ఘనంగా శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2022-09-28T06:24:45+05:30 IST

పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు మంగళవారం అమ్మవారు పార్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఘనంగా శరన్నవరాత్రులు
త్రిపురాంతకంలో బ్రహ్మచారినిగా అమ్మవారు

గిద్దలూరు, సెప్టెంబరు 27 : పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు మంగళవారం అమ్మవారు పార్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు తెచ్చిన జలంతో అమ్మవారికి అభిషేకం చేశారు. ఆయా పూజా కార్యక్రమాలలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు గర్రె సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు, రంగసత్యనారాయణ, కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. షరాఫ్‌ బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో 19వ బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి వారు శ్రీమత్సావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గంజి వీరయ్య, కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షిర్డిసాయిబాబా మందిరం, రాచర్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, స్టేషన్‌రోడ్డులో కాళికాంబ దేవాలయం, నల్లబండ బజారు, నరవ రోడ్డులోని కనకదుర్గ దేవాలయాలలో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకారాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ముండ్లపాడు, తాళ్లపల్లి, కే.ఎస్‌.పల్లి తదితర గ్రామాలలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బేస్తవారపేట : స్థానిక శ్రీవాసవీ కన్యాకపరమేశ్వరీదేవి అమ్మవారు భూవనేశ్వరీ అలంకారణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అంకాలమ్మ వీధిలోని అంకాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీసీ కాలనీలోని శ్రీచౌడేశ్వరీదేవి అయమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు శ్రీదివ్య వజ్ఞానానండగిరి స్వాములతోఅధ్యాత్మిక ప్రవచనాలు చెప్పించారు. కార్యక్రమంలో బొంతల లక్ష్మణ్‌స్వామి గుప్త, నక్కా సుబ్రహ్మణ్యం, నక్కా రామచంద్రుడు, ముప్పూరి రాము తదితరులు పాల్గొన్నారు.

పొదిలిరూరల్‌ : కంభాలపాడులో అంకాలమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా పూజారి వెంకటరమణశర్మ ఆధ్వర్యంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, కళశస్థాపన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.    పొదిలి వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో మంగళ వారం కౌమారిదేవి అలంకరణలో అమ్మవారు  భక్తులకు దర్శనమిచ్చారు. 

మార్కాపురం(వన్‌టౌన్‌) : దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారు వివిధ అలంకారాల్లో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ చెన్న కేశవస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారు ఆది లక్ష్మీగా, కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత సావిత్రిగా, సత్యనారాయణస్వామి ఆలయంలో రమాదేవి జయలక్ష్మీగా, బంగారమ్మ ఆలయంలో గాయత్రీదేవీగా, శివాలయంలో జగదాంబ బ్రహ్మచారిణిగా, ప్రసన్న రామన్న పట్టాభీరామాలయాలలో సీతాదేవి వైష్ణవి, భవానీగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. 

 ఎర్రగొండపాలెం :  స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారరు మంగళగౌరిదేవిగా దర్శనమిచ్చారు. మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, వాస్తునవగ్రహమండపారాధన, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు ఆర్‌ శ్రీరామచంద్రమూర్తి వేదమంత్రోచ్చారణ చేశారు. ఆలయకమిటి అధ్యక్షుడు కె పుల్లారావు, కార్యదర్శి సూరే శివాంజనేయులు, గౌరవాధ్యక్షుడు కొత్తమాసు సుబ్రహ్మణ్యం, గోళ్ల సుబ్బారావు, చీదెళ్ల నాగేశ్వరరావు, సభ్యులు పెరుమాళ్ళ మల్లిఖార్జునరావు ఆర్యవైశ్య పెద్దలు పాల్గొన్నారు. భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. తీర్ధప్రసాదములు పంపిణీ చేశారు.

త్రిపురాంతకం : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారు రెండోరోజు శ్రీబ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి, చిన్నమస్తాదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వేదపండితులు ఫణీంద్రకుమార్‌శర్మ, అర్చకులు ప్రసాద్‌శర్మ, విశ్వన్నారాయణశాస్త్రి అమ్మవారికి అభిషేకాలు, ప్రాతఃకాలపూజ, బాలబోగం, కుంకుమార్చనలు, నిర్వహించారు. రాత్రికి అమ్మవారికి హంసవాహనంపై ఆలయ ఉత్సవం నిర్వహించారు. అమ్మవారు బుధవారం చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Read more