ఎవరికీ పట్టని ‘జీరో’

ABN , First Publish Date - 2022-11-16T22:56:40+05:30 IST

రైతులు సంపూర్ణ హక్కు కల్గిన పట్టాభూముల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన జీరో ఖాతాల్లో నమోదయ్యాయి. సుమారు ఎనిమిది వేల జీరో ఖాతాల్లో ఐదువేల ఎకరాల భూములు నమోదు కావటంతో మండలంలోని అనేక గ్రామాల రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ప్రతి గ్రామం లో కనీసం పది ఖాతాల పైనుంచే ఉన్నాయి. ఆ భూములను క్రమబద్దీకరణ చేసుకొని హక్కు కల్పించుకునేందుకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎవరికీ పట్టని ‘జీరో’

ఆ ఖాతాలలో నమోదైన పట్టాభూములతో రైతులకు ఇబ్బందులు

సర్వ హక్కులూ కోల్పోయిన కర్షకులు

ఏళ్ల తరబడి నోచుకోని క్రమబద్దీకరణ

ముఖ్యంగా వ్యవసాయ రుణాలు అందక ఇబ్బందులు

ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఫైలు

దర్శి, నవంబరు 16 : రైతులు సంపూర్ణ హక్కు కల్గిన పట్టాభూముల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన జీరో ఖాతాల్లో నమోదయ్యాయి. సుమారు ఎనిమిది వేల జీరో ఖాతాల్లో ఐదువేల ఎకరాల భూములు నమోదు కావటంతో మండలంలోని అనేక గ్రామాల రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ప్రతి గ్రామం లో కనీసం పది ఖాతాల పైనుంచే ఉన్నాయి. ఆ భూములను క్రమబద్దీకరణ చేసుకొని హక్కు కల్పించుకునేందుకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ప్రస్తుతం రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్న రికార్డుల్లో వారికి ఎటువంటి హక్కు లేకుండా పోయింది. వ్యవసాయ రుణాలు తీసుకోవాలన్నా ఇబ్బందిగా మారింది. రైతులు వందలాది మంది ఈ భూములు క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు చేసుకోవటంతో కొద్దినెలల క్రితం రెవెన్యూ అధికారులు మండలంలో జీరో ఖాతాల్లో పడిన భూముల వివరాలను క్రమబద్దీకరణ కోసం జిల్లా అధికారులకు పంపారు. జిల్లా అధికారులు అమరావతిలోని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్టేషన్‌ శాఖకు పంపారు. ప్రస్తుతం జీరో ఖాతాల విడుదల ఫైలు అక్కడ పెండింగ్‌లో ఉండడంతో మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ కార్యాలయం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఆ భూములను జీరో ఖాతాల నుండి 90099 నోషనల్‌ ఖాతాకు ముందుగా మార్చాలి. ఆ తర్వాత నోషనల్‌ ఖాతా నుంచి హక్కు కల్గిన రైతుల పేరు మీద ఖాతాలకు ఎక్కించాల్సి ఉంది. అమరావతి నుంచి ఆ ఫైలు ఎప్పుడు మోక్షం కల్గుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ ఎం శ్రావణ్‌కుమార్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా జీరో ఖాతాల్లో చేరిన భూములను క్రమబద్దీకరించేందుకు కొన్ని నెలల క్రితం ఉన్నతాధికారులకు పంపామన్నారు. వారి అనుమతి రాగానే ఆ భూములను రైతులకు హక్కు కల్గేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-11-16T22:56:40+05:30 IST

Read more