ఎవరికీ పట్టా ఇవ్వలేదు

ABN , First Publish Date - 2022-02-23T06:40:54+05:30 IST

రంగుల ఫ్యాక్టరీ పక్కన ఉన్న స్థలంలో రెవెన్యూ పరంగా ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని సంతనూతలపాడు తహసీల్దార్‌ రామానాయుడు తెలిపారు.

ఎవరికీ పట్టా ఇవ్వలేదు
ఆక్రమిత స్థలాన్ని పరిశీలిస్తున్న సంతనూతలపాడు తహసీల్దార్‌ రామానాయుడు

రికార్డు ప్రకారం అది దేవదాయ భూమి

వివాదాస్పద భూమిని పరిశీలించిన తహసీల్దార్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ఒంగోలు(క్రైం), ఫిబ్రవరి 22 : రంగుల ఫ్యాక్టరీ పక్కన ఉన్న స్థలంలో రెవెన్యూ పరంగా ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని సంతనూతలపాడు తహసీల్దార్‌ రామానాయుడు తెలిపారు. ‘భూంఫట్‌’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు కదిలారు. మంగళవారం సాయంత్రం తహసీల్దార్‌ తన సిబ్బందితో కలిసి వెళ్లి భూమిని పరిశీలించారు. సర్వే నంబర్‌ 105లో ఉన్న 24 ఎకరాల 32సెంట్లు ఇనామ్‌ భూమిగా నిర్ధారించారు. ఉప్పు రంగరాయుడు ఇనామ్‌ భూమిగా ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డులో ఉందని తెలిపారు. అంటే ప్రస్తుతం ఆ భూమి దేవదాయశాఖ వారిదన్నారు. అయితే కొంత భూమిలో మున్సిపాలిటీకి చెందిన ఫిల్టర్‌ బెడ్లు ఉన్నాయని, మరి కొంతభాగంలో రంగుల ఫాక్టరీ ఉందన్నారు. మున్సిపాలిటీ వారు ఇప్పటివరకు చెత్త వేసిన ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు చదును చేశారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేక్రమంలో దేవదాయశాఖ, ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు లేఖలు రాశామన్నారు. సమగ్రంగా రికార్డులను పరిశీలించి భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట సర్వేయర్‌ నాళం వెంకటేశ్వర్లు, వీఆర్వోలు మనోహర్‌రెడ్డి, గాంధీ ఉన్నారు. 

Read more