పంచాయతీ సర్పంచ్‌ల ప్రకోపం

ABN , First Publish Date - 2022-09-09T05:06:25+05:30 IST

గ్రామ పంచాయతీల పరిస్థితి దయనీయంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో అత్యవసర పనులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. సాధారణ నిధులపై ఫ్రీజింగ్‌ విధించడం, ఆర్థిక సంఘం నిధులు జమచేకపోవడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు.

పంచాయతీ సర్పంచ్‌ల ప్రకోపం
ఆందోళన చేస్తున్న సర్పంచ్‌లు

పల్లెల అభివృద్ధిపై ఆందోళన

సాధారణ నిధుల వినియోగంపై

ప్రభుత్వం ఫ్రీజింగ్‌

ఆర్థిక సంఘం నిధులూ 

జమ చేయని వైనం

పెండింగ్‌ బిల్లులకు లభించని మోక్షం

ఆందోళనలో పాలకవర్గాలు 

పనులు చేయలేకపోతున్నామని ఆవేదన

మండల సమావేశాలను బహిష్కరించి నిరసన

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 8 : గ్రామ పంచాయతీల పరిస్థితి దయనీయంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో అత్యవసర పనులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. సాధారణ నిధులపై ఫ్రీజింగ్‌ విధించడం, ఆర్థిక సంఘం నిధులు జమచేకపోవడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. నిధులు ఇవ్వకుండా పాలన ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ సర్పంచులే ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే కంభం, అర్ధవీడు మండలాల్లోని అధికార పార్టీ సర్పంచులు మండల సమావేశాలను బహిష్కరించి నిరసన తెలిపారు. 


ఆర్థిక సంఘం నిధులను జమ చేయని ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం పది రోజుల క్రితం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.324 కోట్లను విడుదల చేసింది. వాటిని జనాభానిష్పత్తి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో జమ  చేయాల్సి ఉంది. కానీ  అలా చేయకుండా నిధులను నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా పంచాతీల్లో ఉన్న సాధారణ నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు వస్తాయనే ఆశతో సర్పంచ్‌లు పంచాయతీల్లో పలు రకాల పనులను చేపట్టారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో గ్రామాల్లో సిమెంట్‌ కాలువలతోపాటు పలు అభివృద్ధి పనులు చేశారు. అందుకు సంబంధించిన బిల్లులను ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లో రూ.22 కోట్లు జిల్లాకు రావాల్సి ఉండగా పైసా కూడా విడుదల చేయలేదు. 


ఆర్థిక సంఘం నిధులకూ టెండర్‌!

కేంద్రం పంచాయతీలకు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ పెట్టింది. వీటిని విద్యుత్‌ బిల్లుల బకాయిలకు జమ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఇలా వచ్చిన నిధులను వచ్చినట్లు లాగేసుకుంటూ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం కోట్లాది రూపాయాల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల పేరుతో స్వాహా చేసింది. తాజాగా వచ్చిన సొమ్మును కూడా అదే రీతిలో జమ చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుండటంపై సర్పంచ్‌లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. 


రోడ్డెక్కుతున్న సర్పంచ్‌లు

ప్రభుత్వం గ్రామ పంచాయతీల పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సర్పంచ్‌లు రోడ్డెక్కుతున్నారు. విభజన అనంతరం జిల్లాలో 660 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో సుమారు రూ.20 కోట్లకుపైగా సాధారణ నిధులు ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల నుంచి జిల్లాకు   సుమారు రూ.22 కోట్లు  రావాల్సి ఉంది. ఈ రెండూ కలిపి సుమారు రూ.42 కోట్ల వరకూ ఉండాలి. అయితే ప్రభుత్వం ఒకవైపు సాధారణ నిధులను డ్రా చేసుకోకుండా పంచాయతీ ఖాతాలను  ఫ్రీజింగ్‌లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిఽధులను సైతం జమ చేయకపోవడంతో సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వైసీపీకి జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కొండంత అండగా ఉంటుంది. ఇప్సుడు ఆ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధులే ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కంభం, అర్ధవీడు తదతర మండలాల్లో దాదాపు అందరూ వైసీపీ సర్పంచ్‌లే ఉన్నారు. వారంతా ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. మంగళ, బుధవారాల్లో మండల సమావేశాలను బహిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  

Read more