అంతా ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2022-04-24T05:42:08+05:30 IST

పశ్చిమ ప్రకాశంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఇటీవల జరిగినే ఘటనలే నిదర్శనం. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో ప్రత్యక్షంగానే అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖపై అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిడితో చేశారా? లేక స్వలాభం కోసం చేశారా? అన్న అంశాన్ని పక్కనపెడితే ప్రజలకు రెవెన్యూ అధికారులు చుక్కలు చూపెడుతున్నారు.

అంతా ఇష్టారాజ్యం!
మార్కాపురం ఆర్డీవో కార్యాలయం (ఫైల్‌)

అధికారుల అవినీతి దందా

మసకబారిన రెవెన్యూ శాఖ

నేతల ఒత్తిళ్లు.. సిబ్బంది స్వలాభం

బయటపడుతున్న భూఅక్రమాలు

బాధ్యులపై చర్యలు శూన్యం

మార్కాపురం, ఏప్రిల్‌ 23:

పశ్చిమ ప్రకాశంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఇటీవల జరిగినే ఘటనలే నిదర్శనం. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో ప్రత్యక్షంగానే అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖపై అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిడితో చేశారా? లేక స్వలాభం కోసం చేశారా? అన్న అంశాన్ని పక్కనపెడితే ప్రజలకు రెవెన్యూ అధికారులు చుక్కలు చూపెడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంత రెవెన్యూ అధికారులపై ప్రజలు చేసిన ఫిర్యాదులు, అందుకు అనుగుణంగా జిల్లా ఉన్నతాధికారులు చేపట్టిన విచారణల నేపథ్యంలో భారీగా భూ అక్రమాలు బయటపడ్డాయి. అందుకు అనుగుణంగా కొందరిపై చర్యలు తీసుకున్నా కొందరు మాత్రం నేతల అండతో తప్పించుకు తిరుగుతున్నారు.

 పశ్చిమ ప్రకాశంలో రెవెన్యూ అధికారులు తీరు దారుణంగా తయారైంది. అవినీతి, అక్రమాలకు మండల కార్యాలయాలు కేరాఫ్‌గా మారాయి. ఇందుకు ఇటీవల కాలంలో మార్కాపురం ప్రాంతంలో అధికారులు చేపట్టిన అక్రమాలు, వారిపై తీసుకున్న చర్యలే నిదర్శనం. అయితే మిగతా అధికారుల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. వారు స్వయంగా భూ వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా పంచాయితీలు చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ప్రజల సమస్యలు తీర్చాల్సిన వారు సంపాదనే లక్ష్యంగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు, ఇతర రూపాల్లో బయటపడ్డప్పుడు మాత్రమే ఉన్నతాధికారులు అనివార్యంగా విచారణలు చేపట్టి చర్యలు తీసుకుంటున్నారు తప్పిస్తే ఇక్కడ పరిస్థితులపై దృష్టిసారించిన దాఖలాలు పెద్దగా లేవు.  

మార్కాపురంలో భారీగా అక్రమాలు...

మార్కాపురం మండలంలో భారీగా భూఅక్రమాలు చోటుచేసుకున్నాయి. గతేడాది జూన్‌లో తహసీల్దార్‌ విద్యాసాగరుడు ఉద్యోగ విరమణ చేశారు. ముందురోజు రాత్రి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ప్రభుత్వ భూములను నాయకుల అనుచరులు, వారు సిఫార్సు చేసిన వారికి ఆన్‌లైన్‌ పూర్వకంగా ధారాదత్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అప్పట్లో తహసీల్దార్‌ విద్యాసాగరుడుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. విచారణలో భాగంగా వెల్లడైన అంశాల ఆధారంగా మార్కాపురం మండలంలోని 14మంది వీఆర్వోలు, 1 ఎంఆర్‌ఐని సస్పెండ్‌ చేశారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ కేసు ప్రస్తుతం మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విచారణలో ఉంది.

కురిచేడు మండలంలో..

దర్శి మండలానికి తహసీల్దార్‌గా వరకుమార్‌ పనిచేస్తున్న సమయంలో ఆయనను కురిచేడు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు. ఆ సమయంలో ఆయన మండలంలోని పొట్టపాడుకు చెందిన 84.36ఎకరాల అసైన్డ్‌ భూమిని కొనుగోలు ద్వారా చింతా వెంకటేశ్వర్లు, నీలకంఠన్‌ ప్రభాకరన్‌కు హక్కు కల్పించినట్లు 2021 జూన్‌ 20న ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు రావడంలో ఈ ఏడాది ఫిబ్రవరి 22న వరకుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. 

తర్లుపాడు మండలంలో..

