ఇంటి దొంగలు!

ABN , First Publish Date - 2022-09-12T05:26:26+05:30 IST

జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అధికారులు కలిసి కొత్త అక్రమాలకు తెరలేపారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై మండలంలోని రమణాలవారిపాలెంలో రేకుల షెడ్‌లు ఉన్న స్థలంలో పక్కా భవనాలు మం జూరు చేశారు.

ఇంటి దొంగలు!
జగనన్న గృహం కింద మంజూరైన పాత రేకులషెడ్‌ ఫ్లోరింగ్‌ ఉన్న ఇంటికి మంజూరైన జగనన్న గృహం,


జగనన్న గృహ లబ్ధిదారుల ఎంపికలో మాయ

వైసీపీ నేతలతో అధికారుల కుమ్మక్కు

పాత రేకుల షెడ్లను ఖాళీ స్థలాలుగా చూపి జియోట్యాగింగ్‌ 

బిల్లుల చెల్లింపునకు సిద్ధం

తాళ్లూరు, సెప్టెంబరు 11 : జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అధికారులు కలిసి కొత్త అక్రమాలకు తెరలేపారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై మండలంలోని రమణాలవారిపాలెంలో రేకుల షెడ్‌లు ఉన్న స్థలంలో పక్కా భవనాలు మం జూరు చేశారు. ఆమేరకు జియోట్యాగింగ్‌ కూడా పూర్తి చేశారు. బిల్లులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అందరూ అవాక్కవుతున్నారు. జగనన్న గృహాలు మంజూరు చేయాలంటే రెండు సెంట్ల ఖాళీ స్థలం ఉండాలి. దాన్ని అధికారులు జియోట్యా గ్‌ చేయాలి. ఆ తరువాత మంజూరు కోసం ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించాలి. వారి పరిశీలన అనంతరం అర్హులకు గృహాలను మంజూరు చేస్తారు. రమణాలవారిపాలెంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. రెండు, మూడేళ్ల క్రితం నిర్మించిన పాతరేకుల షెడ్ల  యజమానులను జగనన్న ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో హౌసింగ్‌ అధికారులు రెండు, మూడేళ్ల క్రితం రేకుల షెడ్లు ని ర్మించి ఉన్న స్థలాలను ఖాళీవిగా జియోట్యా గింగ్‌ చేశారు. వాటిని లబ్ధిదారుల జాబితాలో చేర్చి ఉన్నతాధికారులకు పంపగా ఇళ్లు మంజూరయ్యాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


హౌసింగ్‌ ఇన్‌చార్జే అన్నీ తానై..

సచివాలయ పరిధిలో ఇంజనీరింగ్‌ కన్సల్‌టెంట్‌లు జియో ట్యాగ్‌ తీయాల్సి ఉండగా, వారితో సంబంధం లేకుండా హౌసింగ్‌ ఇన్‌చార్జి అన్నీ తానై ట్యాగింగ్‌ చేయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ముడుపులు కూడా పుచ్చుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. రెండు, మూడేళ్ల క్రితం రేకుల షెడ్లు నిర్మించుకొన్న దాదాపు 14 మంది లబ్ధిదారుల పేర్లను అర్హత కోసం  నమోదు చేసినట్లు తెలిసింది. అనర్హులైన వారికి ప్రస్తుతం గృహాలు కూడా మంజూరయ్యాయి. వారంతా రేకులను తీసి గృహాలకు తుదిమెరుగులు చేసి శ్లాబ్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ గృహాలకు బిల్లులు చెల్లించేందుకు హౌసింగ్‌ అధికారి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 


అర్హులకు మొండిచెయ్యి

రమణాలవారిపాలెం గ్రామంలో సొంత స్థలం ఉండి జగనన్న గృహాల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు హౌసింగ్‌ అఽధికారులు మొండిచేయి చూపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచ్‌ మారం ఇంద్రసేనారెడ్డి హౌసింగ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ రేకుల షెడ్‌లకు నిబంధనలకు విరుద్ధంగా జగనన్న గృహలబ్ధిదారులుగా మంజూరు చేయించారని వైసీపీకే చెందిన మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారయంత్రాంగం ఆగ్రామంలో మంజూరైన జగనన్న లబ్ధిదారుల జాబితాను జాగ్రత్తగా పరిశీలించి పాత గృహాలకు జియో ట్యాగ్‌ ద్వారా జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట వేసి, నిజమైన పేదలకు ఇళ్లు మంజూరయ్యేలే చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-12T05:26:26+05:30 IST