జగన్‌ పాలనలో ప్రజలపై బాదుడేబాదుడు

ABN , First Publish Date - 2022-09-13T06:24:18+05:30 IST

జగన్‌ పాలనలో ‘కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి’ అన్న చందంగా సాగుతోందని ఎర్రగొండపాలెం నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు ఆరోపించారు.

జగన్‌ పాలనలో ప్రజలపై బాదుడేబాదుడు
ర్యాలీ నిర్వహిస్తున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు

పెద్ద దోర్నాల, సెప్టెంబరు 13: జగన్‌ పాలనలో ‘కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి’ అన్న చందంగా సాగుతోందని ఎర్రగొండపాలెం నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు ఆరోపించారు. దోర్నాలలో టీడీపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో అమలు చేస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ  టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా ధరలు మండిపోతున్నాయన్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. మొన్నటి వరకు క్వింటా రూ.10వేలు, రూ.12 వేలు పలికిన పత్తి రైతు చేతికొచ్చే సరికి నాలుగైదు వేలకు పడిపోయిందన్నారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా కనీసం రూ.9,000లకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసాకేంద్రాలు అలంకార ప్రాయంగా మిగిలాయన్నారు. రైతులకు ఏపాటి ఉపయోగపడుతున్నాయో ‘జగనెరిగిన సత్యమే’ అని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఆర్‌టీసీ బస్సు చార్జీలు, కరంటు చార్జీలు రెండింతలు పెరిగాయన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎన్నిసార్లు పెంచారో వారికే తెలియాలన్నారు. నిత్యావసర సరుకులు మధ్యతరగతి, పేద వారు కొనే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికీ ఇసుక కొరత తీరలేదన్నారు. సారా కాస్తున్నారని గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ‘ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం’ అన్నచందంగా ప్రభుత్వం అమ్మఒడి అమ్మ అకౌంటులో కొంత నగదు జమచేసి నాశిరకం మద్యం బ్రాండ్లతో పేదల సొమ్మును, ఆరోగ్యాన్ని దోచేస్తోందన్నారు.  పన్నులు పెంచి మధ్యతరగతి జేబులను గుళ్ల చేస్తోందన్నారు. మూడేండ్లలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదన్నారు. స్వపక్ష ప్రజలు కూడా అసంతృప్తితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మళ్లీ మంచి రోజులు రావాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నా రన్నారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ మాబు, బట్టు సుధాకర్‌ రెడ్డి, వెచ్చా హరగోపాల్‌, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ సమ్మద్‌ భాష, టీ చెన్నారెడ్డి, రావిక్రింధి సుబ్బరత్నం, కే శ్రీనివాస యాదవ్‌, ఇస్మాయిల్‌, షేక్‌ భాష, వై చంచయ్య, కే దానం, జడి లక్ష్మయ్య, నాగెళ్ల సత్యనారాయణ, కే సుబ్బారెడ్డి, షేక్‌ రఫీ, మౌలాలి పాల్గొన్నారు.

టీఎన్‌టీయూసీ కార్యదర్శిగా మల్లయ్య

పెద్ద దోర్నాల : ఒంగోలు పార్లమెంటు టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శిగా ఈదర మల్లయ్య నియమితులయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నియమించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షులు కే అచ్చన్నాయుడు, పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజి, నియోజకవర్గం ఇంచార్జి గూడూరి ఎరిక్షన్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Read more