తర్లుపాడు తహసీల్దార్‌గా భాస్కర్‌రెడ్డి 2019లో పనిచేశారు. ఆ సమయంలో సుమారు 700 ఎకరాల ప్రభుత్వ భూములను అనర్హులకు ధారాదత్తం చేశారు. అందులో భాగంగా తన కుటుంబ సభ్యుల పేర్లతో సైతం ప్రభుత్వ భూములను ఆన్‌లైన్‌ చేసుకున్న వారం వ్యవధిలో విదేశాలకు వెళ్లిపోయారు. ఆంధ్రజ్యోతి కథనాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయనను విదేశాల నుంచి పిలించారు. ఆయన చేసిన ఆన్‌లైన్‌ ప్రక్రియ అంతా అసంబద్ధమని తేల్చి వాటిని ప్రభుత్వ భూములుగా మార్చారు. అయితే అందుకు సహకరించిన కిందిస్థాయి ఉద్యోగులపై కానీ, చేసిన తహసీల్దార్‌పై కానీ ఎటువంటి శాఖాపరమైన, క్రిమినల్‌ చర్చలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.

రాచర్ల మండలంలో.. 

రెవెన్యూ శాఖ భూఅక్రమాలకు గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం కేంద్ర బిందువుగా మారింది. గతంలో అక్కడ తహసీల్దార్లుగా పనిచేసిన రత్నకుమారి, ఇందిరాదేవిల కాలంలో భూఅక్రమాలు వెలుగుచూశాయి. అటవీ భూములను అనర్హులకు కేటాయించారన్న కారణాలతో వారిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. తహసీల్దార్‌గా ఎలిజబెత్‌ రాణి పనిచేసిన కాలంలో జెపిచెరువు మాజీ సర్పంచ్‌, ప్రస్తుత వైసీపీ నాయకుడు సిఫార్పు మేరకు అనర్హులకు ఆన్‌లైన్‌ చేసినట్లు అభియోగాలున్నాయి. అదేవిధంగా సత్యవోలు, ఎడవల్లి గ్రామాల్లో 400ఎకరాల ప్రభుత్వ భూములను అనర్హులకు అన్యాక్రాంతం చేసినట్లు ప్రచారం  ఉంది. వీటికి సంబంధించి ప్రస్తుతం లోకాయుక్త కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయి. తహసీల్దార్‌గా కోనా చెన్నకేశవులు పనిచేసిన కాలంలో మండలంలోని సోమిదేవిపల్లిలో దళితులకు చెందిన భూములను వీఆర్‌ఏ వెంకటస్వామి కుటుంబసభ్యుల పేరుతో ఆన్‌లైన్‌ చేసినట్లు అభియోగాలున్నాయి. గతేడాది ఉద్యోగ విరమణ చేసిన ఆయన మండలంలోని ఆకవీడులో తర్లుపాడులో నివాసముంటున్న తన కుటుంబసభ్యుల పేరుతో ప్రభుత్వ భూములను ఆన్‌లైన్‌ చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ప్రస్తుతం ఈ విషయం విచారణలో ఉంది. ఈ విషయంలో ఆ మండలంలో గతంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తి క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

సస్పెండ్‌ అయిన ఇన్‌చార్జి తహసీల్దార్‌ వీరయ్య

ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేసిన వాడాల వీరయ్యపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి వాడాల వీరయ్య మంత్రి సురేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న వైపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలంలో డీటీగా విధులు నిర్వహించాలి. అక్కడ విధులు చేపట్టిన వారంరోజులకే వైపాలెం ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి వైపాలెం డీటీగా అశోక్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విధివిధానాల మేరకు తహసీల్దార్‌ పోస్టు ఖాళీ ఏర్పడితే అక్కడ విధులు నిర్వహిస్తున్న డీటీకి తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించాలి. అందుకు విరుద్ధంగా ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వాడాల వీరయ్యకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వీరయ్యపై ఇటీవల వైపాలెంలో జరిగిన భూఅక్రమాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.  అతను కోట్లలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతనెల వైపాలెంలో జరిగిన రియల్టర్‌ హత్యలో వీరయ్య హస్తముందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఆ కేసులో 13వ నిందితుడిగా వీరయ్య పేరును చేర్చారు. వీరయ్యపైౖ చర్యలు తీసుకోవాలని ఆదినారాయణ కుటుంబసభ్యులు మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద రిలేదీక్షలు కూడా చేపట్టారు. ఎట్టకేలకు కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మరుసటిరోజు వీరయ్యను సస్పెండ్‌ చేయడంతో ఆదినారాయణ కుటుంబసభ్యులు దీక్షను విరమించారు. ఈ విధంగా పశ్చిమ ప్రకాశంలో బోల్డన్ని అవినీతి వ్యవహారాలు నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కానీ వారిపై చర్యలు మాత్రం ఆ స్థాయిలో లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీరయ్య అక్రమాలపై విచారణ నడుస్తోంది:

- లక్ష్మీశివజ్యోతి, ఆర్డీవో 

ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేసి తర్వాత పుల్లలచెరువు డీటీగా వెళ్లిన వీరయ్య అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై విచారణ జరుగుతోంది. ఎస్‌డీసీ శ్రీదేవిని విచారణాధికారిగా పూర్వ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నియమించారు. ఆ విచారణ పురోగతిలో ఉంది. అలాగే డివిజన్‌లోని మిగతా మండలాల్లో అవినీతి వ్యవహారాలకు సంబంఽధించి ఆయా  అధికారులపై అప్పీళ్లు స్వీకరిస్తున్నాం. త్వరలో అక్రమార్కులపై చర్యలతో పాటు బాధితులకు న్యాయం చేస్తాం. 

Read more