పట్టా ఫట్‌!

ABN , First Publish Date - 2022-04-25T05:05:49+05:30 IST

సింగరాయకొండ మండలంలో నకిలీ పట్టాల తయారీ జోరుగా సాగుతోంది. కొందరు ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం నడుపుతున్నారు. ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లలో రెవెన్యూ అధికారులు పట్టాలు జారీచేసినట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. అందులో సంతకాలు సైతం ఫోర్జరీ చేస్తున్నారు.

పట్టా ఫట్‌!
నకిలీ పట్టాలు సృష్టిస్తున్న సర్వే నెం. 322 భూమి ఇదే

సింగరాయ కొండలో నకి‘లీలలు’

ప్రభుత్వ భూముల సర్వే నెంబర్‌లు వేసి తయారీ

అధికారుల సంతకాలు ఫోర్జరీ

అమాయకులకు అమ్మిలక్షలు 

కొల్లగొడుతున్న ముఠా

దీనికి వెనుక వైసీపీ 

నేతలున్నట్లు ఆరోపణలు

రెవెన్యూ అండదండలపై              

అనుమానాలు

సింగరాయకొండ, ఏప్రిల్‌ 24 : మండలంలో నకిలీ పట్టాల తయారీ జోరుగా సాగుతోంది. కొందరు ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం నడుపుతున్నారు. ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లలో రెవెన్యూ అధికారులు పట్టాలు జారీచేసినట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. అందులో సంతకాలు సైతం ఫోర్జరీ చేస్తున్నారు. వీటిని అమాయకులకు విక్రయించి రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోంది. రెవెన్యూ అధికారులు సైతం సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సింగరాయకొండలో భూముల ధర ఒక్కసారిగా పెరిగింది. ఇది ప్రభుత్వ ఆస్తులకు ఎసరు తెచ్చింది. అక్రమార్కులు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్ల విలువైన భూముల్లో పాగా వేశారు. కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ పట్టాల తయారీ ప్రారంభించారు. కనుమళ్ల గ్రామ సర్వే నెం. 371/6లో 4.96 ఎకరాల భూమిని గతంలో మాజీ సైనికుడి పేరుతో నకిలీ పట్టా సృష్టించారు. అది వివాదాస్పదమైంది. మళ్లీ అదే భూమికి ఒక మహిళ పేరుతో పట్టా తయారు చేశారు. ఆమె ఆన్‌లైన్‌ చేయాలని కలెక్టర్‌ను కలవడం, ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు విచారించడంతో నకిలీ బా గోతం బయటపడింది. దీనిపై తహసీల్దార్‌ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదేసమయంలో కనుమళ్ల గ్రామ సర్వే నెం.332లో అక్రమార్కులు నకిలీ పట్టాలు సృష్టించి అమాయకులకు అంటగట్టి రూ.లక్షల పిండేస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సర్వే నెం.322లో జరుగుతున్న నకిలీ పట్టాల దందాపై సింగరాయకొండ పంచాయతీ వార్డు సభ్యుడు దావులూరి ఆదాం కలెక్టర్‌ దినే్‌షకుమార్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేయాలని ఆర్డీవోను కలెక్టర్‌ ఆదేశించారు.


మండలంలో ఇబ్బడిముబ్బడిగా నకిలీ పట్టాలు

మండలంలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఇబ్బముబ్బడిగా నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. పాతసింగరాయకొండ, కనుమళ్ల, సింగరాయకొండ, శానంపూడిల్లోని ఈనాం, డీకే, అసైన్డుభూముల్లో రెవెన్యూ అధికారుల సహకారంతో ఓ ముఠా ఈ దందా నడుపుతోంది. వీరి వెనుక వైసీపీ నేతలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యథేచ్చగా నకిలీ పట్టాలు సృష్టిస్తున్నా రెవెన్యూ అధికారులు మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


ఒక్కో పట్టా రూ.3లక్షలకు విక్రయం

కనుమళ్ల సర్వే నెం.322లో 3.75 ఎకరాల భూమిని  ప్రభుత్వం  71 మందికి ఒక్కొక్కరికి 2.5సెంట్ల చొప్పున నివేశన స్థలాలు మంజూరు చే సింది. 2020 ఫిబ్రవరిలో 46మందికి, డిసెంబర్‌ 20న 25మందికి అధికారులు పట్టాలు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు వీటిని పంపిణీ చేశారు. పట్టాలు పొందిన వారిలో కొందరు బినామీలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేసమయంలో అక్రమార్కులు ఆ పట్టాలు మంజూరైన వారి పేర్లతోకాకుండా ఇతరుల పేర్లతో నకిలీవి సృష్టించారు. ఒక్కో పట్టా రూ.3లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో గతంలో నివేశన స్థలాల కోసం కోర్టును ఆశ్రయించిన వారి వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి రెవెన్యూ అధికారులను లోబర్చుకొని విషయం బయటకు రాకుండా వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. 

Read more