ఫిట్‌నెస్సా.. ప్లీనరీనా..!

ABN , First Publish Date - 2022-07-08T05:03:56+05:30 IST

పిల్లలను తీసుకొని బడికి వెళ్లాల్సిన బస్సులు జనాలను అధికార వైసీపీ ప్లీనరీకి తరలించే పనిలో ఉన్నాయి. అందుకు రవాణాశాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే రవాణాశాఖ ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా ఆదేశాలు అందాయి. దీంతో రవాణా శాఖ సిబ్బంది రంగంలోకి దిగి బస్సులు ప్లీనరీకి సిద్ధం చేసే పనిలో నిమగ్న మయ్యారు.

ఫిట్‌నెస్సా.. ప్లీనరీనా..!

వైసీపీ ప్లీనరీకి స్కూల్‌ బస్సులు

పంపించాల్సిందేనని రవాణా శాఖ అధికారుల హుకుం

అటు రవాణా శాఖపై ప్రజాప్రతినిధుల వత్తిడి

ఫోన్‌ వాయిస్‌ దొరకకుండా జాగ్రత్తలు

పార్కింగ్‌ ప్రాంతాల్లో సిబ్బంది లేకుండా చర్యలు

ఒంగోలు(క్రైం), జూలై 7 : 

- రవాణా శాఖ కార్యాలయంలో గురువారం ఓ ముఖ్య ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యదర్శి అతని అనుచరులు వెళ్లి ప్లీనరీకి వెళ్లేందుకు వాహనాల కోసం అధికారులపై ఒత్తిడి చేయడం కనిపించింది. ఏకంగా ఉన్నతాధికారి ఎదుటే కూర్చుని మాట్లాడుతుండటం గమనార్హం.

- జిల్లాకేంద్రానికి సమీప నియోజకవర్గానికి చెందిన మరో ప్రజాప్రతినిధి అయితే ఫోన్‌ చేసి మరీ ఏకంగా తనకు 120 స్కూలు బస్సులు కావాలని అడిగారు. అవన్నీ సాయంత్రానికే తమకు అప్పగించాలని హుకుం జారీచేశారు. అయితే రవాణాశాఖ అధికారులు మాత్రం అన్ని తమవల్ల కాదని చెప్పడం కొసమెరుపు.

- ఇదీ జిల్లాలో అధికారపార్టీ బరితెగింపు. వారి ఒత్తిడితో రవాణాశాఖ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వైసీపీ ప్లీనరీకి స్కూలు బస్సులు పంపాలంటూ ఇప్పటికే యాజమాన్యాలకు ఫోన్లు వెళ్లాయి. మొదట హోంగార్డులు మాట్లాడటం.. వినకుంటే డైరెక్టుగా బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు లైన్లోకి రావడం జరుగుతోంది. అయితే ఎక్కడా దొరకకుండా పక్కాగా జాగ్రత్త పడుతున్నారు. బస్సులకు ఫిట్‌నెస్‌ కావాలంటే బస్సులు పంపక తప్పదంటూ బెదిరిస్తున్నారు. ఉన్నవాటిలో కొన్ని పంపుతాం.. మిగతా వాటిని పిల్లల రవాణాకు వాడుకుంటాం అని బతిమలాడినా వినని పరిస్థితి. కొత్త బస్సులన్నీ పంపాల్సిందే.. డీజిల్‌ కొట్టిస్తారు.. డ్రైవర్‌ నంబర్‌ పంపమని హుకుం జారీచేసినట్లు కొందరు యజమానులు వాపోతున్నారు.

పిల్లలను తీసుకొని బడికి వెళ్లాల్సిన బస్సులు జనాలను అధికార వైసీపీ ప్లీనరీకి తరలించే పనిలో ఉన్నాయి. అందుకు రవాణాశాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే రవాణాశాఖ ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా ఆదేశాలు అందాయి. దీంతో రవాణా శాఖ సిబ్బంది రంగంలోకి దిగి బస్సులు ప్లీనరీకి సిద్ధం చేసే పనిలో నిమగ్న మయ్యారు. నేడు, రేపు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగే వైసీపీ ప్లీనరీకి జనాన్ని తరలించేందుకు స్కూలు బస్సులను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లకు ఇన్ని వాహనాలు సమకూర్చాలనే కేటాయింపులతో కూడిన ఆదేశాలు వచ్చాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా రవాణా శాఖ అధికార్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేకాదు మాకు వంద బస్సులు కావాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరి కొంతమంది నేరుగా తమ అనుచరులను రవాణా శాఖ కార్యాలయానికి పంపించి బస్సులు కేటాయింపు చేసుకుంటున్నారు. 


ఫిట్‌నెస్‌ ఇచ్చేది లేదు..

