కుండపోత..

ABN , First Publish Date - 2022-10-02T04:32:55+05:30 IST

అద్దంకి ప్రాంతంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి.

కుండపోత..
దుద్దుకూరు వద్ద పొంగి ప్రవహిస్తున్న వాగు

పొంగిపొర్లుతున్న వాగులు   ఫ  రాకపోకలకు అంతరాయం

అద్దంకిలో ఇళ్లలోకి చేరిన వర్షపు  నీరు

కొప్పరంలో పిడుగుపాటుకు  వ్యక్తి మృతి

రెండు రోజుల్లో 25 సెం.మీ పైగా వర్షం

అద్దంకి, అక్టోబరు 1: అద్దంకి ప్రాంతంలో రెండు  రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో వాగులు పొంగి  పొర్లుతున్నాయి. శుక్ర, శనివారాల్లో ఎడతెరపి  లేకుండా వర్షం పడుతుండటంతో పట్టణంలోని పలు కాలనీలలో ఇళ్ళలోకి నీరు చేరింది.   అద్దంకి, పంగులూ రు మండలాల్లో వాగులు  పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు  ఇబ్బందిగా మారింది. శనివారం ఉదయం వరకు అద్దంకిలో  178.8 మి.మీ వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం  8.30 నుంచి  సాయంత్రం 6 గం టల వరకు 72.6 మి.మీ వర్షపాతం నమోదైంది. రెండు రోజులలో 25 సె.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా ఎడతెరపి  లేకుండా వర్షం పడుతూనే  ఉంది.

నల్లవాగు ఉధృతి

నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అద్దంకి నుంచి బొమ్మనంపాడు, చెరువు కొమ్ముపాలెం, నాగులపాడులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అద్దంకి పట్టణం కు సమీపంలో రేణింగవరం  రోడ్డులో నల్లవాగు  ఉధృతి ఎక్కువగా ఉండటంతో కల్వర్టు పై గుండా ప్రవహించింది. దీంతో అద్దంకి నుంచి పంగులూరు, ఇంకొల్లు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నల్లవాగు ఉధృతితో గుంటూరు, విజయవాడ, ఇంకొల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చే, వెళ్ళే వాహనచోదకులు మేదరమెట్ల మీదుగా వెళ్ళారు.  సంతమాగులూరు మండలం కొప్పరంలో పిడుగు పడి గుంజి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. అద్దంకి మండలం బొమ్మనంపాడులో కామేపల్లి చెంచురామారావు సాగు చేసిన మూడు ఎకరాల డ్రాగన్‌ ప్రూట్స్‌, జామ తోటలు పూర్తిగా మోకాలి లోతు నీటిలో మునిగిపోయాయి.

ఇళ్లలోకి చేరిన నీరు 

అద్దంకి పట్టణంలోని బిక్షాలు కాలనీ, నంబూరిపాలెం, దూదేకులపాలెం, ఎన్‌టీఆర్‌ నగర్‌, సంజీవనగర్‌ తదితర ప్రాంతాలలో పలు ఇళ్ళలోకి నీరు చేరింది. సైడ్‌ డ్రైన్‌ లు పొంగి రోడ్లపై నీరు నిలిచింది. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణ, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాలు చెరువులను తలపించేలా నీరు పెద్ద ఎత్తున నిలిచింది. 

చెరువులను తలపిస్తున్న పొలాలు

బల్లికురవ : భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపించాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.   మండలంలోని నక్కబొక్కలపాడు, కొత్తపాలెం, బల్లికురవ, కొణిదెన, గంగపాలెం, కొప్పెరపాడు, అంబడిపూడి, వల్లాపల్లి, గుంటుపల్లి, వైదన, వెలమవారిపాలెం, చెన్నుపల్లి, తదితర గ్రామాలలో రైతులు మెట్ట పంటలైన మిర్చి, పత్తి, మొక్కజొన్న, అరటి,  కూరగాయల పంటలను సాగు చేశారు. ఈ పంటలకు ఇప్పటివరకు నీరు అందక బెట్టకు వచ్చి ఎండుముఖం పట్టాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు జీవం పోసుకొన్నాయి. నక్కబొక్కలపాడులో  ఉల్లి మడులు నీటిలో మునిగి ఉన్నాయి. 

జలమయమైన రోడ్లు

కుండపోత వర్షంతో మండలంలోని గ్రామాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. బల్లికురవ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే ప్రధాన రోడ్డులో మురికి కాలువలు లేక వర్షపు నీరు వాగులను తలపించేలా రోడ్డు మీదనే నిలబడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందలుఉ పడ్డారు. కొప్పెరపాడులో బ్యాంకు రోడ్డులో వర్షపు నీరు నిలిచిపోయింది. మార్టూరు - బల్లికురవ రోడ్డులో పెద్ద పెద్ద గోతులలో వర్షపు నీరు చేరటంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. 

