అంతా మాయ!

ABN , First Publish Date - 2022-09-10T06:22:48+05:30 IST

జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఈడీ పరీక్షలు అంతా మాయగా జరుగుతున్నాయి.

అంతా మాయ!
ఒంగోలులో పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు

తరగతులు నిర్వహించకుండానే బయట విద్యార్థులకు బీఈడీ పరీక్షలు

ఇతర రాష్ట్రాల వారే అధికులు

పలు పట్టణాల్లో వారి రాకతో రద్దీ

జోరుగా సాగుతున్న విద్యా వ్యాపారం

దళారుల ద్వారా వస్తున్న  విద్యార్థులు

మొదలైన బీఈడీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

గిద్దలూరులో బీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు మొదలయ్యాయి. పశ్చిమబెంగాల్‌, ఒడిసా తదితర రాష్ట్రాల నుంచి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వచ్చారు.  వారి రాకతో లాడ్జీలన్నీ నిండిపోయాయి. నియోజకవర్గంలోని 35 బీఈడీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు 14 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. శుక్రవారం సైలెంట్‌ కాపీయింగ్‌ జరిగింది. పాస్‌ గ్యారెంటీతో దళారులు ముందే అంతా మాట్లాడారు.

దర్శిలో బీఈడీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు శుక్రవారం ఆరంభమయ్యాయి.  మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, అసోం, ఒడిసా తదితర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. ఎలాంటి క్లాసులకు హాజరుకాకుండానే విద్యార్థులు ఫీజులు కట్టి పరీక్షలు రాయటం గమనార్హం. 

విద్యార్థులకు చదువులు చెప్పే గురువులకు అర్హత కోర్సు అయిన బీఈడీ బజారు సరుకైంది. అత్యధిక శాతం కళాశాలల్లో అసలు క్లాసులు లేకుండానే ఏకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిని  రాసే వారిలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఒకటి, రెండు రోజులు కూడా తరగతులకు హాజరుకాకుండానే వారు పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని  ఒంగోలు నగరం, పశ్చిమప్రాంతంలోని పట్టణాల్లోని హోటళ్లు, ఇతర వసతి గృహాలు వివిధ రాష్ట్రాల విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. విద్యార్థులకు చదువులు చెప్పే పవిత్రమైన ఉపాధ్యాయులకు అవసరమైన బీఈడీ కోర్సు ఉన్న కాలేజీలపై నియంత్రణ లోపించింది. రెండేళ్ల ఈ కోర్సు చెప్పే కళాశాలలు రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే ఉన్నాయి. దీంతో భారీగా డబ్బులు వసూలు చేసి అంతా మేనేజ్‌ చేస్తున్నారు.

ఒంగోలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఈడీ పరీక్షలు అంతా మాయగా జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం 114 బీఈడీ కళాశాలలు ఉన్నట్లు సమాచారం. కాగా వాటిలో దాదాపు 15వేల మంది విద్యార్థులు కోర్సు చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. శుక్రవారం నుంచి నాలుగురోజులపాటు ఈ పరీక్షలు జరుగుతుండగా రాస్తున్న వారిలో 90శాతం మంది ఇతర రాష్ట్రాల వారే. రెండేళ్లలో పట్టుమని పది రోజులు కూడా వారికి ఆయా కళాశాలల్లో తరగతులు నిర్వహించిన పరిస్థితి లేదు. కొన్ని కాలేజీలకు కనీస భవనాలు కూడా లేని దుస్థితి కాగా నాగార్జున యూనివర్సిటీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి బీఈడీ కళాశాలలకు చెందిన యాజమాన్యాలు దళారుల ద్వారా ఇతర రాష్ట్ర విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఏడాదికి ఒక్కో విద్యార్థి వద్ద రూ.60వేల నుంచి రూ.70వేలు ఫీజు రూపంలో తీసుకొనే దళారులు అందులో సగం ఇక్కడి కాలేజీలకు ఇస్తున్నట్లు సమాచారం. 


పాస్‌ గ్యారెంటీ పేరుతో..

పాస్‌ గ్యారెంటీ పేరుతో క్లాసులకు రాకపోయినా పరీక్షలు రాస్తే పాస్‌ చేయించేలా దళారులు పక్క రాష్ర్టాల విద్యార్థులను అకర్షిస్తున్నారు. వారి నుంచి వసూలు చేసే మొత్తంలో కొంత యూనివర్సిటీ అధికారులకు ఇచ్చి పాస్‌ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలు జరుగుతున్న తీరు అందుకు ఊతం ఇస్తోంది. ప్రధానంగా ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ వారు ఇలా ఎక్కువగా వస్తున్నారు. గత ఐదారేళ్ల క్రితం ఈతరహా విధానం అధికంగా ఉండగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలతో అప్పటి కలెక్టర్‌, రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి కొంతమేర కట్టడి చేశారు. తిరిగి రెండేళ్లుగా మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతోంది. శుక్రవారం నుంచి రెండేళ్ల కోర్సు నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కావడంతో పొరుగు రాష్ట్రాల విద్యార్థులతో పశ్చిమప్రాంతంలోని పట్టణాలు రద్దీగా మారాయి. 


పశ్చిమంలో అధికం వారే

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 114 కాలేజీల నుంచి 15వేల మంది వరకు విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం 43 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్క గిద్దలూరు నియోజకవర్గం వరకూ చూస్తే గిద్దలూరులో 14, కంభంలో 13, బీపేట మండలంలో మరో ఎనిమిది బీఈడీ కాలేజీలు ఉన్నాయి. వాటి ద్వారా 4500 మంది రాస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో 19 కాలేజీల నుంచి 2,300 మంది పరీక్షకు హాజరవుతు న్నారు. మార్కాపురంలో 12 కాలేజీలు ఉండగా 1,300 మంది ద్వారా రాస్తున్నారు. ఇలా ఆ ప్రాంతం లో పరీక్షలు రాస్తున్న వారిలో 95శాతం మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే. ఆ ప్రాంతంలో ఎక్కువ బీఈడీ కాలేజీలు ఉండటం, వారి ద్వారా వేలాది మంది పరీక్షలకు హాజరు కావడం, వారంతా పొరు గు రాష్ట్రాల వారే కావడం చూస్తుంటే గురు వులను తయారుచేసే బీఈడీ కాలేజీ ల నిర్వహణ ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు. 






Updated Date - 2022-09-10T06:22:48+05:30 IST