జిల్లాలో 1,198 స్కూలు బస్సులు ఉండగా 650 ఇప్పటికే ఫిట్‌నెస్‌ చేయించుకున్నాయి. మిగతా వాటికి ఫిట్‌నెస్‌ సాకుగా చూపి యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు. తర్వాతనైనా ఇబ్బందిపడతారని బెదిరిస్తున్నారు. ఇదిలా ఉండగా మిగిలిన బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించాల్సిన రవాణాశాఖ తమ పనిని పక్కనబెట్టి ఆగమేఘాల మీద ప్లీనరీకి బస్సులు సమకూర్చే పనిలో నిమగ్నమైంది. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిరిగితే దానిలో ప్రయాణించే పిల్లల ప్రాణాలకు ముప్పు. అది గాలికి వదిలిన యంత్రాంగం మొత్తం ప్లీనరీని విజయవంతం చేసే పనిలో నిమగ్నమైంది. తొలుత స్కూల్‌ యాజమాన్యాలకు హోంగార్డులు ద్వారా ఫోన్‌లు చేయిస్తున్నారు. మీ స్కూలు నుంచి ప్లీనరీకి మొత్తం బస్సులు పెట్టాలని చెబుతున్నారు. వారికి వినకపోతే నేరుగా బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు రంగంలోకి దిగి బస్సు నంబర్లు, డ్రైవర్ల్‌ ఫోన్‌ నంబర్లు ఇవ్వాలని హుకుం జారీచేస్తున్నారు. రెండురోజుల పాటు అవసరం అని కూడా చెబుతున్నట్లు సమాచారం. లేకుంటే మీ స్కూల్‌కు వచ్చి బస్సులపై కేసులు నమోదు చేస్తామని, ఫిట్‌నెస్‌ ఇచ్చేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


స్కూలు బస్సులు ప్లీనరీకి..

స్కూలుకు వెళ్లేందుకు మాత్రమే అనుమతులు తీసుకున్న బస్సులను ప్లీనరీకి ప్రజలను రవాణా చేయడం నిబంధనలకు విరుద్ధం. బస్సులకు ఎంత వరకు పరిమితి ఉందో అదే ప్రాంతంలో ఎందుకు అనుమతి తీసుకున్నారో అందుకే వినియోగించాలి. అయితే అధికారాన్ని అడ్డుపెట్టి నిబంధనలు తుంగలోతొక్కి ఇష్టానుసారంగా పాఠశాల యాజమాన్యాలను బెదిరించి బస్సులను ప్లీనరీలకు తీసుకెళుతున్నారు. అందుకు రవాణాశాఖ అధికారులను వినియోగిస్తున్నారు. రేపు జరిగే బహిరంగ సభకు భారీగా సమీకరణ చేసేందుకు స్కూల్‌ బస్సులు ద్వారా ప్రజలను తరలించేందుకు సన్నాహలు చేపట్టారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులపై ప్రజాప్రతినిధులు వత్తిడి పెంచారు. తమ నియోజకవర్గానికి 120 బస్సులు కావాలని ఒక ఎమ్మెల్యే డిమాండ్‌చేశారు. అన్ని అంటే కష్టమని, తాము సమకూర్చలేమని రవాణాశాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. ఏకంగా ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యదర్శి గురువారం మధ్యాహ్నం వెళ్లి బస్సుల విషయం రవాణా అధికారులతో చర్చించి వెళ్లడం గమనార్హం. ఇలా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిఽధులు నేరుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న రవాణాశాఖ అధికారులు, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లతో మాట్లాడుకుని స్కూల్‌ బస్సులు సమకూర్చుకుంటున్నారు.


రవాణా శాఖ జాగ్రత్తలు

బస్సులు సమకూర్చే సమయంలో రవాణాశాఖ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఫోన్‌ వాయిస్‌ దొరకకుండా ఉండాలని అందుకని ప్రజాప్రతినిధులతో డైరెక్టుగా ఫోన్‌ మాట్లాడవద్దని, బస్సులు పార్కు చేసే ప్రాంతంలో రవాణాశాఖ సిబ్బంది కనిపించకుండా ఉండాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్లీనరీకి మాత్రం బస్సులు సమకూర్చాలని ఉన్నతాధికారుల ఆదేశాలు పరిగణనలోకి తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. మొత్తంగా బడి బస్సులు సమకూర్చే పనిలో రవాణా శాఖ యంత్రాగం నిమగ్నమైంది.


బస్సులు ప్లీనరీకి సమకూర్చడం లేదు

- రవాణా శాఖ ఉప కమిషనర్‌ శ్రీకృష్ణవేణి

రవాణా శాఖ వైసీపీ పీనరీకి బస్సులు సమకూర్చడం లేదు. అయితే స్కూలు బస్సుల వివరాలు మాత్రం అడిగిన వారికి ఇస్తున్నాం. బస్సులను ఎందుకు అనుమతి ఇచ్చారో అందుకే వినియోగించాలి. స్కూలు బస్సులు ప్లీనరీలకు అనుమతి లేదు. అలా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. 


Updated Date - 2022-07-08T05:03:56+05:30 IST