కలగా రైల్వే వంతెన నిర్మాణం

ABN , First Publish Date - 2022-09-25T06:53:50+05:30 IST

గిద్దలూరు పట్టణంలోని రాచర్లగేటు సెంటర్‌లో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం కలగానే మారింది. పాలకుల హామీలు గాలిలో కలిసిపోతున్నాయి.

కలగా రైల్వే వంతెన నిర్మాణం
రాచర్ల గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్‌

రైల్వేగేట్ల వద్ద తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్‌

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

కనీసం అండర్‌పాసైన నిర్మాంచాలని వినతి

గిద్దలూరు, సెప్టెంబరు 24 : గిద్దలూరు పట్టణంలోని రాచర్లగేటు సెంటర్‌లో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం కలగానే మారింది. పాలకుల హామీలు గాలిలో కలిసిపోతున్నాయి. ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. దాంతో రైల్వేగేట్ల వద్ద తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. గిద్దలూరు పట్టణంలోని రాచర్లగేటు, పాములపల్లి గేటు ప్రాంతాలలో రెండు చోట్ల రైల్వేగేట్లు ఉన్నాయి. ఈ రెండు గేట్లకు అవతలి వైపున వేలాది నివాస గృహాలు, విద్యాసంస్థలు, బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార దుకాణాలు ఉన్నాయి. నిత్యం ఈ గేటు మీదుగా వేలాది మంది ప్రజలు తిరుగుతుంటారు. ఈ క్రమంలో ప్రతి అరగంటకు ఒక పర్యాయం రైలు, గూడ్స్‌ వస్తుండడంతో కనీసం 10 నిమిషాలపాటైన గేటు పడుతోంది. దాంతో గేటుకు ఇరువైపులా వందలాది మోటార్‌ సైకిళ్లు, ఇతర వాహనాలు, పాదాచారులు ఆగిపోతున్నారు. గేటు ఎత్తిన తరువాత ఎదురెదురుగా ఉన్న వాహనాలను తప్పించుకుని ముందుకు వెళ్లాలంటే మరో 10 నిమిషాలు పడుతోంది. దీంతో దాదాపు ప్రతి అరగంటకు కనీసం 20 నిమిషాలపాటైన రైల్వేగేట్ల వద్ద ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. గేటుపడిన సందర్భాలలో పక్కనే ఉన్న అనంతపురం-గుంటూరు నేషనల్‌ హైవేపై కూడా వాహనాలు ఆగిపోయి హైవేపై కూడా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఈ రెండు రైల్వేగేట్లు అతి దగ్గరలో ఉండగా ఈ రెండు రైల్వేగేట్లను కలుపుతూ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని నిర్మిస్తే శాశ్వితంగా ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుంది. హైవే రోడ్డుకు, రైల్వేగేటుకు మధ్య దూరం కూడా తక్కువగా ఉంది. కనీసం అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించవచ్చు. పాలకులు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి లేదా అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుని రెండు రైల్వేగేట్ల వద్ద శాశ్వతంగా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించి వేలాది మందికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read more