మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం అందజేయాలి

ABN , First Publish Date - 2022-10-05T04:34:29+05:30 IST

మండలంలోని విజయ్‌నగర్‌ కాలనీలో సోమవారం విద్యుత్‌ పనులు చేస్తూ కె.సామ్మేలు అనే యువకుడు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు.

మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం అందజేయాలి
ధర్నాలో మాట్లాడుతున్న టీడీపీ నేత గౌరీఅమర్‌నాధ్‌

 ప్రజాసంఘాలు డిమాండ్‌

గడియారం స్తంభం సెంటర్‌లో ధర్నా

చీరాల, అక్టోబరు 4: మండలంలోని విజయ్‌నగర్‌ కాలనీలో సోమవారం విద్యుత్‌ పనులు చేస్తూ కె.సామ్మేలు అనే యువకుడు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. మృతుని కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని, విద్యుత్‌ కాంట్రాక్టర్‌, విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్‌ అధికారుల పై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విజయ్‌నగర్‌ కాలనీ వాసులతో పాటు పలు పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు స్థానిక గడియార స్తంభం సెంటర్లో మంగళవారం ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.   

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, ఎం.గౌరీఅమర్‌నాధ్‌, బీఎస్పీ నియోజకవర్గ బాధ్యుడు జి.రవికుమార్‌ తదితరులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలలో కనీసం మానత్వంతో కూడా స్సందించని పరిస్థితి చూస్తుంటే హృదయం ద్రవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు రూ.1 కోటి పరిహారంగా ఇవ్వాలని, అతని భార్యకు ఉద్యోగం కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

ఇదిలాఉంటే విద్యుత్‌శాఖపరంగా ఆ శాఖ విజిలెన్స్‌ విచారణలో పూర్తివిషయాలు తెలిసే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల పక్షాన కొందరు రాజీ ప్రయత్నాలకు తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఉదయం 10 గంటల నుంచి ధర్నా ప్రారంభం కాగా సాయంత్రం వరకు సాగింది.

ఎట్టకేలకు పోలీసులు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీత సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. 

ఎమ్మెల్యే బలరాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్‌ ఎస్‌ఈతో శాఖాపరంగా, ప్రభుత్వవరంగా పూర్తి న్యాయం జరిగేందుకు మాట్లాడగా, వారు సానుకూలంగా స్పందించారు.



Updated Date - 2022-10-05T04:34:29+05:30 IST