నీరివ్వకుంటే ఉద్యమమే..!

ABN , First Publish Date - 2022-11-19T00:14:01+05:30 IST

మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టును టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా నేతలైన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డి, ముఖ్యనేతలు శుక్రవారం సందర్శించారు. తొలుత మల్లవరం వెంకటేశ్వర ఆలయం వద్ద పలు గ్రామాల రైతులతో సమావేశమై ఆయకట్టులో పంటల సాగు వివరాలు, నీటి అవసరం, లభ్యత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 నీరివ్వకుంటే ఉద్యమమే..!

గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన

స్పిల్‌వే, దెబ్బతిన్న గేట్ల పరిశీలన

మరమ్మతుల్లో జాప్యంపై ఆగ్రహం

ఆయకట్టు రైతులతో భేటీ

పక్షం తర్వాత పంటలకు

నీటి అవసరం ఉందన్న అన్నదాతలు

ఇవ్వకపోతే నష్టపోతామని ఆందోళన

గుండ్లకమ్మ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనురిస్తున్న వైఖరిపై టీడీపీ ఉమ్మడి జిల్లా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గేట్ల మరమ్మతులను పూర్తిచేసి ఆయకట్టుకు నీరిచ్చి పంటలను కాపాడటంలో సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తక్షణం మరమ్మతులు పూర్తి చేసి ఈ సీజన్‌లో పంటలకు అవసరమైన నీటిని అందివ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును టీడీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు శుక్రవారం సందర్శించారు. ఆయకట్టు రైతులతో సమావేశమయ్యారు. అనంతరం స్పిల్‌వేను, దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర నెలల క్రితం గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు విరిగిపోగా నెలలో మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు ఇస్తామనినాడు ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు, అధికారులు చెప్పారన్నారు. అయితే ఇంత వరకూ ఒక్క గేటును కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి గేట్ల మరమ్మత్తులను నెలలో పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్‌ చేశారు.

ఒంగోలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టును టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా నేతలైన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డి, ముఖ్యనేతలు శుక్రవారం సందర్శించారు. తొలుత మల్లవరం వెంకటేశ్వర ఆలయం వద్ద పలు గ్రామాల రైతులతో సమావేశమై ఆయకట్టులో పంటల సాగు వివరాలు, నీటి అవసరం, లభ్యత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల తరఫున రావి ఉమామహేశ్వరరావు (రాచవారిపాలెం), పెనుబోతు సునీల్‌ (మద్దిరాలపాడు), నారిపెద్ది వరహాలు చౌదరి (మల్లవరం) తదితరులు మాట్లాడారు. ప్రస్తుతం ఆయకట్టులో పొగాకు, మిర్చి పంటలు ప్రధానంగా సాగులో ఉన్నాయన్నారు. శనగ కూడా విస్తారంగా విత్తుతున్నారని చెప్పారు. ఇతర పలు పంటలు కూడా ఉన్నప్పటికీ మిర్చి, పొగాకుకు రానున్న పక్షం నుంచి నెల రోజుల్లో నీటి అవసరం అధికంగా ఉంటుందన్నారు. ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని నీరంతా బయటకు వెళ్లినప్పుడు రాష్ట్రమంత్రి, ఇతర పెద్దలు చెప్పిన మాటలు నమ్మి రైతులు పంటలు సాగు చేశారన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రిజర్వాయర్‌లో సగం నీటిని కూడా నింపలేని దుస్థితి ఉన్నదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయకట్టులో నీటి సమస్య ఎదురై తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్పిల్‌వేపై పర్యటించిన నేతలు ప్రాజెక్టులో నీటి నిల్వతోపాటు పలుగేట్ల నుంచి లీకవుతున్న నీటిని, దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. అలాగే స్పిల్‌వేకి సమీపంలో కొత్తగేట్ల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న మెకానికల్‌ పనులను పరిశీలించి వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్టుల నిర్వహణకు గాలికొదిలేసిన ప్రభుత్వం

రైతులతో సమావేశం, ప్రాజెక్టు పరిశీలన అనంతరం టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ నిరంతర ప్రక్రియ కాగా టీడీపీ పాలనలో ప్రతి రెండేళ్లకు ఒకసారి స్పిల్‌వే, గేట్ల భద్రతను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకొన్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసిందని, దాని వల్లనే పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని ఆరోపించారు. గుండ్లకమ్మ నిర్వహణను కూడా తీవ్ర నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ఈ కారణంగానే రెండున్నర నెలల క్రితం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని విమర్శించారు. అప్పటికే కొన్నింటికి మరమ్మతులు అవసరమని అధికారులు నివేదించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మొత్తం గేట్లు మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

రెండున్నర నెలలు గడిచినా ఒక్కగేటూ పెట్టలేకపోయారు!

రెండున్నర మాసాల క్రితం గేటు విరిగిపోయి నీరంతా బయటకు పెట్టిన సమయంలో నెలలో మరమ్మతులు పూర్తి చేసి, సాగర్‌ నీటితో రిజర్వాయర్‌ను నింపి అయినా ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పిన మంత్రి అంబటి రాంబాబు, ఇతర అధికార పార్టీ నేతలు ఇంత వరకూ ఒక్క గేటు కూడా పెట్టించలేకపోయారని టీడీపీ నేతలు విమర్శించారు. అసలు కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. గతంలో టెండర్లు పూర్తయి అంతోఇంతో పనులు జరుగుతున్న 6,7 గేట్లకు సంబంధించి బిల్లులు ఇవ్వలేదన్నారు. ఇక మిగిలిన 12 గేట్ల మరమ్మతులకు అధికారులు కోరిన రూ.8.70 కోట్ల నిధుల విషయం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. మంత్రి, అధికార పార్టీ నేతలు మాటలు నమ్మి నీరు వస్తుందన్న ఆశతో పంటలు సాగు చేసిన రైతుల ప్రస్తుత పరిస్థితితో ఆందోళన చెందుతున్నారన్నారు.

అధికారులపై నెపం మోపే ప్రయత్నం హాస్యాస్పదం

మూడు రోజుల క్రితం జరిగిన జడ్పీ సమావేశంలో గుండ్లకమ్మ మరమ్మతుల విషయంలో అధికారులను తప్పుపడుతూ వారిపై నెపం మోపో ప్రయత్నం వైసీసీ ప్రజాప్రతినిధులు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలు అన్నారు. దీనిని బట్టి గుండ్లకమ్మ గేట్ల మరమ్మతులు, ఆయకట్టుకు నీటి సరఫరాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం అర్థమవుతుందని మండిపడ్డారు. తక్షణం ప్రభుత్వం మొద్దు నిద్రవీడి గేట్ల మరమ్మతులను నెలలో పూర్తిచేయించి ఆయకట్టు రైతులకు నీరిచ్చి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే గుండకమ్మ నీటిని బయటకు పంపడం వల్ల నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు మన్నం ప్రసాద్‌, ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, సంతనూతలపాడు నియోజకవర్గంలోని టీడీపీ మండల అధ్యక్షులు మండవ జయంతిబాబు, మద్దినేని హరిబాబు, తేళ్ల మనోజ్‌, గొట్టిపాటి రాఘవరావు, ఇతర నేతలు గుమ్మడి సాయిబాబు, చిన్న అంకారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:14:01+05:30 IST

Read more