కుండపోత

ABN , First Publish Date - 2022-10-02T05:52:23+05:30 IST

జిల్లావ్యాప్తంగా ముసురుపట్టింది. అత్యధిక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా జోరువాన కురిసింది.

కుండపోత
భారీ వర్షానికి ఒంగోలులోని కర్నూల్‌రోడ్డులో నిలిచిన వర్షపు నీరు

జిల్లావ్యాప్తంగా జోరువాన

జనజీవనం అస్తవ్యస్తం 

కొత్తపట్నం మండలంలో 14 సెం.మీ వర్షపాతం 

ఒంగోలు జలమయం  

లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి చేరిన నీరు

పలుచోట్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు  

గుండ్లకమ్మ గేట్ల ఎత్తివేత 

జిల్లావ్యాప్తంగా ముసురుపట్టింది. అత్యధిక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా జోరువాన కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజల రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలతో గుండ్లకమ్మ, ముసి, పాలేరు వంటి నదులతోపాటు వాగులు, వంకలలో వర్షపు నీటి ఉధృతి అధికమైంది. గుండ్లకమ్మ డ్యాంకు ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండటంతో ఐదు గేట్లను ఎత్తారు. చాలాచోట్ల  వాగులు, వంకలు పొంగి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఒంగోలులో కురిసిన కుండపోతకు నగరంలో  పరిస్థితి దారుణంగా మారింది. ప్రధాన రోడ్లు కాలువలను తలపించాయి. శివారు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితుల కోసం మూడు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. 

ఒంగోలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వాన జోరు శనివారం కూడా కొనసాగింది. జిల్లాలో ప్రస్తుతం సాధారణంగా వర్షాలు కురిసే సమయమే. అయినప్పటికీ ఈసారి ఈశాన్య రుతుపవనాల ఆరంభంలోనే విస్తారంగా వానలు ప్రారంభమయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి శనివారం రాత్రి వరకూ వర్షం కురుస్తూనే ఉంది.  శనివారం ఉదయం 8గంటలకు 24 గంటల వ్యవధిలో జిల్లాలో సగటున 32.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెల మొత్తం జిల్లా సగటు వర్షపాతం 200మి.మీ కాగా అందులో ఇంచుమించు 16శాతానికిపైగా ఈ ఒక్కరోజే కురిసింది. అత్యధికంగా పుల్లలచెరువు మండలంలో 78.2 మి.మీ నమోదైంది. మార్కాపురంలో 76.4, దొనకొండ 72.0, ఎస్‌ఎన్‌పాడు 71.8, ఎన్‌జీపాడులో 68.8 మి.మీ పడింది. అలాగే మరో 13 మండలాల్లో 30నుంచి 50 మి.మీ,  ఇంకో పది మండలాల్లో 20 నుంచి 30 మి.మీ వర్షపాతం నమోదైంది. తిరిగి శనివారం ఉదయం నుంచి తెరపిలేకుండా ముసురుగా భారీవర్షం పడుతూనే ఉంది. కొన్నిచోట్ల కుండపోత కురిసింది. 


కొత్తపట్నంలో అత్యధిక వర్షం

శనివారం సాయంత్రం ఐదుగంటల సమయానికి జిల్లాలో మరో 18.7మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తపట్నంలో 144.4 మి.మీ నమోదైంది.  టంగుటూరులో 89.6, ఒంగోలులో 69.2, సింగరాయకొండలో 61.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే పది మండలాల్లో 20 నుంచి 50 మి.మీ పడింది.. అలా కొద్దిగంటల వ్యవధిలోనే ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 


ఒంగోలు జలమయం

ఒంగోలు నగరంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే రోడ్లలో కాలువను తలపించేలా నీరు పారుతూనే ఉంది. పలుచోట్ల మోకాలి లోతు నీటిలో రాకపోకలు సాగించాల్సి వచ్చి జనం అవస్థ పడ్డారు. ఇక శివారు ప్రాంతాలైన నేతాజీకాలనీ, నెహ్రూకాలనీ, బలరాం కాలనీ, పీర్లమాన్యంతోపాటు దాదాపు పది పన్నెండు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి పేదలు ఇక్కట్లు పడ్డారు. బాధితుల కోసం మూడుచోట్ల అధికారులు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒంగోలుతోపాటు పలు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో తెరపి లేకుండా పడుతున్న వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోక నీరు చేరింది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు, అలాగే కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రత్యేకించి చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. రద్దీ అధికంగా ఉండే ఒంగోలులో మధ్యాహ్నం వరకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే వీలు లేక అవస్థ పడ్డారు.


పొంగిపొర్లిన వాగులు, వంకలు

భారీవర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం 21.90 మీటర్ల నీటిమట్టం మాత్రమే ఉంచగా వర్షాలతో ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. శనివారం రాత్రికి ఆ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు ఐదు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని సముద్రానికి వదులుతున్నారు. ముసి, పాలేరు వంటి వాటితోపాటు చాలా ప్రాంతాల్లో చిన్న, పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. కాగా తాజా వర్షాలు సాగులో ఉన్న మెట్ట పంటలకు మేలు చేస్తాయని రైతులు చెప్తున్నారు. సుమారు మూడు లక్షల ఎకరాల్లో ప్రస్తుతం ప్రధానమైన పత్తి, కంది, మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు ఉండగా నెలరోజుల నుంచి సరైన వర్షం లేక అవి వాడుముఖం పట్టే పరిస్థితి నెలకొంది. తాజా వర్షాలు వాటికి ఉపకరించనున్నాయి. అలాగే రబీ పంటల సాగుకు కూడా మేలు చేస్తాయని రైతులు చెప్తున్నారు. అయితే ఇంకా వర్షం అధికమైతే పొలంలో ఉన్న పంటలు ఉరకెత్తి దెబ్బతింటాయన్న ఆందోళన కూడా ఉంది. ఇప్పటికే కోతకు వచ్చిన సజ్జ అక్కడక్కడా దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. 
Read more