వర్షార్పణం

ABN , First Publish Date - 2022-12-13T00:05:04+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ రైతులను నిండా ముంచింది. వారి వెన్ను విరిచింది. కన్నీళ్లను మిగిల్చింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. పొగాకు, కంది, మిర్చి, మినుము, బొబ్బర్లు సాగు చేసిన వారికి భారీ నష్టం వాటిల్లింది.

వర్షార్పణం

నీటలోనే పంటలు

పొదుగుతున్న పొగాకు తోటలు

కుళ్లిపోతున్న శనగ

పూత రాలిపోయిన కంది,

మిముము, బొబ్బర్లు

మిర్చి సాగు చేసిన వారికీ

కోలుకోలేని దెబ్బ

కొండపి, డిసెంబరు 12 : మాండస్‌ తుఫాన్‌ రైతులను నిండా ముంచింది. వారి వెన్ను విరిచింది. కన్నీళ్లను మిగిల్చింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. పొగాకు, కంది, మిర్చి, మినుము, బొబ్బర్లు సాగు చేసిన వారికి భారీ నష్టం వాటిల్లింది. సోమవారం సాయంత్రానికి కూడా పంట చేలల్లో నీరు బయటకు వెళ్లలేదు. దీంతో పొగాకు తోటలు పొదిగిపోయాయి. ఆకులు వడబడినట్లు వాలిపోయాయి. దీంతో ఇప్పటికే పెట్టుబడి ఖర్చులో మూడొంతుల పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా 40 రోజులు దాటిన పొగ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోతున్నారు. మరో వారంలో అడుగు ఆకు రెలిచే దశలో కురిసిన వర్షం కోలుకోలేని దెబ్బతీసిందని వారు కన్నీరు పెడుతున్నారు.

శనగ, కంది రైతులకు భారీ నష్టం

శనగ పొలాల్లో నిలిచిన నీళ్ల కారణంగా పైరు కుళ్లిపోతున్నదని రైతులు వాపోతున్నారు. 20 రోజుల క్రితం వేసిన శనగతోపాటు వారం క్రితం విత్తిన శనగలు కూడా భూమిలోనే కలిసిపోయాయి. తాను వేసిన 9 ఎకరాల్లో కంది పూత, పిందె రాలిపోయిందని పెదకండ్లగుంట గ్రామానికి చెందిన రైతు తానికొండ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామంలో వందల ఎకరాల్లో వేసిన కంది తుడిచిపెట్టుకుపోయిందని ఆయన చెప్పారు. బొబ్బర్లు, మినుము పైర్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.

మర్రిపూడిలో..

మర్రిపూడి : మాండస్‌ తుఫాన్‌ కారణంగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రైతుల వెన్నువిరిచాయి. మండలంలో డిసెంబర్‌ సాధారణ వర్షపాతం 50 మి.మీ కాగా, ఇప్పటికే 180 మి.మీ నమోదైంది. దీంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. మండలంలో వెయ్యి ఎకరాలకుపైగా మిర్చి సాగు చేయగా భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. పలు గ్రామాల్లో లోతట్టు భూముల్లో సాగు చేసిన మిర్చి తోటలు నీట మునిగాయి. నాలుగు వేల ఎకరాలకుపైగా సాగు చేసిన శనగ తుడిచిపెట్టుకుపోయింది. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో సాగు చేసిన ముదురు పొగాకు తోటలు వర్షం కారణంగా మడ్డి కారిపోయి రంగు కోల్పోయే ప్రమాదం ఉందని రావెళ్లవారిపాలెంనకు చెందిన పాలెపు వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2000 ఎకరాలకుపైగా సాగు చేసిన బొబ్బర్లు అతివర్షాల కారణంగా పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నదాతలు చెప్తున్నారు. మండలంలో 10 వేల ఎకరాలకుపైగా కంది సాగు చేశారు. ముసురు వర్షాలతో పూత రాలిపోయింది. వర్షాలు లేని కారణంగా ఈఏడాది మర్రిపూడి చెరువు కింద రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు చేశారు. అది కూడా ప్రస్తుతం దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు. మండలంలో పంట నష్టంపై సమగ్ర అంచనా తయారు చేయించి రైతులకు పరిహారం అందించాలని తెలుగు రైతు రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎర్రమోతు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ఆయన కోరారు. అధిక వర్షాల కారణంగా పైర్లలో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయాధికారి వెంకటేష్‌ సూచించారు.

Updated Date - 2022-12-13T00:05:06+05:30 IST