అలరిస్తున్న నాటిక పోటీలు

ABN , First Publish Date - 2022-05-19T05:00:29+05:30 IST

పర్చూరులోని వైఆర్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు తెలుగు రాష్ర్టాల స్థాయిలో జరుగుతున్న కళావాణి నాటిక పోటీలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. మంగళవారం రాత్రి కళావాణి నాటిక పోటీలను స్థానిక శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు జ్యోతి ప్రజ్వలనచేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

అలరిస్తున్న నాటిక పోటీలు
పాశం నాటికలోని ఓ సన్నివేశం

సందేశాత్మకంగా సాగుతున్న పోటీలు

పర్చూరు, మే 18: పర్చూరులోని వైఆర్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు తెలుగు రాష్ర్టాల స్థాయిలో జరుగుతున్న కళావాణి నాటిక పోటీలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. మంగళవారం రాత్రి కళావాణి నాటిక పోటీలను స్థానిక శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు జ్యోతి ప్రజ్వలనచేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. 

ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పాశం నాటిక 

విదేశీ మోజులో పడి మాతృభూమిని వదిలి తల్లిదండ్రులను పట్టించుకోని నేటి తరం యవతపై సందేశాత్మకంగా ప్రదర్శించిన కళాంజలి హైదరాబాద్‌ వారి పాశం నాటిక ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తుంటే మన యువత మాత్రం బందాలు, అను బంధాలను వదులుకొని విదేశాలకు పరుగులు పెట్టడం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలోచింపజేసింది. తల్లిదండ్రులు మాత్రం పిల్లలపై మమకారాన్ని వదులుకోలేక పోతున్న తీరు కళాకారులు తమ కళాప్రదర్శన ద్వారా చూపారు. ఆఖరి చూపు కూడా నోచుకోని అభాగ్య జీవితాలు ఎన్నో ఉన్నాయని రచయిత గోవిందరాజుల నాగేశ్వరరావు వివరించే ప్రయత్నం చేశాడు. 

జీవన యానం...

వృద్ధాప్యంలో ఆత్మీయుల మధ్య దొరికే ఆనందం వృద్ధులకు ఓల్డేజ్‌ హోమ్‌లలో లభించదన్న కఠోర సత్యాన్ని జన చైతన్య ఒంగోలు వారి జీవన యానం నాటిక ద్వారా చూపారు. వృద్ధాప్యంలో ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో అన్న ఇతివృత్తాన్ని నటీ నటులు చక్కగా ప్రదర్శించారు. ప్రతి మనిషికి వృద్ధాప్యంలో ఓ తోడు కావాలన్నదే ఈ నాటికలో నొక్కి వక్కాణించాడు రచయిత, దర్శకుడు వరికూటి శివప్రసాద్‌, ఎల్‌.శంకర్‌లు. 

మంచంమీద పెళ్ళి ...

పరువు హత్యల విలువలకు దర్పణం పట్టే తల్లిదండ్రులకు కనువిప్పు కావాలని హాస్యాస్పదంగా ప్రదర్శించిన నాటిక మంచంమీద పెళ్ళి.  ఓ పిసినారి విందు, వినోద కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు, తన కుంటుంబం విషయంలో కూడా అదే విధంగా ఉండే వైనాన్ని మద్దుకూరి అర్స్‌ క్రియేషన్‌ చిలకలూరిపేట వారు ఈ నాటిక ద్వారా చూపారు. .నాటిక పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలి రావటంతో కళాప్రాంగణం కిక్కిరిసింది. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కళావాణి అధ్యక్షుడు కొల్లా సుభా్‌షబాబు, చాగంటి నాగేశ్వరరావు, కొల్లా నరేంద్రకుమార్‌, పాబోలు ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  Read more