ఉలిక్కిపడిన పొదలకొండపల్లి

ABN , First Publish Date - 2022-07-04T05:25:26+05:30 IST

గిద్దలూరు మండలం పొదలకొండపల్లెకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శనివారపు నారాయణరెడ్డి (26) హైదరాబాద్‌లో హత్యకు గురవడం కలకలం రేకెత్తించింది. దీంతో ఆయన స్వగ్రామం ఉలిక్కిపడింది. పొదలకొండపల్లెకే చెందిన రవళిని నారాయణరెడ్డి గత ఏడాది మేలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అందుకు రవళి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వీరిరువురూ బంధువులకు దూరంగా వెళ్లి ఢిల్లీలో ఉన్నారు. అనంతరం కొద్దిరోజులకే వారి ఆచూకీని రవళి తల్లిదండ్రులు కనుగొన్నారు. ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చారు.

ఉలిక్కిపడిన పొదలకొండపల్లి
పొదలకొండపల్లెలో అంత్యక్రియలకు నారాయణరెడ్డి మృతదేహాన్ని తరలిస్తున్న బంధువులు(ఇన్‌సెట్లో) నారాయణ రెడ్డి( ఫైల్‌)

గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ 

ఉద్యోగి హైదరాబాద్‌లో హత్య 

ప్రేమ వివాహమే కారణం

నిందితులు కూడా అదే

గ్రామానికి చెందిన వ్యక్తులు?

తెలంగాణ పోలీసుల అదుపులో పలువురు

నారాయణరెడ్డి అంత్యక్రియలకు 

భారీగా హాజరైన జనం

గిద్దలూరు టౌన్‌, జూలై 3 : గిద్దలూరు మండలం పొదలకొండపల్లెకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శనివారపు నారాయణరెడ్డి (26) హైదరాబాద్‌లో హత్యకు గురవడం కలకలం రేకెత్తించింది. దీంతో ఆయన స్వగ్రామం ఉలిక్కిపడింది. పొదలకొండపల్లెకే చెందిన రవళిని నారాయణరెడ్డి గత ఏడాది మేలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అందుకు రవళి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వీరిరువురూ బంధువులకు దూరంగా వెళ్లి ఢిల్లీలో ఉన్నారు. అనంతరం కొద్దిరోజులకే వారి ఆచూకీని రవళి తల్లిదండ్రులు కనుగొన్నారు. ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చారు. అయితే నారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించి తన భార్యను అప్పచెప్పాలంటూ పిటిషన్‌ దాఖలు చేశాడు. కోర్టు పలుదఫాల విచారణ అనంతరం రవళి అభిప్రాయం అడిగింది. ఆమె తాను తల్లిదండ్రుల వద్దే ఉంటానని పేర్కొనడంతో ఆమేరకు కోర్టు కూడా ఆదేశించింది. అనంతరం వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రోడ్డు నెంబరు-1లో గది అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. రవళి సమీప బంధువు అయిన శ్రీనివాసరెడ్డి ఒక పథకం ప్రకారం నారాయణరెడ్డితోపరిచయం ఏర్పరచుకున్నారు. గత నెల 27న కారులో తన స్నేహితులైన ఆసిఫ్‌, కాశీలతో నారాయణరెడ్డి ఉంటున్న గది వద్దకు వచ్చాడు. ఆయన్ను కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం ఖాజాగూడ వైపు తీసుకెళ్లారు. అనంతరం ఆసిఫ్‌ను కిందకు దిగమని చెప్పిన శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటికే నారాయణరెడ్డి గొంతుగట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఆసిఫ్‌ను బెదిరించాడు. అనంతరం కారును జిన్నారం వైపు తీసుకెళ్లాలని సూచించాడు. జిన్నారం మండలం వల్లూరు గ్రామ శివారులో నారాయణరెడ్డి మృతదేహాన్ని పెట్రోలు పోసి దహనం చేశారు. నారాయణరెడ్డి కన్పించకపోవడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. 

హత్యలో సూత్రధారులు పొదలకొండపల్లె వాసులే

నారాయణరెడ్డి హత్య  కేసులో సూత్రధారులు గిద్దలూరు మండలం పొదలకొండపల్లె, సమీపంలోని పొట్టిరెడ్డిపల్లె గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. నారాయణరెడ్డి తన కూతురుతో ప్రేమ వివాహం నడిపి తమను అగౌరవపరిచాడని భావంచిన రవళి తండ్రి కందుల వెంకటేశ్వరరెడ్డి అతని హత్యకు పథకం రచించాడు. అందులో భాగంగా గ్రామంలోనే తన ఇంటి సమీపంలో ఉన్న శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరిని రంగంలోకి దింపాడు. దీంతో శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు పట్టణానికి చెందిన కారు డ్రైవర్‌ ఆసిఫ్‌తోపాటు మరో ఇరువురు హత్యలో పాల్గొన్నట్లు తెలిసింది.  ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం కందుల వెంకటేశ్వరరెడ్డిని, ఆయన కుమారుడు కందుల చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్‌ చందులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది.

నారాయణరెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి

గ్రామంలో సౌమ్యుడిగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉండే శనివారపు నారాయణరెడ్డి  హత్యను గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి ఆదివారం సాయంత్రం గ్రామానికి తీసుకురావడంతో ఊరంతా కదిలివచ్చి ఆయన అంతిమయాత్రంలో పాల్గొంది.  ఆయనకు అశ్రునివాళులర్పించింది. 

విచారిస్తున్నాం

ఫిరోజ్‌, గిద్దలూరు సీఐ 

హైదరాబాద్‌లో పొదలకొండపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నారాయణరెడ్డి హత్య విషయం తమకు హైదరాబాద్‌ పోలీసుల ద్వారా తెలిసింది. ఈ విషయంలో తమ వంతుగా హైదరాబాద్‌ పోలీసులకు సహకరిస్తున్నాం. నిందితులను ఎట్టిపరిస్థితిల్లో వదిలిపెట్టం. 


Updated Date - 2022-07-04T05:25:26+05:30 IST