నా ఇంటి స్థలాన్ని ఆక్రమించారు!

ABN , First Publish Date - 2022-09-28T06:16:17+05:30 IST

ప్రభుత్వం జగనన్న కాలనీలో తనకు ఇచ్చిన స్థలంలో వేరొకరు గోడ కట్టారని ఓ మహిళ ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద విలపించారు.

నా ఇంటి స్థలాన్ని ఆక్రమించారు!
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద విలపిస్తున్న తిరుపతమ్మ

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బాధితురాలు కన్నీరు

అదే నెంబరుతో మరొకరికి పట్టా

రాత్రికి రాత్రే చుట్టూ గోడ ఏర్పాటు

జగనన్న కాలనీలో పట్టాల మాయ

ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 27 : ప్రభుత్వం జగనన్న కాలనీలో తనకు ఇచ్చిన స్థలంలో వేరొకరు గోడ కట్టారని ఓ మహిళ ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద విలపించారు. తనకు పట్టా ఇచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అక్రమ మార్గంలో వేరొకరు పట్టా పొంది తన భూమిలో ప్రహరీ కట్టారని వాపోయారు. తనను భూమిలోకి పోనివ్వకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చిన ఆమెను పలువురు ఓదార్చారు. బాధితురాలి వివరాల మేరకు... ఎర్రగొండపాలెం రెండో సచివాలయం పరిధిలో నివసిస్తున్న దిగుడు తిరుపతమ్మకు జగనన్నకాలనీలో 551 నంబరుతో నివేశన స్థలం పట్టా ఇచ్చారు.  పక్కాగృహం మంజూరు కాకపోవడంతో తిరుపతమ్మ ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. అదే స్థలానికి 551 పట్టా నంబరుతో 3వ సచివాలయం పరిధిలో నివాసం ఉన్న మరో మహిళకు వీఆర్‌వో పట్టా ఇచ్చారు. ఇదేసమయంలో బతుకుదెరువుకు కోసం వలస వెళ్లి వచ్చిన తిరుపతమ్మ తన స్థలం పరిశీలించుకొని ఇంటి నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇది గమనించిన అదే స్థలానికి పట్టాపొందిన మరో మహిళ కుటుంబసభ్యులు రాత్రికి రాత్రే ఆ స్థలం చుట్టూ గోడ కట్టారు. సోమవారం స్థలం వద్దకు వెళ్లిన తిరుపతమ్మ, ఆమె భర్త వెంకటయ్యలు గోడ కట్టి ఉండడాన్ని పరిశీలించారు. అనంతరం మంగళవారం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లినా ప్రయోజనం లేదు. అయితే తిరుపతమ్మ పొందిన పట్టా ఆన్‌లైన్‌లో నమోదైందని వీఆర్‌వో దానం తెలిపారు. మరో మహిళకు ఇచ్చిన పట్టాను అధికారులు వెనక్కు తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై తహసీల్దార్‌ రవీంద్రారెడ్డి స్పందిస్తూ పట్టా ఆన్‌లైన్‌లో ఉంటే ఆమెకు న్యాయం చేస్తామన్నారు.


Updated Date - 2022-09-28T06:16:17+05:30 IST