గంజాయి గుప్పుగుప్పు

ABN , First Publish Date - 2022-12-10T00:01:25+05:30 IST

గంజాయికి యువకులు, విద్యార్థులు బానిసవుతున్నారు. మైకంలో తేలిపోతున్నారు. ఒక్కసారి గంజాయి దమ్ము లాగిన వారు వాటిని వదల్లేకపోతున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకొని కొందరు వల విసురుతున్నారు.

గంజాయి  గుప్పుగుప్పు

బానిసలవుతున్న యువత, విద్యార్థులు

విద్యాసంస్థలు, పారిశ్రామిక

వాడలు ఉన్న ప్రాంతాలు అడ్డాలు

చీమకుర్తి నుంచి ఒంగోలుకు ప్యాకెట్లు

బడ్డీకొట్లలోనూ అమ్మకాలు

జోరుగా మొబైల్‌ విక్రయాలు

ఒంగోలు రామ్‌నగర్‌ 10వలైన్‌లో నివాసం ఉండే ఓ ఇంటర్‌ విద్యార్థి గంజాయికి బానిసయ్యాడు. తల్లిపై నిత్యం దాడికి పాల్పడుతున్నాడు. అతడిని ఇటీవల ఎస్‌ఈబీ సిబ్బంది పట్టుకున్నారు.

నగరంలోని లాయర్‌పేట సాయిబాబా గుడి వద్ద ఓ యువకుడు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తూ పోలీసులకు దొరికాడు. విచారణలో తొలుత తాను గంజాయికి బానిసయ్యానని, అనంతరం అమ్మకాలు ప్రారంభించానని తెలిపాడు.

మూడు నెలల క్రితం నగరంలోని ఇస్లాంపేటకు చెందిన ఇరువురు యువకులు హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తూ అక్కడ పట్టుబడ్డారు.

ఆరు నెలల క్రితం మెడికోలకు గంజాయి విక్రయిస్తూ రిమ్స్‌లోని సెక్యూరిటీ గార్డు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇవి మచ్చుక కొన్ని ఉదాహరణలు మాత్రమే.

జిల్లాలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ముఠాలు గంజాయిని జిల్లాకు తెస్తున్నాయి. విద్యాసంస్థలు, కూలీలు ఉండే పారిశ్రామిక ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని విక్రయిస్తున్నాయి. దాని మత్తులో చిక్కి యువత, విద్యార్థులు, కూలీలు చిత్తవుతున్నారు. గంజాయిని కాల్చి, పీల్చి అనారోగ్యం బారినపడుతున్నారు. బంగారు భవిష్యత్‌ను బలి చేసుకుంటున్నారు. అదేసమయంలో గంజాయి వ్యాపారం మాత్రం మూడు దమ్ములు.. ఆరు కిక్కులుగా సాగుతోంది.

ఒంగోలు(క్రైం), డిసెంబరు 9 : గంజాయికి యువకులు, విద్యార్థులు బానిసవుతున్నారు. మైకంలో తేలిపోతున్నారు. ఒక్కసారి గంజాయి దమ్ము లాగిన వారు వాటిని వదల్లేకపోతున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకొని కొందరు వల విసురుతున్నారు. గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

బానిసలుగా యువత, విద్యార్థులు

యువకులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు కిక్‌కోసం పరితపిస్తూ గంజాయికి అలవాటు పడుతున్నారు. సిగరెట్లో గంజాయి ఎక్కించుకొన తాగి మైకంలో మునిగిపోతున్నారు. కొందరు గంజాయి తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవల గంజాయి తాగుతూ, విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన వారు విచారణలో చెప్పిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. గంజాయికి బానిసైన కొందరు చదువును మధ్యలోనే మానేస్తుండగా, మరికొందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరు మత్తుకు బానిసలు కావడంతోపాటు గంజాయి వ్యాపారులుగా మారుతున్నారు. మరికొందరు నేరాలకు పాల్పడుతున్నారు.

విశాఖ నుంచి సరఫరా

విశాఖపట్నం ప్రాంతం నుంచి ఎక్కువగా జిల్లాకు గంజాయి దిగుమతి అవుతోంది. ఒంగోలు నగర పరిసర ప్రాంతాలైన చీమకుర్తి, పేర్నమిట్ట, మద్దిపాడు, టంగుటూరులలో పెద్దమొత్తంలో నిల్వ ఉంచుతున్నారు. అక్కడ చిన్న, చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి తెచ్చి నగరంలో తెస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ రూ.50, రూ.100, రూ.200కు అమ్ముతున్నారు. తక్కువ మొత్తానికి ఎక్కువ కిక్‌ ఇస్తుండటంతో యువత, విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. ఎక్కువగా విద్యా సంస్థలున్నప్రాంతాలు, పారిశ్రామికవాడల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి.

బడ్డీ కొట్లలోనూ గంజాయి విక్రయాలు

నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న బడ్డీకొట్లు, టీ స్టాల్స్‌ గంజాయి విక్రయ కేంద్రాలుగా మారాయి. ఇటీవల శర్మకాలేజీ వద్ద ఉన్న ఓబడ్డీ కొట్టులో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గోరంట్ల కాంప్లెక్స్‌ సమీపంలోని ఇటుక బట్టీల సెంటర్‌లో స్మోకింగ్‌ జోన్‌ల పేరుతో టీస్టాల్స్‌ వద్ద గంజాయి పొగ గుప్పు మనిపిస్తున్నారు. దశరాజుపల్లె వెళ్లే రోడ్డు, సంఘమిత్ర సమీపంలో ముళ్ల పొదల్లో గంజాయిని విచ్చలవిడిగా తాగుతున్నారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి.

చీమకుర్తి నుంచి ఒంగోలుకు ప్యాకెట్లు

గెలాక్సీ నగర్‌గా పేరున్న చీమకుర్తి నుంచి ఎక్కువగా గంజాయి నగరంలోకి సరఫరా అవుతున్నట్లు ఇటీవల పట్టుబడిన వారు చెబుతున్నారు. మరికొంత మంది మద్దిపాడు గ్రోత్‌సెంటర్‌, కొందరు టంగుటూరు నుంచి ప్యాకెట్లు కొనుగోలు చేసి ఒంగోలు నగరంలో యువకులు, విద్యార్థులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పోలీసులు అరికట్టలేకపోతున్నారు. తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసలు మూలాల జోలికి వెళ్లకుండా అక్కడక్కడా ఒకరిద్దరిని పట్టుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

కఠిన చర్యలు తీసుకుంటాం

మలికగర్గ్‌, ఎస్పీ

జిల్లాలో గంజాయి రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి కేసులలో పాత నేరస్థులపై నిరంతరం నిఘా కొనసాగిస్తాం. గంజాయి సేవించడం వలన కలిగే దుష్పరిణామాలను అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవల జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడైనా గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తెలిస్తే డయల్‌ 100, సెల్‌ నెంబర్‌ 912110266కు సమాచారం ఇవ్వాలి.

Updated Date - 2022-12-10T00:01:27+05:30 IST