దంపతుల మధ్య వివాదం.. భార్య ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-12T05:07:18+05:30 IST

దంపతుల మధ్య నెలకొన్న వివాదంలో భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, భర్త పురుగుల మందుతాగగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

దంపతుల మధ్య వివాదం.. భార్య ఆత్మహత్య
మృతిచెందిన వెంకటపద్మ

 భర్త పరిస్థితి విషమం

సంతమాగులూరు, సెప్టెంబరు 11: దంపతుల మధ్య నెలకొన్న వివాదంలో భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, భర్త పురుగుల మందుతాగగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని కామేపల్లిలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన కోమటిగుంట గోపీకృష్ణ ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య వెంకటపద్మ(23), గోపీకృష్ణకు కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం ఇరువురి మధ్య మరోసారి గొడవ జరిగింది. చుట్టుపక్కల వారు సర్దిచెప్పటంతో ఆటోతో బయటకు వెళ్లాడు. భర్త వేధింపులతో తీవ్ర మనోవేదకు గురైన వెంకటపద్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. కొంత సమయం తరువాత ఆటోతో తిరిగివచ్చిన గోపీకృష్ణకు భార్య ఉరి వేసుకొని ఉండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న సమీప బంధువులు గోపీకృష్ణను 108 వాహనంలో నరసరావుపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటపద్మ పుట్టిల్లు పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామం. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువుల రాకతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి.  ఎస్‌ఐ నాగ శివారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంకట పద్మ తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read more