అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-12T06:32:43+05:30 IST

రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దోర్నాలలోమంగళవారం పలు అభివృద్ధి పను లు పరిశీలించారు.

అభివృద్ధి పనుల పరిశీలన
డిగ్రీ కళాశాల వసతులను పరిశీలిస్తున్న మంత్రి

పెద్ద దోర్నాల, అక్టోబరు 11: రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దోర్నాలలోమంగళవారం పలు అభివృద్ధి పను లు పరిశీలించారు. ఎంపీపీ గుమ్మా పద్మజ కుమారుడు ఇటీవల డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. ఈ క్రమంలో మంత్రి సురేష్‌ ఎంపీపీ దంపతులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన నూతనంగా మంజూరు అయిన డిగ్రీ కళాశాలలో వసతులను పరిశీలించారు. ప్రిన్సిపాల్‌ రాజేంద్రకుమార్‌ కళాశాలకు అవసరమయ్యే వసతుల వివరాలు తెలిపారు. తాత్కాలికంగా జూనియర్‌ కళాశాలలోని నాలుగు గదులను డిగ్రీ కళాశాల విద్యార్థులకు కేటాయించారని, మొదటి ఏడాది కావున నాలుగు గ్రూపులకు గాను 160 సీట్లు ఉన్నట్లు చెప్పారు. 19 టీచింగ్‌, 6 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అవసరమని, అలాగే కంప్యూటర్‌, కుర్చీలు వంటి తదితర సామాగ్రి ఏర్పాటు చేసుకోవలసి ఉందన్నారు. ఎవరైనా దాతలు సహకరించాలని కోరారు. జూనియర్‌ కళాశాల్లో శిథిలావస్థకు చేరిన గదులకు మరమ్మతు లు నిర్వహించి తాత్కాలికంగా వినియోగించుకునేందుకు నిధు లు మంజూరు చేయించనున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. వచ్చే ఏడాది శాశ్వత భవనాలు నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి 5 ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో రూ.3 కోట్ల నిధులతో నిర్మిస్తున్న అదనపు గదులను ఆయన పరిశీలించారు. అనంతరం ఐనముక్కుల గ్రామం సమీపంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల పనులను  పరిశీలించారు. అక్కడ పునాధులు తీసి పిల్లర్లు వేసి ఉన్నాయి. ఆ పనుల వివరాలు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేజీ రోడ్డు నుంచి వైద్యశాల వరకు మట్టి రోడ్డును సుమారు రూ.50 లక్షలతో నిర్మించి ఏడాది కావస్తున్నా నేటికీ, రూపాయి బిల్లు రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దారు వేణుగోపాల్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మహాలక్ష్మమ్మ, సర్పంచి చిత్తూరి హారిక, నాయకులు గంటా గురవారెడ్డి, గంటా రమణారెడ్డి, అబ్దుల్‌మజీద్‌, రామిరెడ్డి, జోగి వెంకటనారాయణ,యక్కంటి వెంకటేశ్వర రెడ్డి, వెన్నా కాశిరామిరెడ్డి, బొగ్గరపు రమేష్‌, జీ బాలకాశయ్య, రాంభూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-12T06:32:43+05:30 IST