నిండా ముంచిన వాన

ABN , First Publish Date - 2022-12-13T01:52:11+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడున్నర రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం స్తంభించింది. పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి.

నిండా ముంచిన వాన

తీవ్రంగా దెబ్బతిన్న పంటపొలాలు

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 12 : మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడున్నర రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం స్తంభించింది. పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో పలురకాల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు సబ్‌డివిజన్‌ ప్రాంతంలో తుఫాన్‌ కారణంగా అరటి, చెరకు, శనగ, ధనియాలు, పొగాకు లాంటి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. నాలుగు రోజులుగా ఏకదాటి వర్షానికి పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. ఇప్పటికే అప్పులు చేసి సాగు చే సిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కౌలు రైతులు వేలకు వేలు కౌలు చెల్లించి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతింటుండడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేఎస్‌.పల్లె పరిధిలోని అక్కలరెడ్డిపల్లె గ్రామంలో తుఫాన్‌ కారణంగా రైతులు సాగు చేసిన చెరకు పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అప్పు చేసి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో నీటమునగడంతో రైతు బిల్లా వెంకటేశ్వర్లు లబోదిబోమంటున్నాడు. ఆదిమూర్తిపల్లె పరిధిలో సుమారు 16 ఎకరాల అరటితోట పూర్తిగా దెబ్బతిన్నదని, 20లక్షల పంటనష్టం సంభవించినట్లు రైతు దూదేకుల హుస్సేన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సగిలేరువాగు పొంగుతోందా...? అనే ఆందోళన రైతులను వేధిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో గతంలో భారీవర్షాల కారణంగా 2013, 2017 సంవత్సరాలలో సగిలేరువాగు ఉప్పొంగి శ్రీనివాస థియేటర్‌, ఖాదర్‌వలిస్వామి దర్గా ప్రాంతాలలో నీటమునిగి లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. అయితే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ సగిలేరు వాగు ఉప్పొంగుతుందా..? అన్న ఆందోళన నెలకొంది.

మార్కాపురం(వన్‌టౌన్‌) : తుఫాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవా లని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాం డ్‌ చేశారు. మండలంలోని బోడపాడులో కళ్లాల్లో తడిచిన మిర్చిని ఆయన సోమవారం పరిశీలించారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన రైతులు వర్షంతో పంట నష్టపోయారన్నారు. గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని నారాయణరెడ్డి అన్నా రు. నష్టపోయిన మినుము, బొబ్బర్లు, మిర్చి, పొగాకు, కంది, పత్తి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

త్రిపురాంతకం : మండలంలోని పలు గ్రామాల్లో మాండస్‌ తుఫాను ప్రభావంతో తడిచిన పంటలను మార్కాపురం సబ్‌కలెక్టర్‌ సేతుమాధవన్‌ వ్యవసాయాధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. గొల్లపల్లి, వెల్లంపల్లి పొలాల్లో ధాన్యం కల్లాల్లోకి వెళ్లి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. నష్టతీవ్రతపై రైతులతో, వ్యవసాయ సిబ్బందితో మాట్లాడారు. నష్టంపై పూర్తి స్థాయిలో నివేధిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని తహసీల్దార్‌ కిరణ్‌, ఏవో నిరజ, ఉద్యానవనశాఖ అధికారులను ఆదేశించారు. మరోవైపు వైపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు తన బృందంతో కలిసి గొల్లపల్లిలో రైతుల పొలాలను పరిశీలించారు. సొంతగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ పొలాలకు వెళ్లిన ఎరిక్షన్‌బాబు నీటిపై తేలుతున్న వరి ఓదెలను చూసి అవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి, పంటనష్టాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టం ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు రైతులవైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు పంటనష్టం అంచనా వేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఎం.వలరాజు, నాయకులు ఆళ్ల.నాసరరెడ్డి, వీ.ఆంజనేయులు, దేవినేని చలమయ్య, ఎం.అల్లూరిరెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, కే.కొండలు, జి.వెంకటనారాయణ, గాంధీ, తిరుపతయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.

త్రిపురాంతకం : మాండస్‌ తుఫాను ప్ర భావంతో మండలంలోని పలు పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 13 గ్రామాల్లో వర్ష ప్రభావంతో వరి, మొక్కజొన్న, మినుము పంటలు నష్టపోగా పలుచోట్ల మిరప పొలాల్లో నీళ్లు నిలిచాయి. గొల్లపల్లి, వెల్లంపల్లి, విశ్వనాథపురం, పాత అన్నసముద్రం గ్రామాల్లో వరి కోతదశలో ఉంది. రైతులు ఇప్పటికే చాలా వరకు కోతకోసి పొలాల్లోనే ఓదెలను ఉంచారు. దీంతో అకాల వర్షం ముంచెత్తడంతో ఓదెలన్నీ నీటిపై తేలడం చూసిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం వరి 1500 ఎకరాల్లో, మొక్కజొన్న 225 ఎకరాల్లో, మినుము 135 ఎకరాల్లో, మిర్చి 250 ఎకరాల్లో నష్టం వచ్చినట్లు తెలిపారు.

