రాష్ట్రంలో సైకో పాలన

ABN , First Publish Date - 2022-12-06T23:17:28+05:30 IST

‘రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోంది. వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి. వైసీపీ నేతలు అభివృద్ధిని మరచి దాచుకోడం, దోచుకోవడమే ధ్యేయమన్నట్లు ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఇప్పుడు వారిని నట్టేట ముంచారు’ అని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో సైకో పాలన
పీహెచ్‌సీ వద్ద ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే స్వామి, భారీగా హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలు

మట్టి, ఇసుక, లిక్కర్‌ మాఫియాలుగా వైసీపీ నాయకులు

అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరుతో సింగరాయకొండలో హత్యలు, దాడులు

తండ్రి ఉన్నతశ్రేణిగా మార్చిన పీహెచ్‌సీ స్థాయిని దిగజార్చిన తనయుడు

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే స్వామి

సింగరాయకొండ, డిసెంబరు 6 : ‘రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోంది. వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి. వైసీపీ నేతలు అభివృద్ధిని మరచి దాచుకోడం, దోచుకోవడమే ధ్యేయమన్నట్లు ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఇప్పుడు వారిని నట్టేట ముంచారు’ అని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. సింగరాయకొండలో అధికార పార్టీ నేతల మధ్య నడుస్తున్న అధిపత్య పోరులో సామాన్యులు నలిగిపోతున్నారన్నారు. తరచూ హత్యలు, దాడులు చోటుచేసుకొంటుండటంతో వణికిపోతున్నారని విమర్శించారు. సింగరాయకొండలో మంగళవారం నిర్వహించిన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో స్వామి పాల్గొన్నారు. తొలుత ఆయన స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. అనంతరం టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌, జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాలలు వేసి స్వామి నివాళులర్పించారు. అనంతరం ప్రచారరథంప్జైకి ఎక్కి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సింగరాయకొండలోని ఉన్నతశ్రేణి వైద్యశాలను పీహెచ్‌సీ స్థాయికి దిగజార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. తండ్రి వైఎస్సార్‌ హయాంలో ఆసుపత్రి స్థాయి పెరిగితే తనయుడు పాలనలో కుదించడం జరిగిందన్నారు. ఇదేమి ఖర్మ జగన్‌.. అంటూ ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. టీడీపీ హయాంలో ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఇప్పుడు రకరకాల కొర్రీలతో ఆ పథకానికి మంగళం పాడారని దుయ్యబట్టారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విదేశీవిద్య పథకాన్ని వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా మూలకు నెట్టిందన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా ఆపథకాన్ని జగనన్న విదేశీవిద్య అని మార్చుకున్నదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పింఛన్‌ ఇస్తానని చెప్పిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పారన్నారు. ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు వారిని నట్టేట ముంచారని మండిపడ్డారు.

స్థానిక సమస్యల ప్రస్తావన

ఎమ్మెల్యే స్వామి తన ప్రసంగంలో స్థానిక సమస్యలను ప్రస్తావించారు. టీడీపీ హయాంలో ట్రంకురోడ్డుకు ఇరువైపులా డివైడర్‌ను ఏర్పాటు చేసి సెంటర్‌ లైటింగ్‌ సిస్టమ్‌తో పట్టణ వాతావరణాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో రోడ్డుపై పడిన గుంతలను పూడ్చలేక ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రైల్వే స్టేషన్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తే వైసీపీ నేతలు బోర్డు తగిలించుకున్నారని విమర్శించారు. చాపల మార్కెట్‌ను తాము నిర్మిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ రంగులు వేసుకున్నారని దుయ్యబట్టారు. రూర్బన్‌ పథకం కింద మండలానికి తాను రూ.100 కోట్లు నిధులు తెచ్చి వీటిలో 60 కోట్లతో అభివృద్ధి పనులు చేశానన్నారు. మిగిలిన నిధులున్నా పనులు చేయలేని అసమర్థులు వైసీపీ నేతలని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉండే సింగరాయకొండలో హత్యలు, దాడులు, దొంగతనాలు, గంజాయి, మాదక ద్రవ్యాల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్వామి విమర్శించారు. అధికారపార్టీ నేతల మధ్య అధిపత్య పోరులో భాగంగానే ఎస్సీకాలనీపై దాడి, జాతీయ రహదారిపై హత్య జరిగిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా అభివృద్ధి శూన్యమన్నారు.

పోలీసులు అడ్డగించే ప్రయత్నం

ప్రభుత్వ వైద్యశాల నుంచి టీడీపీ శ్రేణులు డీజేతో ర్యాలీగా బయల్దేరగా ఎస్సై ఫిరోజ్‌ఫాతిమా ఆధ్వర్యంలో పోలీసులు పలుసార్లు మైక్‌కు అనుమతి లేదని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే స్వామి వారించి ర్యాలీని ముందుకు నడిపారు.

భారీ ఎత్తున పాల్గొన్న టీడీపీ శ్రేణులు

మండలంలో తొలిసారిగా నిర్వహించిన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి పది గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, చీమకుర్తి కృష్ణ, షేక్‌ సంధానిబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు, చీమకుర్తి వెంకటేశ్వర్లు, కూనపురెడ్డి సుబ్బారావు, పులి ప్రసాద్‌, గాంధీ చౌదరి, మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు, వేల్పుల వెంకట్రావు, షేక్‌ అజీం, అబ్దుల్‌ సుభానీ, గుదే వెంకటేశ్వర్లు, షేక్‌ సనావుల్లా, మండలంలో పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు,

Updated Date - 2022-12-06T23:17:39+05:30 IST