ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2022-11-08T00:50:45+05:30 IST

నేరస్థులే పాలకులై రాజ్యాన్ని ఏలుతుంటే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఎలా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

ఆచార్య రంగా జయంతి సభలో ఎంపీ కనకమేడల

ఒంగోలులో ఘనంగా కార్యక్రమం

ఒంగోలు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): నేరస్థులే పాలకులై రాజ్యాన్ని ఏలుతుంటే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఎలా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ప్రజలు గుర్తించి రాజకీయాల నుంచి పక్కనపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. స్థానిక రంగా భవన్‌లో సోమవారం నిర్వహించిన ఆచార్య ఎన్‌జీ రంగా 122వ జయంతి సభలో రవీంద్రకుమార్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ఆరు దశాబ్దాల పార్లమెంటేరియన్‌గా రైతులు, వివిధవర్గాల ప్రజల సమస్యలపై ఆచార్య రంగా పనిచేశారని, అలాంటి రంగా పార్లమెంటరీ వ్యవస్థకు దిక్సూచి వంటి వారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అంటే అధికార మదంతో రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడం అన్నట్లుగా వ్యవహరిస్తున్నార న్నారు. ప్రశ్నిస్తే ప్రభుత్వంలో ఉన్నవారు ప్రత్యర్థి పార్టీల వారిని రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా పరిగణిస్తున్నారన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు ట్రస్టీలమన్న సంగతి మరిచి నీచ రాజకీయాలను చేస్తున్నారన్నారు. ఆర్థిక ఆరాచకాలు, అవినీతి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా ముఠా రాజకీయాల పెత్తందారీ పాలన చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాలపై ఆచార్య రంగా స్ఫూర్తితో మార్పు కోసం పోరాడాలన్నారు. వ్యవస్థల రక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా నడుంబిగించాలని కోరారు. రంగా కిసాన్‌ సంస్థ ఉపాధ్యక్షుడు నామినేని మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో కార్యదర్శి చుంచు శేషయ్య, ఒంగోలు కేంద్రంగా సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరించారు. మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, డాక్టర్‌ దివి శివరాం, డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రంగా రైతులకు చేసిన సేవలను కొనియాడారు.

పలువురికి పురస్కారాలు

ఈ సందర్భం గా రావిపాటి మల్లికార్జునరావు (ఉత్తమ రైతు), వెల్లలచెరువు సొసైటీ (ఉత్తమ పీఏసీఎస్‌), ఆలకూరపాడు పాలకేంద్రం (ఉత్తమ పాల సొసైటీ), పెట్లూరివారిపాలెం ఎత్తిపోతల పథకం (ఉత్తమ ఎల్‌ఐస్కీం) కొల్లా అఖిల (ఉత్తమ అగ్రికల్చర్‌ విద్యార్థి), దివ్వెల ప్రణీత్‌కుమార్‌ (ఉత్తమ వ్యవసాయ ఇంజనీరింగ్‌ విద్యార్థి)లకు పురస్కారాలను అందజేశారు. అలాగే నన్నపనేని శిరీష స్మారక అవార్డును నర్శింగోలుకు చెందిన పోతూరి కృష్ణకు ఇచ్చారు. కార్యక్రమంలో రంగా కిసాన్‌ సంస్థ ప్రతినిధులు మండవ శ్రీనివాసరావు, మండవ రంగారావు, నాగేశ్వరరావు, యర్రమనేని శేషయ్య పాల్గొన్నారు. అంతకు ముందు ఒంగోలు ఏఎంసీ కార్యాలయ ఎదురుగా ఉన్న ఆచార్య రంగా విగ్రహానికి నాయకులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2022-11-08T00:50:45+05:30 IST

Read more