గ్రానైట్‌ క్వారీలలో నిలిచిన పనులు

భారీ వర్షాల ప్రభావంతో గ్రానైట్‌ క్వారీలలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్వారీ గుంతలలో నీరు పెద్ద ఎత్తున నిలబడటంతో పనులు చేసే వీలు లేక కార్మికులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. వర్షాలు తగ్గినా మరో రెండు రోజుల వరకు గ్రానైట్‌ క్వారీలలో పనులు చేయటం కష్టమని యజమానులు పేర్కొన్నారు. 

ఇంజన్ల ద్వారా వర్షపు నీటిని బయటకు పంపాల్సి ఉందని వారు తెలిపారు.

మిర్చికి కొంత నష్టం... 

చీరాల : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో సాగుచేసిన మిరపకు కొంతమేర నష్టం వాటిల్లింది. మిరప పొల్లాల్లో నీరు నిలబడటంతో మాగుడు తెగులు ఆశించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలకు మూడు,నాలుగు రోజుల ముందు దుక్కిదున్నినవారికి, కలుపు మందు పిచికారి చేసినవారికి మరలా సేద్యం, మందు ఖర్చులు తప్పవని చెప్తున్నారు.  

జలదిగ్బంధంలో ఇంకొల్లు

నాలుగువైపులా నిలిచిన రాకపోకలు

పొంగి ప్రవహిస్తున్న వాగులు

ఇంకొల్లు : ఇంకొల్లు జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపులేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇంకొల్లుకు నాలుగువైపుల ఉన్న వాగుల్లో నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకొల్లుకు చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకొల్లు నుంచి ఒంగోలు వెళ్లే పాతమద్రాసు రోడ్డులో దుద్దుకూరు వద్ద నేలచప్టాపై నీరు ప్రవహిస్తోంది. ఇంకొల్లు నుంచి మార్టూరు వెళ్లే రహదారిలో నాగండ్ల గ్రామానికి ఇరువైపులా ఉన్న రెండు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.  పర్చూరు వెళ్లే రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అద్దంకి వైపు వెళ్లే రోడ్డులో అప్పేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. పూసపాడు అడ్డరోడ్డు వద్ద కప్పలవాగు శిథిలావస్థకు చేరడంతో నేలచప్టా నిర్మించడంతో దీనిపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇంకొల్లు, చుట్టపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరుపులేకుండా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలలోని ఇఽళ్లలోకి నీరు చేరింది. పంట పొలాలు సైతం ఎటుచూసినా నీటితో చెరువులను తలపిస్తున్నాయి.

నారు మడుల్లో నిలిచిన నీరు

చినగంజాం : మండలంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో వరి నాడుమడులలోకి నీరు చేరింది. సంతరావూరు, కడవకుదురు, చింతగుంపల్లి, చినగంజాం ప్రాంతంలో నారు మడులు చేశారు.   నీరు నిలబడటంలో అవి దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంతరావూరు గ్రామ పరిఽధిలో 40ఎకరాలలో వేసిన మిర్చి ఉరకెత్తుతుందేమోనని రైతులు భయపడుతున్నారు. రొయ్యల చెరువులలో వర్షానికి కూలింగ్‌ సమస్య వస్తుందని ఆక్వా రైతులు పేర్కొన్నారు. చినగంజాం, కడవకుదురు ప్రాంతాల్లోని ఆర్‌అండ్‌బీ రోడ్లపై నీరు నిలబడి చెరువులను తలపిస్తున్నాయి.

చెరువులను తలపిస్తున్న పొలాలు

పర్చూరు : మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరటంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నీరుపారుదల లేక మురుగునీటితో కలసి వర్షపునీరు రోడ్లపైకి చేరటంతో రాకపోకలు సాగించేందుకు ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇవస్ధలు పడుతున్నారు. పర్చూరు, కారంచేడు మండలాల పరిధిలో మిర్చి, పత్తి పంటల్లోకి భారీగా వ ర్షపు నీరు చేరటంతో  రైతులు అందోళన చెం దుతున్నారు. మరో రెం డు రోజులు ఇదేవిధంగా భారీ వర్షం కురిస్తే తీవ్రంగా నష్టంవాటిల్లే పరిస్థితి ఉంటుందని రైతులు పేర్కొన్నారు.


Read more