ఉపాధి హామీలో రాజకీయ జోక్యం నివారించాలి

ABN , First Publish Date - 2022-06-07T06:42:01+05:30 IST

ఉపాధి హామీ పథకంలో రాజకీయ నాయకుల జోక్యాన్ని నివారించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీలో రాజకీయ జోక్యం నివారించాలి
నిరసనలో పాల్గొని మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర

టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి (హనుమంతునిపాడు), జూన్‌  6 : ఉపాధి హామీ పథకంలో రాజకీయ నాయకుల జోక్యాన్ని నివారించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. హనుమంతునిపాడులో ఉపాధి కూలీ సంఘం, టీడీపీ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ఉగ్ర సంఘీభావం తెలిపి మాట్లాడారు. కూలీలు ఎంపిక చేసిన వ్యక్తినే మేట్‌గా నియమించాలని నిబంధనలు ఉండగా, అధికారులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తిని నియమించడంపై ఉగ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ముట్టడి కార్యక్రమం జరుగుతున్నా కార్యాలయంలో ఒక్క అధికారి కూడా లేకపోవటంపై విస్మయం వ్యక్తం చేశారు. యథారాజా.. తథా ప్రజా అన్నట్లు సీఎం జగన్‌ రెడ్డి పాలన, స్థానిక నేతల తీరు, ప్రభుత్వాధికారుల వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. గ్రామంలో లేకుండా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే వారి పేర్లతో ఉపాధి పనులు చేసుకోవడంపై నిలదీశారు. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. నిరసన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎస్సై కృష్ణపావని ఫోన్లో ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఫోన్‌లో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తొలుత సంఘ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బస్టాండు సెంటరు నుంచి ఉపాధి హామీ కూలీలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ నిరసనగా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, రెడ్డెం తిరుపతిరెడ్డి(ఆర్‌టీఆర్‌), మురహరి నరసయ్య, గాయం రామిరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, బ్రహ్మంగౌడ్‌, దోసపాటి శివకుమారి, ఉపాధి కూలీలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-07T06:42:01+05:30 IST