సిండికేట్‌గా దోపిడీ!

ABN , First Publish Date - 2022-11-25T00:13:37+05:30 IST

జిల్లాలో ఆక్వారైతులు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత పదిహేను రోజులుగా రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో అటు పంటను తీయలేక, అలాగే ఉంచితే ఖర్చు భరించలేక కొట్టుమిట్టాడుతున్నారు.

సిండికేట్‌గా దోపిడీ!

ప్రభుత్వం చెప్పిన ధరకు

కొనుగోలు చేయలేమన్న వ్యాపారులు

భారీగా పడిపోయిన ధరలు

కొనేదిక్కే లేక రైతులు దిగాలు

వ్యాపారుల సిండికేట్‌ నేపథ్యంలో ధరాఘాతంతో జిల్లాలోని ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఒకవైపు చెరువుల్లో చేతికి వచ్చిన పంట.. ఇంకోవైపు కొనుగోలు చేసేవారు లేకపోవటంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పంట హార్వెస్టింగ్‌కు వచ్చిన చెరువులో రొయ్యలను అలాగే ఉంచాలంటే రోజుకు మేతకు, ఏరియేటర్స్‌కు వేలలోనే ఖర్చు. దీంతో రైతులు ఖర్చును భరాయించలేక పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక అల్లాడుతున్నారు.

ఒంగోలు నగరం, నవంబరు 24: జిల్లాలో ఆక్వారైతులు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత పదిహేను రోజులుగా రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో అటు పంటను తీయలేక, అలాగే ఉంచితే ఖర్చు భరించలేక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం రొయ్యల రైతులకు మద్దతు ధర కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలించటం లేదు. వ్యాపారులు రైతులను నిలువునా దగా చేస్తున్నారు. ప్రభుత్వం రొయ్యల రైతులను ఆదుకునేందుకు దాదాపు నెలక్రితం వ్యాపారులు, రొయ్యల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి 100 కౌంటు రొయ్యలను రూ.240కు, 60 కౌంటు రొయ్యలను రూ.270కు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వ్యాపారులు ఇంతవరకు కొనుగోలు చేయలేదు. పైగా తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు కొనుగోలు చేయాలంటూ రైతుల నుంచి వత్తిడి పెరగటంతో గత వారం రోజులుగా వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. 100 కౌంటు రొయ్యలను రూ.200లోపే అమ్ముకునేందుకు సిద్ధమైనా కొనుగోలు చేసే దిక్కే లేకుండాపోయింది. ప్రభుత్వం ప్రకటించిన ధరకు 100 కౌంటు రూ.240కి విక్రయించినా రైతులకు గిట్టుబాటు ధర కాని పరిస్థితుల్లో రూ.200 నుంచి రూ.175 ధరకు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేయాలంటూ రైతుల నుంచి వత్తిడి పెరగటంతో గత పదిరోజుల నుంచి పూర్తిగా కొనుగోళ్లను నిలిపివేశారు.

ఖర్చు తడిసిమోపెడు..

రొయ్యల రైతులకు సాగులో ఖర్చులు ప్రస్తుతం తడిసిమోపెడు అవుతున్నాయి. మేత, సీడ్‌, యాంటిబయోటిక్స్‌ ధరలను గత ఏడాదిగా రెట్టింపు అయ్యాయి. ఇక విద్యుత్‌ చార్జీలు అయితే మోయలేని భారంగా మారాయి. గత ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్‌ ధర రూ.2కు అందిస్తే ఈ ప్రభుత్వం యూనిట్‌ రూ.4.50కు పెంచేసింది. రూ.1.50లకే యూనిట్‌ విద్యుత్‌ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలుకావటం లేదు. దీంతో రైతులు 100 కౌంటు రొయ్యలను ఉత్పత్తి చేయాలంటే రూ.270 దాకా ఖర్చవుతోంది. ఇక వ్యాపారులు కొనుగోలు చేస్తుంది రూ.200లోపే. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి దాపురించింది.

వ్యాపారుల సిండికేట్‌..

ఒకవైపు వ్యాపారులపై ప్రభుత్వం నుంచి వత్తిడి పెరుగుతోంది. అయినా వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి ఏ మాత్రం ఖాతరు చేయటం లేదు. రైతుల నుంచి ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేది లేదంటూ తేల్చిచెప్పేస్తున్నారు. మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు కూడా మందగించాయని వ్యాపారులు వాదన వినిపిస్తున్నారు. ఆక్వా సాగు జరిగే ఇతర దేశాల్లో ఈ సారి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, దీంతో మన దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలపై ఈ ప్రభావం పడిందని అంటున్నారు. చైనా వంటి దేశాలు మన దేశం నుంచి పూర్తిగా ఎగుమతులను నిలిపివేశాయని చెబుతున్నారు. అయితే వ్యాపారుల వద్ద రొయ్యలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-11-25T00:13:37+05:30 IST

Read more