సాంకేతిక తప్పిదాలను ఉద్యోగులపై నెట్టొద్దు

ABN , First Publish Date - 2022-09-12T05:29:03+05:30 IST

రెవెన్యూ ఉద్యోగులకు ఎలాంటి శిక్షణలు లేకుండా ప్రజలకు అందిస్తున్న సేవల్లో సాంకేతికంగా జరుగుతున్న తప్పిదాలను వారిపై నెట్టి అవినీతిపరులుగా చిత్రీకరించే విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎ్‌సఏ) రాష్ట్ర అద్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

సాంకేతిక తప్పిదాలను ఉద్యోగులపై నెట్టొద్దు
మాట్లాడుతున్నబొప్పరాజు, డీఆర్వో చిన్నఓబులేషు, ఆంజనేయప్రసాద్‌

రెవెన్యూశాఖలో ప్రత్యేక ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేయాలి

రీసర్వే చేసే వారిపై ఒత్తిడి పెంచే చర్యలను ఉపహరించుకోవాలి

ఏపీఆర్‌ఎ్‌సఎ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 11 : రెవెన్యూ ఉద్యోగులకు ఎలాంటి శిక్షణలు లేకుండా ప్రజలకు అందిస్తున్న సేవల్లో సాంకేతికంగా జరుగుతున్న తప్పిదాలను వారిపై నెట్టి అవినీతిపరులుగా చిత్రీకరించే విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎ్‌సఏ) రాష్ట్ర అద్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు అత్యధిక రెవెన్యూ సేవలను ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నదన్నారు. వెబ్‌ల్యాండ్‌, మ్యుటేషన్‌ తదితరాలకు సంబంధించిన సమస్యల పరిష్కార విషయంలో సిబ్బందికి పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం లేనందున అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. ఎలాంటి శిక్షణలు లేకపోయినా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టే చర్యలు సరికాదని హితవు పలికారు. చేయని తప్పులకు కూడా క్షేత్రస్థాయి సిబ్బందిని బాధ్యులను చేయడం వలన రెవెన్యూశాఖపై ప్రజల్లో దురభిప్రాయం కలుగుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీసర్వే ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమన్న ఆయన అందుకోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచడం తగదన్నారు.  విలేకరుల సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘ నాయకుడు, డీఆర్వో చిన్నఓబులేషు, వీఆర్వోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయప్రసాద్‌, వీఆర్‌ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జయరాజు, రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీఎస్‌ కృష్ణమోహన్‌తోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు రెవెన్యూ భవన్‌ నుంచి రామనగర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

Read more