ycp: పాపం జగన్.. ఇలా అయితే కష్టమే.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-27T16:21:49+05:30 IST

చీరాల, పర్చూరు వైసీపీలో మూడుముక్కలాట సాగుతోంది. ఎవరికివారే యమునా తీరే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు..

ycp: పాపం జగన్.. ఇలా అయితే కష్టమే.. అసలు విషయం ఏంటంటే..

వైసీపీలో వర్గపోరు

పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రామనాథంబాబుపై ఎంపీపీ వాసుబాబు ధ్వజం

ఒంటెత్తు పోకడ పోతున్నారని.. ఇది పార్టీకి నష్టమని వ్యాఖ్యలు

చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఎవరికి వారే..


చీరాల: చీరాల, పర్చూరు వైసీపీలో మూడుముక్కలాట సాగుతోంది. ఎవరికివారే యమునా తీరే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు గాడిలో పడతాయోనని చర్చించుకుంటున్నారు. చీరాల నియోజకవర్గంలో మొదటి నుంచి వర్గపోరు నడుస్తూనే ఉంది. అది పలుమార్లు బహిర్గతమైంది. పర్చూరు నియోజకవర్గంలో రావి రామ నాథంబాబుపై అంతర్గతంగా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉంది. తాజాగా శనివారం కారంచేడు మండల పరిషత్‌ కార్యాలయ సమావేశమందిరంలో నూతన పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ నీరకట్టు వాసు బాబు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబుపై ఉన్న అసంతృప్తిని వెల్లగక్కారు. ఒకవైపు జగన్‌ పరిపాలన తీరును ప్రశంసిస్తూ, మండలంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ పనిలోపనిగా రామనాథంబాబు ఒంటెత్తు పోకడ పోతున్నారని ఇది పార్టీకి నష్టమని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ ధ్వజమెత్తడం హాట్‌టాపిక్‌ అయింది. 


పర్చూరు నియోజకవర్గంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఉంటేనే అధిష్టానం ఆశించిన ఫలితం వస్తుందని, లేదంటే భారీమూల్యం చెల్లించాల్సి వస్తుందని వాసు బాహాటంగా చెప్తున్నారు. బాలినేని ప్రమేయం లేకుండా చేయాలని కొందరు ప్రయత్నించటం పార్టీకే నష్టమన్నారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని సమావేశానికి హాజరైన అందరి అభిప్రాయమని చెప్పారు. అయితే, రామనాథంబాబు స్థానంలో ఇన్‌చార్జిగా మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.



ఒక దశలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ను పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా అధిష్టానం నియమిస్తుందని భావించారు. అందుకు ఆమంచితో అధినాయకత్వం కూడా మాట్లాడింది. తరువాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా ఆ ప్రక్రియ ఆగింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పార్టీ అధిష్టానం అప్పగించే బాధ్యతలపై రెండు నియోజకవర్గాల్లో నెలకొన్న పీట ముడులు విడిపోయి, భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కారంచేడు ఎంపీపీ నీరు కట్టు వాసుబాబు ఒక్కసారిగా రామనాథంబాబుపై వ్యతిరేక బావుటా ఎగువవేయటం ప్రస్తుతం చీరాల, పర్చూరు రెండు నియోజకవర్గాల్లో హాట్‌టాపిక్‌ అయింది. వైసీపీతో పాటు ఇతర రాజకీయవర్గాల్లో కూడా ఈ అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది.

Updated Date - 2022-09-27T16:21:49+05:30 IST