వైసీపీ ప్రజాప్రతినిధులకే విలువివ్వరా..?

ABN , First Publish Date - 2022-11-24T22:47:24+05:30 IST

అధికారపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులమైనా అధికారులు తమకు కనీస విలువను ఇవ్వడంలేదని పలుగ్రామాలకు చెందిన వైసీపీకి చెం దిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కోఆప్సన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రజాప్రతినిధులకే విలువివ్వరా..?
తమకు విలువ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ బాలకోటయ్య

సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఆగ్రహం

తాళ్లూరు, నవంబరు 24 : అధికారపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులమైనా అధికారులు తమకు కనీస విలువను ఇవ్వడంలేదని పలుగ్రామాలకు చెందిన వైసీపీకి చెం దిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కోఆప్సన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ డీ వో సమావేశం హాలులో ఎంపీడీవో కేవై కీర్తి అధ్యక్షతన గురువారం మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. తహసీల్దార్‌ కార్యాలయానికి తాము ఏ పనిమీద వెళ్లినా సమస్య వినేందుకు కూడా సమయం ఇవ్వడంలేదని బొద్దికూరపాడు ఎంపీటీసీ సభ్యుడు బాలకోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లూరు కేజీబీవీలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకార్యక్రమాలకు తమను ఆహ్వానించ లేదని తాళ్లూరు ఎంపీటీసీ ప్రభుదాస్‌ ఆరోపించారు. రామభద్రాపురంలో విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయని మూడు నెలల క్రితం ఏఈకి చెప్పినా పట్టించుకోలేదని సర్పంచ్‌ బాసినెడ్డి వెంకటలక్ష్మి తెలిపారు. నాడు-నేడు కింద రజానగరం పాఠశాలలో ఏఈ పనితీరు వల్ల ఆలస్య మవుతున్నదని, త్వరితగతిన పూర్తి చేయించాలని ప్రజాప్రతినిథిగా అడిగితే బిల్డింగ్‌ పనులను ఉన్నతాధికారులో మాట్లాడి రద్దు చేయిస్తానని బెదిరిస్తున్నారని మల్కాపు రం సర్పంచ్‌ షేక్‌ కాలేషావలి సభ దృష్టికి తీసుకవచ్చారు. రెవెన్యూ సమస్యలపై కోర్టు ఉత్తర్వులున్నా మూడు నెలల నుంచి తహసీల్దార్‌ పరిష్కరించకుండా ఇబ్బంది పెడుతున్నారని, వీఆర్వో తహసీల్దార్‌ను డైరెక్ట్‌ చేస్తూ పని చేయడం లేదని మండల కోఆప్సన్‌ సభ్యులు షేక్‌ కరిముల్లా తెలిపారు. రమణాలవారిపాలెం గతంలో నిర్మించిన గృహాలపై ఫిర్యాదు చేశామని, ఆ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తే అధికారులకు ఇబ్బం దులు తప్పవని గృహ నిర్మాణశాఖ ఏఈకి కోఆప్సన్‌ సభ్యులు సూచించారు. ఎంపీ డీవో కీర్తి మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజా ప్రతినిధుల పట్ల గౌరవభావంగా వుంటారని, ఇకపై అలాంటి సమస్య రాదని తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీలను కలుపుకుని అధికారులు పని చేస్తేనే అభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, వైస్‌ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంకారెడ్డి, తహసీల్దార్‌ ఎస్‌.రామ్మోహన్‌రావు, సీడీపీవో భారతి, పంచాయతీ రాజ్‌డీఈ విఠల్‌రాథోడ్‌, వైద్యాధికారులు ఖాదర్‌మస్తాన్‌భీ, బి,రత్నం, శిరీష, పశువైద్యాధికారులు ప్రతాప్‌రెడ్డి, రాంబాబు, ఏపీవో మురళి, ఏపీఎం దేవరాజ్‌, ఈవోఆర్‌డీ ప్రసన్నకుమార్‌, వ్యవసాయాధికారి బి.ప్రసాద్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ ఏఈలు శ్రీనివాసరావు, వీరబ్రహ్మం, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:47:24+05:30 IST

Read more