ఆశాల నిర్బంధం

ABN , First Publish Date - 2022-02-23T06:39:43+05:30 IST

చలో కలెక్టరేట్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ఆశా కార్యకర్తలపై నిర్బంధం విధించారు.

ఆశాల నిర్బంధం
ఒంగోలు ప్రకాశం భవన్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆశాలు, చంటి బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకొని నినాదాలు చేస్తున్న హెబ్సిబా

చలో కలెక్టరేట్‌కు అడుగడుగునా అడ్డంకులు

ముందస్తు నోటీసులు, కనిపిస్తే అరెస్టులు

అయినా భారీగా తరలివచ్చిన ఆశావర్కర్లు

పోలీసులను అధిగమించి ధర్నాకు రాక

ఒంగోలు(కలెక్టరేట్‌)/ఒంగోలు(క్రైం), ఫిబ్రవరి 22 : చలో కలెక్టరేట్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ఆశా కార్యకర్తలపై నిర్బంధం విధించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ ముందస్తు గృహ నిర్బంధాలు, నోటీసులు ఇవ్వడంతోపాటు అరెస్టులు చేశారు. అయినా వాటన్నింటినీ అధిగమించి జిల్లా నలుమూలల నుంచి ఆశా కార్యకర్తలు ఒంగోలుకు వందలాది మంది తరలివచ్చి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. ఆ మేరకు  కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నాకు శ్రీకారం చుట్టారు. అయితే పోలీసులు ఈ ధర్నాను  శతవిధాలా అడ్డుకున్నారు. జిల్లాలో ఉన్న యూనియన్‌ ప్రధాన నాయకులతోపాటు సీఐటీయూ నేతలను కూడా అరెస్టు చేశారు. అయినా కార్యకర్తలు ఏదో ఒకవిధంగా జిల్లా సీఐటీయూ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి వారిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాలు ఎక్కించారు. పలువురిని అరెస్టు కూడా చేశారు. ఇంకోవైపు కలెక్టరేట్‌ వద్ద డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి కలెక్టరేట్‌కు వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించే యత్నాలు చేశారు. వాటన్నింటినీ ఖాతరు చేయని ఆశా కార్యకర్తలు చలో కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు.


నాలుగు నెలల  బిడ్డతో ధర్నాకు..

వేటపాలెం ప్రాజెక్టులో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న  హెబ్సిబా తన నాలుగు నెలల బిడ్డను తీసుకొని ధర్నాలో ముందుభాగంలో కూర్చున్నారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఒకవైపు తాను, తన పాపకు ఎండ తగులుతున్నా లెక్క చేయకుండా ధర్నాలో పాల్గొన్నారు. 


అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ధనలక్ష్మి హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఆశా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ధర్నా వద్దకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రత్నావళి వచ్చి నాయకులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ మజుందార్‌, చీకటి శ్రీనివాసరావు, జీవీ.కొండారెడ్డి, కాలం సుబ్బారావు, మహేష్‌, అనూష, బాలమ్మ, పుల్లమ్మ పాల్గొన్నారు. 


సీఐటీయూ ఆఫీసులోకి చొరబడి..

సోమవారం అంగన్‌వాడీల ఆగ్రహజ్వాలను చూసిన పోలీసులు ముందుగా జిల్లాలో ఉన్న మహిళా పోలీసులతో పాటుగా స్పెషల్‌ పార్టీ పోలీసులను అధిక మొత్తంలో రంగంలోకి దించారు. ఆశావర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ నాయకులు 15 మందిని ముందస్తుగా అరెస్టు చేయడంతో పాటు అనేక మందిని నిర్బంధించారు. 150మందికి ముందస్తు నోటీసులు అందజేసి ధర్నాకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఇళ్లకు కూడా నోటీసులు అంటించారు. మంగళవారం ఒంగోలు సీఐటీయూ కార్యాలయంలోకి పోలీసులు చొరబడి నాయకులు మజుందార్‌,  శ్రీనివాసరావులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. నగరంలోకి వచ్చే మార్గాల్లో సైతం చెక్‌పోస్టులు పెట్టి ఆశావర్కర్లు ధర్నాకు రాకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఆశావర్కర్లు సాధారణ దుస్తులు ధరించి  వందలసంఖ్యలో ఒంగోలుకు చేరుకోవడంతో పోలీసులు ఏం చేయలేకపోయారు. పెరుగుతున్న ఆందోళనను చూసి పోలీసులు ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగింది. ఇంకా సీఐలు సుభాషిణి, రాఘవరావు, ఎస్సైలు రాజారావు, ఫాతిమాలు విధులను నిర్వర్తించారు.



Updated Date - 2022-02-23T06:39:43+05:30 IST