కొనసాగుతున్న నిర్బంధం

ABN , First Publish Date - 2022-08-31T06:08:39+05:30 IST

సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు మిలియన్‌ మార్చ్‌, సీఎం ఇంటిముట్టడిని వాయిదా వేసినట్లు ప్రకటించినా.. పోలీసులు మాత్రం వారిని వదలడం లేదు.

కొనసాగుతున్న నిర్బంధం
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

21మంది సీపీఎస్‌ ఉద్యోగులపై  క్రిమినల్‌ కేసులు

104 మంది బైండోవర్‌ 

ఆగని పోలీసుల తనిఖీలు

ఒంగోలు(క్రైం), ఆగస్టు 30: సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు మిలియన్‌ మార్చ్‌, సీఎం ఇంటిముట్టడిని వాయిదా వేసినట్లు ప్రకటించినా.. పోలీసులు మాత్రం వారిని వదలడం లేదు. అంతటా కఠిన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15మంది ఉద్యోగ సంఘ నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ చెక్‌పోస్టులు తీసివేయకుండా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. వందమందికిపైగా ఉద్యోగులను పోలీసుస్టేషన్లకు పిలిపించారు. అలాగే బైండోవర్‌లూ చేస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల ఇళ్లపైనా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. ఒంగోలు సబ్‌డివిజన్‌లో ఒంగోలు తాలుకా, వన్‌టౌన్‌, టంగుటూరు, చీమకుర్తి, కొత్తపట్నంలలో ఐదుగురు నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. సీఎం ఇంటి ముట్టడికి కుట్ర చేస్తున్నట్లు వారిపై పోలీసులు నేరం మోపారు.


ఇంకా ఆంక్షలు.. వేధింపులు

మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రబ్బానీబాషాను ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. మంగళవారం రాత్రి వరకు పోలీసు స్టేషన్‌లో ఉంచారు. ఆయన సీపీఎస్‌ ఉద్యోగుల సంఘానికి ఉపాధ్యక్షుడు కావడం చేసిన నేరం. అందుకోసం రెండురోజులుగా పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. ఇంకా రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, జాతీయరహదారులపై ఏర్పాటుచేసిన సీపీఎస్‌ చెక్‌పోస్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముట్టడిని వాయిదా వేసుకున్నప్పటికీ పోలీసులు వేధింపులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. అంతేకాకుండా పోలీసులు ఉద్యోగ సంఘాల నేతల ఇళ్లపై డేగకన్ను వేసి ఉంచారు. వారి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు.


ఉద్యోగ సంఘాల నేతలపై క్రిమినల్‌ కేసులు

సీపీఎస్‌ ఉద్యోగ సంఘ నేతలపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 21మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. సీఎం ఇంటి ముట్టడికి కుట్ర చేశారని నేరం మోపి రెండురోజులుగా పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. మంగళవారం రాత్రి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నారు.


ఆగని తనిఖీలు

జిల్లావ్యాప్తంగా ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లు, హైవేపై వాహనాలను నిలిపి సోదాలు చేయడాన్ని పోలీసులు ఆపలేదు. మంగళవారం రాత్రి వరకూ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఉద్యోగసంఘాల నాయకుల కదలికలపై నిఘా ఉంచారు. వారి సెల్‌ఫోన్‌లు ట్రాకింగ్‌ పెట్టారు. పోలీసులు వినాయకచవితి భద్రతను కూడా వదలివేసి ఉద్యోగులను వెంటాడుతు న్నారు. పోలీసులు చర్యలపై ఉద్యోగసంఘాల నేతలు మండిపడుతున్నారు. 


Read more