కమనీయం కళారాల ఉత్సవం

ABN , First Publish Date - 2022-10-03T05:30:00+05:30 IST

రాష్ట్రంలో ఒంగోలు నగరానికే ప్రత్యేకమైన అమ్మవారి కళారాల ఊరేగింపు సోమవారం రాత్రి భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.

కమనీయం కళారాల ఉత్సవం

దుర్గాష్టమి సందర్భంగా మూడు కళారాల ఊరేగింపు

భారీగా పాల్గొన్న ప్రజలు

వేషధారణలు, డప్పు వాయిద్యాలతో సందడి

నృత్యం చేస్తూ హుషారెత్తించిన యువత


ఒంగోలు (కల్చరల్‌), అక్టోబరు 3: రాష్ట్రంలో ఒంగోలు నగరానికే ప్రత్యేకమైన అమ్మవారి కళారాల ఊరేగింపు సోమవారం రాత్రి భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా నగరంలోని ఆరు దేవస్థానాల నుంచి అమ్మవారి కళారాలను నగరంలో అత్యంత వైభవోపేతంగా ఊరేగించటం ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆచారం.  దసరా పండుగ ముందు అత్యంత ముఖ్యమైన రెండు రోజులు, దుర్గాష్టమి, మహర్నవమి రోజులలో ఈ కళారాల ఊరేగింపు ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ సంవత్సరం దుర్గాష్టమి రోజైన ఆదివారం రాత్రి అమ్మవార్ల కళారాల ఊరేగింపు కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా అందంగా అలంకరించిన కళారాలను ప్రత్యేక వాహనాలపై అలంకరించి, వాటికి ఇరువైపులా పలువురు కళారాలను ముందు వెనుకలకు ఊపుతూ సాక్షాత్తు అమ్మవారు కదిలివస్తున్నదా అన్నంత అనుభూతిని భక్తులకు కలిగించారు. సోమవారం రాత్రి ఎరుపు రంగులో అంకమ్మపాలెంలోని కాళికాఅమ్మవారి కళారం, పసుపువర్ణంలో బాలాజీరావుపేట కనకదుర్గ అమ్మవారి కళారం, తెలుపువర్ణంలో బీవీఎస్‌ హాలు దగ్గరున్న నరసింహస్వామి కళారంలు భక్తుల జయజయధ్వానాలు, నృత్యాల నడుమ బయల్దేరి నగరంలోని వివిధ ప్రధాన రహదారుల ద్వారా కొనసాగాయి. దుష్టశిక్షణ చేయటానికి అమ్మవారు రౌద్రరూపిణిగా అవతరించిందనే దానికి సంకేతంగా ఎరుపు వర్ణం, సకల శుభాలను కలిగించే మాతృమూర్తికి చిహ్నంగా పసుపువర్ణంలో అమ్మవారి కళారాలు దర్శనమిచ్చాయి.  ఇక హిరణ్యకశిపుని సంహారం తర్వాత అమ్మవారి ఆదేశం మేరకు శాంతమూర్తిగా మారిన నరసింహస్వామికి చిహ్నంగా స్వామి వారు తెలుపువర్ణ కళారంగా భక్తులకు దర్శనమిచ్చారు. అంకమ్మపాలెం కాళికా అమ్మవారి కళారం, బాలాజీరావుపేటలోని కనకదుర్గమ్మ కళారాలు సోమవారం రాత్రి ఊరేగింపుగా ప్రారంభం కాగా, నరసింహస్వామి కళారం అర్ధరాత్రి ప్రారంభమైంది.  ఈ సందర్భంగా పలువురు కళాకారులు ధరించిన వివిధ వేషధారణలు, పౌరాణిక పద్యాల ఆలాపనలు, ప్రజలను రంజింపజేశాయి. అటు స్థానిక కొత్తపట్నం బస్టాండ్‌ వద్ద ప్రజలు భారీ సంఖ్యలో చేరి స్వామి వారికి కళారానికి పూజలు నిర్వహించిన అనంతరం కళార నగరోత్సవం ప్రారంభమైంది. 

 

 కళారాల ఊరేగింపు సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆయా దేవస్థానాల వద్దకు సోమవారం సాయంత్రం నుంచే చేరుకోవటంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. ఇక ఊరేగింపు జరిగిన సోమవారం రాత్రి మొత్తం యువకులు డప్పు వాయిద్యాలు, డీజే వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. నగరంలోని పలు వీధులగుండా కొనసాగిన ఈ కళారాలు ఊరేగింపుగా మంగళవారం తెల్లవారు జాముకు స్థానిక మస్తాన్‌దర్గా సెంటర్‌కు చేరుకున్నాయి. ఆ సందర్భంగా మూడు కళారాల సన్నిధిలో యువతీయువకులు, మహిళలు, పురుషులు అన్న తేడాలేకుండా ప్రజలు ఆనందోత్సాహాలతో ఆడుతూ అమ్మవార్లకు, స్వామి వారికి నీరాజనాలర్పించారు. 

Updated Date - 2022-10-03T05:30:00+05:30 IST