కొమరోలు : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో సుమారు 1730 హెక్టార్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవ సాయాధికారి రాజేశ్వరి తెలిపారు. పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను గిద్దలూరు ఏడీఏ బాలునాయక్‌, ఏవో రాజేశ్వరీలు పరిశీలించారు. రైతులకు పలు సూ చనలు చేశారు. మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు శనగ 3,750 ఎకరాలు, వరి 275 ఎకరాలు, మిరప 300 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

ఎర్రగొండపాలెం : మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో మిరపతోటల్లో నీళ్లు నిలిచాయి. దీంతో మండల ఉద్యానవన అధికారి ఆదిరెడ్డి, వ్యవసాయాధికారి పి వెంకటేశ్వర్లు మిరపతోటలను పరిశీలించారు. మిరప తోటల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నీటిని తొలగించిన తర్వాత ఎకరా మిరపతోటకు 50 కిలోల యూరియా 25 కిలోల మ్యూరేట్‌ పోటాష్‌ వేసుకోవాలన్నారు. మిరపలో కాండం, కొమ్మకుళ్లు తెగుళ్లు గమనిస్తే కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌, స్ట్రెప్టోసైక్లిన్‌ 3 గ్రాములు పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ, ఉద్యాన ఉద్యోగులు పాల్గొన్నారు.

పుల్లలచెరువు : మండలంలో వర్షం ప్రభావంతో మిరప, పత్తి, మొక్కజోన్న, కంది, పొగాకు, వరి పంటలు దెబ్బతిన్నాయి. మిరపలో కొమ్మతెగులుతో పాటు పూత, పిందె రాలిపోయి వర్షానికి కొమ్మలు కుళ్లి పోయాయి. కోత దశలో వున్న తోటల్లో కాయలు బూజు పట్టడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కంది పైరు నేలకు ఒరిగిపోయింది. పొగాకు ఎర్ర ఆకులు వచ్చి కుళ్లు ముఖం పట్టాయి. పందిళ్లలో ఆరబెట్టిన పొగాకు వానకు తడిసి రంగు మారింది. సాగులో వున్న పత్తి కోత దశలో ఉండడంతో మూడు రోజుల నుంచి తీయకుండా వదిలేసిన పత్తి కాయలు బూజుపట్టాయి. మానేపల్లి, ఐటివరం గ్రామాల్లో వరి కోత దశలో ఉంది. ఈ వర్షాలకు గింజలు బూజు పట్టనున్నాయి. జిల్లా ఉన్నాతాధికారులు స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

రాచర్ల : మాండస్‌ తుఫాన్‌ ప్రభావం ధాటికి మండలంలోని దాదాపు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలకు పొలాల్లో వర్షం నీరు నిలబడిపోయింది. దీనితో మినుము, శనగ, పత్తి, మిర్చి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా మినుము శనగ పంటల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేవని రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో చెరోలపల్లి, యడవల్లి, సత్యవోలు గ్రామాలలో మండల వ్యవసాయ శాఖాధికారి షేక్‌ అబ్దుల్‌రఫిక్‌ పర్యటించారు. శనగ పంటలో నీరు నిలబడి ఉందని తెలిపారు. పప్పుశనగ 1930 ఎకరాల్లో, పొగాకు 450, మినుము 315, వరి 71, నువ్వులు 80 మొత్తం 3245 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందన్నారు. పంట నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందచేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ విస్తరణాధికారి బి.సంపత్‌కుమార్‌, ఐ.రమేష్‌, కె.నందిని, తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేట : మాండుస్‌ తుఫాన్‌ దెబ్బకు బేస్తవారపేట మండలంలోని పలుగ్రామాల్లో రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది.మండలంలోని పూసలపాడు,సలకలవీడు,నేకునాంబాద్‌, కోనపల్లె, గలిజేరుగుళ్ళ,శింగరపల్లె,జె.సి అగ్రహారం,పిటికాయగుళ్ళ గ్రామాల్లో సాగు చేసిన పత్తి,కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.పత్తి పంట పూత,కాయదశలో ఉండటంతో భారీ వర్షాల కారణంగా పూత రాలిపోయి.కాయ కుల్లి పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని రైతులు కోరుతున్నారు.

