సాగుకు భరోసా

ABN , First Publish Date - 2022-08-17T05:52:57+05:30 IST

ఈ సీజన్‌ అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు జిల్లాకు చేరాయి. రెండురోజుల క్రితమే జిల్లా సరిహద్దుకు నీరు చేరగా ఎగువ నుంచి ప్రవాహం అధికంగా ఉండటంతో మంగళవారం ఉదయానికే రామతీర్థం రిజర్వాయర్‌లోకి వచ్చాయి.

సాగుకు భరోసా
జిల్లా సరిహద్దు85/3 వద్ద సాగర్‌ కాలువ నిండుగా నీరు ప్రవాహం

జిల్లాకు చేరిన సాగర్‌ జలాలు

ఇప్పటికే రామతీర్థానికి చేరిక

నార్లు పోయడానికి సిద్ధమవుతున్న రైతులు

ఏబీసీలోనూ ప్రవాహం పెంపు

ఒంగోలు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఈ సీజన్‌ అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు జిల్లాకు చేరాయి. రెండురోజుల క్రితమే జిల్లా సరిహద్దుకు నీరు చేరగా ఎగువ నుంచి ప్రవాహం అధికంగా ఉండటంతో మంగళవారం ఉదయానికే రామతీర్థం రిజర్వాయర్‌లోకి వచ్చాయి. తాజా  పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది సాగర్‌ నీటి సరఫరాపై భరోసా కనిపిస్తోంది. సాగర్‌ డ్యాం నుంచి 2022-23 సంవత్సర సాగు, తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు గతనెల 31న నీటిని వదిలారు. మొత్తం కాలువ ఆయకట్టులో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఉన్న 11.16లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు ఈ ప్రాంత తాగునీటి అవసరాలను సాగర్‌ నీటితోనే తీర్చుకోవాల్సి ఉంది. కాగా అధికారికంగా కుడికాలువకు 132 టీఎంసీల కేటాయింపు ఉండగా ఆ మేరకు నీటిని తీసుకునేందుకు కేఆర్‌ఎంబీ అనుమతి ఇవ్వడంతో గతనెల 31న డ్యామ్‌ నుంచి ప్రధాన కాలువకు నీరు వదిలారు. 


భారీగా నీరు విడుదల

అయితే అప్పటికే తాగునీటి కోసం ఒక విడత నీటిని ఇచ్చి ఉండటం, ఆయకట్టులో వరిసాగుకు అంతగా రైతులు ఆసక్తిచూపక నార్లు పోయడంలో జాప్యంతో డ్యామ్‌ నుంచి నీటిని వదిలినా పరిమితంగానే కాలువలకు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే జిల్లాలో పరిస్థితి దృష్ట్యా ఈనెల 15 నుంచి నీటిని ఇవ్వాలని ఉన్నతాధికారులను జిల్లా యంత్రాంగం కోరింది. అయితే కృష్ణా ఎగువ ప్రాంతంలో భారీవర్షాలతో వరద నీరు అధికంగా వచ్చి  శ్రీశైలం, సాగర్‌ డ్యామ్‌లు నిండి గేట్లు ఎత్తడంతో కాలువలకు కూడా భారీగానే నీటిని విడుదల చేశారు. తదనుగునంగా కుడికాలువలోనూ ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలోకి ఈనెల 14 రాత్రికే నీరు రావడమే కాగా ప్రవాహం కూడా అధికంగానే ఉంది. 


నేరుగా రామతీర్థానికి..

సాధారణంగా ఈ  సమయంలో ప్రధాన కాలువ సరిహద్దు 85/3 వద్ద వెయ్యి నుంచి 1,200 క్యూసెక్కులు వస్తుంటుంది. అలాంటిది ప్రస్తుతం ఏకంగా 2.5వేల క్యూసెక్కులు సోమవారానికి ఉండగా మంగళవారం మరింత పెరగడంతో కాలువలో నీటిప్రవాహం వేగం పెరిగి మంగళవారం ఉదయానికే రామతీర్థం రిజర్వాయర్‌కు నీరు చేరడం ప్రారంభమైంది. అందిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం 85/3 వద్ద 2,850 క్యూసెక్కులు నీరు వస్తుండగా దర్శి సమీపంలోని ఓబీసీ హెడ్‌ వద్ద 1,325 క్యూసెక్కులు వస్తోంది. మధ్యలోని పీబీసీ కాలువకు 450 క్యూసెక్కులు ఇస్తున్నారు. ఈక్రమంలో రామతీర్థం రిజర్వాయర్‌కు ఇంచుమించు 800 క్యూసెక్కులు వస్తున్నాయి. ప్రస్తుతం రామతీర్థం నీటిమట్టం 83.85 మీటర్లు ఉండగా 1.33 టీఎంసీల నీరు ఉంది. అందులో డెడ్‌స్టోరేజీ పోను సుమారు 1.07 టీఎంసీలు అందుబాటులో ఉండటంతో దిగువకు వంద క్యూసెక్కులు  ఇస్తున్నారు. 


ముందు తాగు, తర్వాత సాగు

ప్రస్తుతం సాగుకు అంతగా రైతులు నీరు అడిగే అవకాశం లేదు. కాగా నాలుగు రోజుల్లో రామతీర్థం నిండనుండగా దిగువన ఉన్న తాగునీటి చెరువులు నింపి అనంతరం పొలాలకు నీరిచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అదే సమయంలో త్రిపురాంతకం, కురిచేడు, దర్శి, తాళ్లురు, ముండ్లమూరు తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నార్లు పోసేందుకు రైతులు సిద్ధం అవుతుండగా ఆ మేరకు నీరు ఇవ్వనున్నారు. ఇక బాపట్ల జిల్లాలోకి వెళ్లిన ఏబీసీకి కూడా నీటిప్రవాహం ఉంది. ఏబీసీ హెడ్‌ వద్ద పరిమితంగానే 500 క్యూసెక్కులు తొలుత నీరు ఇవ్వగా సంతమాగులూరు మండలం అడవిపాలెం సమీపంలోని 18/0 వద్ద మంగళవారం ఉదయం 300 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. అయితే దిగువ రైతులు నార్లు పోసేందుకు నీటిని ఇవ్వాలని కోరడంతో క్రమంగా ప్రవాహన్ని అధికారులు పెంచుతున్నారు. ఆలా మంగళవారం సాయంత్రం 5గంటలకు 18/0 వద్ద 610క్యూసెక్కుల ప్రవాహం పెరగ్గా 800 వరకు పెంచి నిలకడగా సరఫరా చేసే యోచనలో అధికారులు ఉన్నారు. 



Updated Date - 2022-08-17T05:52:57+05:30 IST