ధరల పెరుగుదలకు నిరసనగా 30న ధర్నా

ABN , First Publish Date - 2022-05-24T05:41:55+05:30 IST

భారీగా పెంచిన అన్ని రకాల వస్తువుల ధరలు, ప్రజలు మోయలేని భారాలను నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ధరల పెరుగుదలకు నిరసనగా 30న ధర్నా
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

జిల్లా కార్యదర్శిగా హనీఫ్‌ ఎన్నిక


ఒంగోలు(కలెక్టరేట్‌), మే 23 : భారీగా పెంచిన అన్ని రకాల వస్తువుల ధరలు, ప్రజలు మోయలేని భారాలను నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక కాపు కల్యాణ మండపంలో సోమవారం జరిగిన సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌కే మాబు అధ్యక్షత వహించారు. సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్లకు లాభాలు చేకూర్చుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపడం అన్యాయంగా ఉందని ధ్వజమెత్తారు. ఈ భారాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం అన్యాయంగా ఉందన్నారు. సీపీఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శులు పూనాటి ఆంజనేయులు, ఎస్‌డీ హనీ్‌ఫలు మాట్లాడుతూ జిల్లా ప్రజానీకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి రూ.10వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్లీనరీ సమావేశంలో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలను చేశారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు రోడ్డు, రైల్వే మార్గాలను నిర్మించాలని, పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, విద్య, వైద్యం మెరుగుపర్చడంతో పాటు అర్హులైన పేదలందరికీ మూడు ఎకరాల భూమితో పాటు ఇళ్లు కేటాయించాలని తీర్మానించారు. 


నూతన కమిటీ ఎన్నిక

జిల్లాల విభజన అనంతరం ప్రకాశం జిల్లా సీపీఎం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎస్‌డీ హనీఫ్‌, కార్యదర్శివర్గ సభ్యులుగా పూనాటి ఆంజనేయులు, ఎస్‌కే మాబు, జీవీ కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, ఎస్‌డీ హనీఫ్‌, ఎం రమేష్‌, డీ సోమయ్య, వీ ఆంజనేయులు, ఊసా వెంకటేశ్వర్లులను ఎన్నుకున్నారు. అలాగే జిల్లా కమిటీ సభ్యులుగా కార్యదర్శివర్గ సభ్యులతోపాటు కాలం సుబ్బారావు, బీ రఘురాం, జీ రమేష్‌, బంకా సుబ్బారావు, పూసపాటి వెంకట్రావు, జీ శ్రీనివాసులు, బాలకోటయ్య, జే జయంతిబాబు, శ్రీనివాసరావు, పీ కల్పన, కే రమాదేవి, కేజీ మస్తాన్‌, తాండవ రంగారావు, తిప్పారెడ్డి, కేశవరావు, రాజ్యలక్ష్మీ, మాల్యాద్రి, అవులయ్య, రఫి, గుమ్మా బాలనాగయ్య, తోట తిరుపతిరావు, రతన్‌లను ఎన్నికయ్యారు.

Updated Date - 2022-05-24T05:41:55+05:30 IST