ఎయిడెడ్‌ ‘అయ్యో’ర్లు!

ABN , First Publish Date - 2022-10-11T06:41:02+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న ఎయిడెడ్‌ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఎయిడెడ్‌ ‘అయ్యో’ర్లు!

జూనియర్‌ కాలేజీల అధ్యాపకులపై ప్రభుత్వం వివక్ష

త్రిశంకుస్వర్గంలా వారి పరిస్థితి

రిటైర్‌ చేయరు, బెనిఫిట్లు ఇవ్వరు

ఎనిమిది నెలలుగా రాని జీతాలు

విడుదల చేయాలని వేడుకుంటున్నా స్పందించని అధికారులు 

ఆకలి కేకలతో అల్లాడుతున్నా పట్టించుకోని పాలకులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న ఎయిడెడ్‌ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘అన్నమో రామచంద్రా’ అంటున్నా.. వారి ఆకలికేకలు ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు. 60ఏళ్లు నిండినా ఇంకా పనిచేయించుకుంటూ వారికి జీతాలు కూడా చెల్లించడం లేదు. తమను రిటైర్‌ చేసి బెనిఫిట్స్‌ కోసం ప్రతిపాదనలు పంపమన్నా అధికారులు ససేమిరా అంటున్నారు. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఆగస్టు 31 వరకు రిటైర్‌ అయిన ఎయిడెడ్‌ అధ్యాపకులకు అటు జీతం లేదు, ఇటు పెన్షన్‌ లేదు. దీంతో కేవలం నెల జీతం మీద ఆధారపడి బతికే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమను రెగ్యులర్‌ అధ్యాపకులుగా పరిగణిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని వాపోతున్నారు.

ఒంగోలు(విద్య), అక్టోబరు 10 : ఎయిడెడ్‌ అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారింది. 60 ఏళ్లు నిండిన వందమందికిపైగా ఇటు జీతాలు అందక, అటు బెనిఫిట్‌లు రాక ఇబ్బందిపడుతున్నారు. ఎయిడెడ్‌ యాజమాన్యా ల్లోని కళాశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వంలో విలీనమైన జూనియర్‌ అధ్యాపకుల పరిస్థితి ఇది. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ యాజమాన్యాల్లోని జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 600 మంది అధ్యాపకులు గతేడాది ప్రభుత్వంలో విలీనమయ్యారు. అందులో జిల్లాకు సంబంధించి 100 మంది వరకు ఉన్నారు. ఎయిడెడ్‌ కళాశాలల్లో వసతులు లేవు. వాటిని ప్రభుత్వంలో విలీనం చేసి అన్ని వసతులు కల్పిస్తామని అప్పట్లో సర్కారు నమ్మబలికింది. ఎయిడెడ్‌ కళాశాలలను యాజమాన్యాలు ప్రభుత్వంలో విలీనం చేయకపోతే గ్రాంటు నిలిపివేస్తామని హెచ్చరించింది. యాజమాన్యాలు తమ ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వకపోయినా అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులనైనా విలీనం చేయాలని ఆదేశించింది. అలా చేయకపోతే వారి జీతాలు ఎయిడెడ్‌ యాజమాన్యాలే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక, వారి జీతాలు భరించలేక అధ్యాపకులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వంలో విలీనమైనందుకు అధ్యాపకులు కూడా ఆనందించారు. వీరందరినీ ప్రభుత్వ జూనియర్‌  కళాశాలల్లో నియమించారు. రెగ్యులర్‌ లెక్చరర్ల తరహాలోనే వీరిని కూడా ప్రభుత్వ అధ్యాపకులుగానే గుర్తిస్తామని, అన్ని ప్రయోజనాలను వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా రిటైర్మెంట్‌ విషయంలో ఎయిడెడ్‌ అధ్యాపకులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. 


జూనియర్‌ అధ్యాపకులపై వివక్ష 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న ఎయిడెడ్‌ అధ్యాపకుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. గతేడాది ఎయిడెడ్‌ జూనియర్‌ అధ్యాపకులు, సిబ్బందితోపాటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, సిబ్బంది, డిగ్రీ కళాశాలల్లోని అధ్యాపకులు, సిబ్బంది ప్రభుత్వంలో విలీనమయ్యారు. ప్రభుత్వ, జడ్పీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బందికి ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు  పెంచి వారిలో 60 ఏళ్లు నిండిన వారిని సర్వీసులో కొనసాగిస్తూ ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్న సర్కారు ఎయిడెడ్‌ జూనియర్‌ లెక్చరర్లను గాలికి వదిలేసింది. ప్రభుత్వంలో విలీనమైన 600 మంది జూనియర్‌ అధ్యాపకుల్లో సుమారు 100 మందికి గత నెలలో 60ఏళ్లు నిండాయి. అయితే అప్పటి నుంచి వీరితో పనిచేయించుకుంటున్న ఇంటర్‌ విద్యాధికారులు జీతాలు మాత్రం చెల్లించడం లేదు.


ఎనిమిది నెలలుగా జీతాల్లేవ్‌..

ఇంటర్మీడియెట్‌ అధికారుల బాధ్యతారాహిత్యం ఎయిడెడ్‌ అధ్యాపకులకు శాపంగా మారిం ది. 60ఏళ్లు నిండిన అధ్యాపకులతో రోజూ పాఠాలు చెప్పించడంతోపాటు మూల్యాంకనానికి కూడా వీరి సేవలను వినియోగించుకున్నారు. ఎనిమిది నెలలుగా వీరికి జీతాలు లేకపోయినా ప్రభుత్వంలో పట్టించుకున్న నాథుడే లేడు. రిటైర్‌మెంట్‌ వయస్సు తమకు కూడా పొడిగిస్తే జీతాలు చెల్లించండి, లేకపోతే తమను రిటైర్‌ చేసి  పెన్షన్‌, ఇతర ప్రయోజనాలు చెల్లించాలని వేడుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన వారికి పాఠశాలల్లో పనిచేసిన టీచర్లకు రిటైర్మెంట్‌ వయస్సు 62ఏళ్లకు పెంచి తమను గాలికి వది లేయడం ఏమిటని జూని యర్‌ అధ్యాపకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

 

గతంలో  అందరికీ వర్తింపు

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచి దాన్ని అందరికీ వర్తింపజేశారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62ఏళ్లకు పెంచి దాన్ని అందరికీ  వర్తింపజే యకపోవడాన్ని ఎయిడెడ్‌ అధ్యాపకులు తప్పుబడుతు న్నారు. ఉపాధ్యాయులకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, డిగ్రీ అధ్యాపకులకు ఉన్నత విద్య కార్యదర్శి ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచు తూ ఉత్తర్వులు ఇచ్చి జూనియర్‌ అధ్యాపకులను మాత్రం వదిలేశారు.  వారు ప్రభుత్వ తీరుపై  భగ్గుమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యపై స్పందించి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో రిటైర్‌ చేసి తమకు రావాల్సిన ప్రయోజనాలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


Read more