మొక్కు‘బడి’

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

నాడు-నేడు అంటూ ప్రభుత్వం ఆర్భాటం చేసింది. పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ప్రగల్భాలు పలికింది. ఒక్కో విద్యా సంవత్సరంలో ఒక్కో దశ చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క దశ పనులను పూర్తి చేసింది. రెండో దశ నాడు-నేడు కార్యక్రమం కింద 2021 ఆగస్టు 16న 444కు స్కూళ్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది.

మొక్కు‘బడి’
చిలకచెర్లలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పాఠశాల భవనం (ఇన్‌సెట్లో) పెద్దన్నపాలెంలో దెబ్బతిన్న శ్లాబు

నాడు-నేడు రెండో దశ పనుల్లో పురో‘గతి’ కరువు

మంజూరైన పాఠశాలలు 445

పనులు ప్రారంభించినవి 162

వెంటాడుతున్న నిధుల కొరత

అధికారుల నిర్లక్ష్యం 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం

రేపటి నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం

సమస్యలు యథాతథం

ఒంగోలు, జూలై 3 (ఆంధ్రజ్యోతి) :

దొనకొండ మండలంలోని చిన్నగుడిపాడు పాఠశాల శిథిలావస్ధకు చేరింది. నూతన భవన నిర్మాణం చేపట్టకపోవటంతో రెండేళ్లుగా చిన్న రేకుల అద్దె గదిలో కొనసాగిస్తున్నారు. పెద్దన్నపాలెం, చందవరం పాఠశాలల్లో తరగతి గదుల కొరత ఉంది. ఉన్నగదుల్లో శ్లాబులు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. 

పామూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గదుల కొరత వేధిస్తోంది. ఇక్కడ గత ఏడాది 950 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈఏడాది అడ్మిషన్ల సంఖ్య వెయ్యికి చేరే అవకాశం ఉంది. అంతమంది విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న 14 గదుల్లోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది.  నాడు-నేడు రెండో విడత కింద అదనపు గదుల కోసం నిధులు మంజూరైప్పటికీ పాఠశాల ప్రాంగణంలో తగినంత స్థలం లేకపోవడంతో రద్దయ్యాయి. 

పెద్దదోర్నాల మండలం చిలకచెర్ల ప్రాథమిక పాఠశాలలో 80 మంది విద్యార్థులకు రెండు గదులు మాత్రమే ఉన్నాయి. గతంలో నిర్మించిన అదనపు తరగతుల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఉపాధ్యాయులు వరండాలో, ఆరుబయట చెట్లకింధ తరగతులు చెబుతున్నారు. 

ప్రభుత్వం ఆర్భాటంగా పథకాలను ప్రకటించడం, వాటిని మొక్కుబడిగా అమలు చేసి మమ అనిపించడం రివాజుగా మారింది. ఆ జాబితాలో మనబడి నాడూ-నేడు కూడా చేరిపోయింది. ఈ పథకం రెండో దశ తీరును పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. నిధుల కొరత, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో పనుల్లో పురోగతి కరువైంది. దీంతో విద్యార్థులు సమస్యల మధ్య చదువులు సాగించాల్సి వస్తోంది. శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ విద్యనభ్యసించాల్సిన దుస్థితి నెలకొంది. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు యథావిథిగా సమస్యలు స్వాగతం పలకనున్నాయి. 


 నాడు-నేడు అంటూ ప్రభుత్వం ఆర్భాటం చేసింది. పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ప్రగల్భాలు పలికింది. ఒక్కో విద్యా సంవత్సరంలో ఒక్కో దశ చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌కు దీటుగా  తీర్చిదిద్దుతామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క దశ పనులను పూర్తి చేసింది. రెండో దశ నాడు-నేడు కార్యక్రమం కింద 2021 ఆగస్టు 16న 444కు స్కూళ్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. కానీ ఇప్పటి వరకూ 162 పాఠశాలల్లో మాత్రమే మొక్కుబడిగా పనులు ప్రారంభించారు. మిగిలిన చోట్ల అతీగతీ లేకుండాపోయింది. 

2021 ఆఖరు వరకూ కొనసాగిన తొలిదశ పనులు 

ప్రభుత్వ విద్యా సంస్థల్లో  మూడు విడతల్లో సమగ్ర సౌకర్యాలు కల్పిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో విద్యా సంవత్సరంలో ఒక్కో దశ పూర్తి కావాల్సి ఉండగా 2019-20లో చేపట్టిన తొలిదశ నాడు-నేడు పనులు 2021 ఆఖరు వరకూ కొనసాగాయి. నాడు-నేడు రెండో దశ పనులు చేపట్టి పది మాసాలు గడుస్తోంది. ఈనెల 5నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా పనుల్లో మాత్రం పురోగతి కరువైంది. 

