కాపురం తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులు పట్టుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక బియ్యం, లారీని కంభం పోలీసుస్టేషన్‌లో అప్పగించినట్లు విజజిలెన్స్‌ అధికారి నరసింహారావు తెలిపారు. ఈ బియ్యం వైజాగ్‌ పోర్టుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. మనదేశం బియ్యం విదేశాలకు దొంగచాటుగా తరలించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు నిఘా పెట్టకపోవడానికి పెద్ద ఎత్తున ముడుపులు ముడుతుండడమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠంగా చూడాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-12-30T02:03:24+05:30 IST

Read more