ఎస్టీల భూముల్లోకి చొరబాటు

ABN , First Publish Date - 2022-09-30T05:41:55+05:30 IST

సోమవరప్పాడు పరిధిలోని అటవీ, రెవెన్యూ భూములను నిబంధనలకు విరుద్ధంగా సాగు చేసేందుకు వెళ్లడంతో ఎస్సీ, ఎస్టీల మధ్య వివాదం నెలకొని ఉద్రిక్తత నెలకొంది. గురువారం సోమవరప్పాడు ఎస్సీలు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నదని ఏకలవ్వనగర్‌ సమీపాన గల పొలాల్లో సాగుకు ఉపక్రమించారు.

ఎస్టీల భూముల్లోకి  చొరబాటు
ఇరువర్గాలకు నచ్చచెప్తున్న తహసీల్దార్‌, ఎస్‌ఐ

దౌర్జన్యంగా సాగుకు సిద్ధం

ఇరువర్గాల మధ్య గొడవ

సోమవరప్పాడులో ఉద్రిక్తత

అనుమతి లేకుండా భూముల్లోకి వెళ్లొద్దని తహసీల్దార్‌ ఆదేశం

తాళ్లూరు, సెప్టెంబరు 29: సోమవరప్పాడు పరిధిలోని అటవీ, రెవెన్యూ భూములను నిబంధనలకు విరుద్ధంగా సాగు చేసేందుకు వెళ్లడంతో ఎస్సీ, ఎస్టీల మధ్య వివాదం నెలకొని ఉద్రిక్తత నెలకొంది. గురువారం సోమవరప్పాడు ఎస్సీలు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నదని ఏకలవ్వనగర్‌ సమీపాన గల పొలాల్లో సాగుకు ఉపక్రమించారు. దీంతో గత 32ఏళ్లుగా కొండను నమ్ముకుని ప్రభుత్వపరంగా అటవీ హక్కుల చట్టం మేరకు పట్టాలు పొందిన ఎస్టీలు కొందరు ఎస్సీలను అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మఽధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ఎస్‌.రామ్మోహన్‌రావు, ఎస్‌ఐ నరసింహారావు వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి జీవనాధారం లేని 150మంది ఎస్సీలం ఉన్నామని, ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండటంతోనే తాము సాగుకు సిద్ధమయ్యామని ఎస్సీలు తహసీల్దార్‌కు తెలిపారు. తమకు భూములు పంపిణీ చేసి న్యాయం చేయాలని విన్నవించారు. కొండను నమ్ముకుని వందలాదిమంది ఎస్టీలు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ట్రైబల్‌ రైట్స్‌ ఫోరం రాష్ట్ర చైర్మన్‌ ఇట్టా బాబూరావు అధికారులకు విన్నవించారు. కొందరికి అటవీ హక్కు చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వగా, మరికొందరు అర్హులను గుర్తించి పట్టాల కోసం జాబితాను కూడా ప్రభుత్వానికి పంపించామని గుర్తుచేశారు. ఎస్టీ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ ఎస్సీలు తమకు సాగు భూమి కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఖాళీగా ఉన్న భూములను గుర్తించి పంపిణీ చేస్తామన్నారు. ఇలా అక్రమంగా సాగుకు సిద్ధపడటం సరికాదన్నారు. ఈ విషయంలో సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కల్గించవద్దని ఎస్‌ఐ సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు ఇమ్మానియేల్‌రాజు, ప్రశాంత్‌, వీఆర్‌వో రాఘవరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T05:41:55+05:30 IST