తవ్వుకొంటాం.. అమ్ముకొంటాం!

ABN , First Publish Date - 2022-09-26T04:37:43+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ క్వారీయింగ్‌ జోరుగా సాగుతోంది. వైసీపీకి చెందిన పలువురు నాయకులు ప్రైవేటు వ్యక్తుల వద్ద భూములు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తోడుస్తున్నారు. ట్రాక్టర్లు, లారీలలో యథేచ్ఛగా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

తవ్వుకొంటాం.. అమ్ముకొంటాం!
పోలవరంలో అనధికార రీచ్‌ నుంచి ఇసుక లారీలకు ఎత్తుతున్న అక్రమార్కులు , దీక్షితులవారిపాలెంలో అధికారులు సీజ్‌ చేసిన ఇసుకను ఎత్తుతున్న అక్రమార్కులు

ముండ్లమూరు మండలంలో 

రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు

ప్రైవేటు భూముల కొనుగోలు

అనుమతుల్లేకుండా జోరుగా

ఇసుక అక్రమ క్వారీయింగ్‌ 

లారీలు, ట్రాక్టర్‌లలో రవాణా 

మామూళ్ల మత్తులో పోలీసులు, అధికారులు 

ముండ్లమూరు, సెప్టెంబరు 25 : మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ క్వారీయింగ్‌ జోరుగా సాగుతోంది. వైసీపీకి చెందిన పలువురు నాయకులు ప్రైవేటు వ్యక్తుల వద్ద భూములు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తోడుస్తున్నారు. ట్రాక్టర్లు, లారీలలో యథేచ్ఛగా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు కన్నెత్తి కూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇసుక అక్రమ రవాణా వెనుక అధికార పార్టీ నాయకులుండటంతోపాటు, అక్రమార్కుల నుంచి నెలవారీ మామూళ్లు ముట్టడమే అందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


 రోజుకు 100పైగా లారీలు, ట్రాక్టర్‌లలో తరలింపు 

మండలంలో పోలవరంలో రెండు చోట్ల, పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని దీక్షితులవారిపాలెం సమీపంలో ఒకచోట అనధికారికంగా ఇసుకను తవ్వుతున్నారు.. రోజుకు మూడు రీచ్‌ల నుంచి 100కు పైగా లారీలు, ట్రాక్టర్‌లలో తరలిస్తున్నారు. ఈ వ్యవహారం రాత్రి వేళల్లో సాగిస్తున్నారు. వేములబండ, ముండ్లమూరు, జమ్మలమడక, గంగన్నపాలెంలోని గుండ్లకమ్మ, చిలకలేరు వాగులతోపాటు కొంత మంది రైతుల పొలాలు కొనుగోలు చేసి ట్రాక్టర్లలో ఇసుకను అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారు. 


ట్రక్కు ఇసుక రూ.4వేలకు విక్రయం 

ఒక్కో ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుకను అక్రమార్కులు రూ.3వేల నుంచి రూ.4వేల వరకూ విక్రయిస్తున్నారు. అదే లారీకి దూరాన్ని బట్టి రూ.15వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా పోలవరంలో అనధికార రీచ్‌ల నుంచి తవ్వుతున్న ఇసుకను దర్శి, దొనకొండ, కురిచేడు, మార్కాపురం ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే ప్రాంతంలో రీచ్‌ నుంచి మేదరమెట్ల, ఒంగోలు, అద్దంకి ప్రాంతాలకూ వెళ్తోంది. దీక్షితులవారిపాలెం దగ్గర ఇసుకను దర్శి, వినుకొండ, అద్దంకి, మేదరమెట్ల, మార్టూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం వైసీపీ నాయకులకు ఆదాయంగా మారింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. దీక్షితులవారిపాలెం సమీపంలో పది రోజుల క్రితం ఇసుక అక్రమ నిల్వలు ఉన్నట్టు ఎస్‌ఈబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వారు వచ్చి పెద్ద ఎత్తున నిల్వ ఉన్న ఇసుక డంప్‌ను స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసు పెట్టారు. ఆ ఇసుకను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఐతే రాత్రికి రాత్రే ఎక్స్‌కవేటర్‌ ద్వారా లారీలకు సీజ్‌ చేసిన ఇసుకను ఎత్తుతున్నారు. 


పట్టించుకోని పోలీసులు, అధికారులు 

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. ఒక్కో అక్రమ క్వారీ నుంచి రూ.70వేల నుంచి రూ.లక్ష వరకూ నెలవారీ మామూళ్లు ముట్టడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. ట్రాక్టర్‌కు అయితే నెలకు రూ.10వేలు ఇస్తున్నట్టు అక్రమార్కులు బహిరంగంగానే చెప్తున్నారు.  అనధికార రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతున్నా భూగర్భ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో ఇసుక అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. 


అధికార పార్టీ ఒత్తిళ్లతోనే ఎస్‌ఈబీ వెనక్కి

క్వారీలు, ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఎస్‌ఈబీ అధికారులకు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేసేందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రజలు అంటున్నారు. ఒకటీ అరా దాడులు చేసి ట్రాక్టర్‌నో, లారీనో పట్టుకున్నా క్షణాల్లో వైసీపీ నాయకుల నుంచి ఫోన్‌లు రావడం, వదిలివేయడం జరుగుతోంది.  


Read more