గత ఏడాది ఆగస్టులో రెండో దశ పనులకు పరిపాలనా ఆమోదం

రెండో దశ నాడు-నేడు కార్యక్రమానికి 2021 ఆగస్టు 16న ప్రభుత్వం పరిపాలనా ఆమోదం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.4,446 కోట్లతో 14,082 పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చనున్నట్లు ప్రకటించింది. అందులో జిల్లాలో 713 స్కూళ్లు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో రక్షిత తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ఫ్యాన్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్‌, కిచెన్‌ షెడ్లు, కాంపౌండ్‌ వాల్స్‌,  అదనపు తరగతి గదులు నిర్మాణం, స్మార్ట్‌ టీవీల ఏర్పాటు తదితర పలు సౌకర్యాలు ఈ పథకంలో భాగంగా చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా డీఈవో కన్వీనర్‌గా మొత్తం 16 మందితో, అలాగే ఎంపీడీవో చైర్మన్‌గా మండల  స్థాయిలో ఏడుగురితో పర్యవేక్షణ కమిటీ ఉంది. పథకం అమలు తీరు, చర్యలపై జిల్లా, మండల స్థాయిలో గత ఏడాది సెప్టెంబరులో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 

తొలుత 713 పాఠశాలలు.. తర్వాత 455కు కుదింపు 

 రెండో దశ  నాడు-నేడు జీవోలో జిల్లాకు సంబంధించిన తొలుత 713 పాఠశాలలు ప్రకటించినప్పటికీ అనంతరం వాటిని 500కు తగ్గించారు. వాటిలో రూ.157 కోట్లతో 1,309 అదనపు తరగతుల నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.78.13 కోట్లు వెరసి మొత్తం రూ.235.21 కోట్లు మంజూరు చేశారు. అయితే సమగ్ర అంచనాల అనంతరం పాఠశాలల సంఖ్య 455కు తగ్గించి వాటిలో 444కు మాత్రమే పరిపాలన అమోదం ఇచ్చారు. 

ఇంజనీరింగ్‌ విభాగాలకు పర్యవేక్షణ బాధ్యతలు 

విద్యా కమిటీల నేతృత్వంలో నాడు-నేడు పనులు జరగాల్సి ఉంది. భారీగా పనులు ఉండటం, విద్యా సంవత్సరం ప్రారంభంలోపే పూర్తి లక్ష్యం పేరుతో పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్‌, ప్రజారోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ తదితర ఇంజనీరింగ్‌ విభాగాలకు అప్పగించారు. విద్యా కమిటీలు తక్షణం పనులు మొదలు పెట్టేందుకు వీలుగా ఆయా పాఠశాలలకు 15శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ను కూడా ఇచ్చారు. అలా జిల్లాలో 378 పాఠశాలలకు రూ.27.09 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 

162 స్కూళ్లలో మొక్కుబడిగా పనులు 

విద్యా సంస్థలు మంగళవారం నుంచి పునఃప్రారంభమవుతున్నప్పటికీ అత్యధిక పాఠశాలల్లో ఇంత వరకూ పనులు పది శాతం కూడా కాలేదు. కొన్నిచోట్ల అసలు ప్రారంభమే కాలేదని తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు కేవలం 162 పాఠశాలల్లో మాత్రమే మొక్కుబడిగా పనులు చేపట్టారు. గిద్దలూరు కొండపి, అర్థవీడు, కొమరోలు, పామూరు తదితరర మండలాల్లో రివ్వాల్వింగ్‌ ఫండ్‌ ఇచ్చిన పాఠశాలల్లో ఒక్కదానిలో కూడా పనులు ప్రారంభం కాలేదు. హనుమంతునిపాడు, పీసీ పల్లి, పొదిలి, మర్రిపూడి తదితర మండలాల్లో మొక్కుబడిగా ఒక్కో పాఠశాలలో ప్రారంభమైనట్లు చూపుతున్నారు. 

ముందుకురాని కాంట్రాక్టర్లు 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల విద్యా కమిటీలు ఈ పనులు చేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో సివిల్‌ పనులకు కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు.మరోవైపు పలు రకాల వసతులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో టెండర్ల ఖరారులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో నాడు-నేడు రెండో దశ పనులు ముందుకు సాగకపోతుండగా పాఠశాలలు పునఃప్రారంభం అనంతరం పనుల నిర్వహణ కష్టతరం కానుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనేక స్కూళ్లలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉన్న చోట్లా నీటి కొరతతో వినియోగంలో లేవు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారికి సరిపడా గదులు లేక ఇరుకు గదుల్లో కుక్కుతున్నారు. కొన్ని చోట్ల ఆరుబయట కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఈ సమస్యలన్నీ విద్యార్థులను వెంటాడనున్నాయి. 


నాడు-నేడు రెండో దశ మంజూరైన పాఠశాలలు : 445

పరిపాలన ఉత్తర్వులు ఇచ్చినవి: 444

రివ్వాల్వింగ్‌ ఫండ్‌ అందినవి: 378

రివ్వాలింగ్‌ ఫండ్‌ మొత్తం : రూ 27.08 కోట్లు

పనులు ప్రారంభించినవి: 162

ఖర్చు చేసిన మొత్తం : రూ 2.54 కోట్లు 


Read more