పొదిలి రూరల్‌ : మాండస్‌ తుఫాను దాటికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం కంది, బొబ్బర, మినుము, వరి పంటలు కొంత మేరకు దెబ్బతిన్నట్లు ఏవో జైన్‌లుద్దీన్‌ తెలిపారు. తుఫాను కొనసాగితే ముదురు పంటలు కాయలు మొలకలెత్తి, మొదళ్ళు కుళ్ళిపోయో ప్రమాదం ఉందన్నారు. తడిసిన వరి ఓదెలను గట్టుపై ఆరబెట్టి ఉప్పు ద్రావణం చల్లితే మొలకెత్తకుండా ఉంటుంద ని రైతులకు సూచించారు. ముదురుగా వేసిన బొబ్బర్లు పంటలకు ప్రాధమిక నష్టం క్రింది ప్రభత్వానికి నివేధిక పంపించామన్నారు. మిర్చిలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కొనకనమిట్ల : మండలంలో గత మూడు రోజులుగా మాండస్‌ తుఫాన్‌తో కురుస్తున్న వర్షాలకు రైతులు కుదేలయ్యారు. కంది, మినుము, బొబ్బర్లు, శనగ పంటలు దెబ్బతిన్నాయి. ముదురుగా వేసిన బొబ్బర, మినుము కాయదశలో ఉండటంతో ఈవర్షానికి మొలకెత్తాయని రైతులు ఆందోళన చెందు తున్నారు. మిర్చి, కంది పైర్లు పూత దశలో ఉండటంతో పూతరాలి పోతుందని రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఇంకా వర్షం కొనసాగితే అన్ని పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయఽ అదికారులు తెలిపారు. గొట్లగటు,్ట గ్రామాన్ని వ్యవసాయాధికారి రంగలక్ష్మీ సందర్శించి నీట మునిగిన మినుము పంటను పరిశీలించారు. బచ్చలకురపాడు, నాగంపల్లి, చినారికట్ల, గ్రామంలో బొబ్బర్లు పంట నీట మున గడంతో పంటమీదనే మొలకలు వచ్చాయి. దీంతో ఇకనైనా వర్షం ఆగక పోతే మిగిలిన పంటలను కాపాడుకోలేమని రైతులు ఆవేద న చెందుతున్నారు. అదేవిదంగా పెదారికట్ల గ్రామంలో శనగ పైరు నీటి మునిగిందని వర్షం తగ్గక పోతే పంట ప్తూగా దెబ్బతిని పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. అదేవిదంగా వింజవర్తిపాడు గ్రామాన్ని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సందర్శిం చారు. తుఫాన్‌తో దెబ్బతిన్న మినుము పైరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు సమగ్రంగా అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

తర్లుపాడు : మండలంలో ఖరీఫ్‌, రబీలో సాగు చేసిన పంటలన్నీ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్నాయి. మండలంలో ఎక్కువగా 2250 ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశారు. ప్రస్తుతం కోత, కాయదశలో పంట ఉంది. ప్రస్తుత వర్షాలకు పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో కాయలన్ని కుళ్లిపోతుండగా కోసిన కాయలు కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారు. కంది పంట కూడా పూత, పిందె రాలిపోవడంతో భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పొగ తోటల్లో కూడా నీరు నిల్వ ఉండటంతో తోటలన్ని దెబ్బతింటున్నాయి. దీంతో పొగాకు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మినుము, జూటు పంటలు పూత, పిందె దశలో ఉన్నాయి. ఆ పంటలు కూడా దెబ్బతింటు న్నాయి. 2500 ఎకరాల్లో సాగు చేసిన శనగ కూడా వర్షాలకు దెబ్బతింది. మూడు రోజుల నుంచి కలుజువ్వలపాడు పంచాయతీలోని కొండారెడ్డిపల్లె ఫీడర్‌కు 3 ఫేజ్‌ విద్యుత్‌ సప్లయ్‌ నిలిచిపోంది. దీంతో కొండారెడ్డిపల్లి, లక్ష్మక్కపల్లి, గండ్లోపల్లి ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. విద్యుత్‌ మోటర్లకు ఆడక పోవడంతో 5కి.మి. దూరంలో ఉన్న ఓబాయపల్లెకు వెళ్లి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెదదోర్నాల : తుఫాన్‌ ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిరపతోటల్లో వర్షపు నీరు చేరింది. దీంతో రైతులు ఆందోళనకు గుర వుతున్నారు. ఇప్పటికే పంటకు వచ్చిన మిరపతోటలతో నష్టపోతామని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా వర్షం కురిస్తే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : అధిక వర్షాలతో రైతులు తమ పొలాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి డి.శ్రీనివాసులు సూచించారు. మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని యాచవరం, రాయవరం, గజ్జలకొండ గ్రామాల్లో వేసిన మినుము, కంది, బొబ్బర్ల పంటలను సోమవారం పరిశీలించారు. వివిధ పంటలపై వచ్చే తెగుళ్ల నివారణ, పొలంలో నిలబటి నీటి నివారణ చర్యలు సూచించారు.

Updated Date - 2022-12-13T01:52:15+05:30 IST