వసతుల లేమిలో డిగ్రీ కళాశాల

ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST

పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు ప్రభుత్వం దోర్నాలకు డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది.

వసతుల లేమిలో డిగ్రీ కళాశాల
దోర్నాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నేటి నుంచి విద్యార్థులకు వెబ్‌ ఆప్షన్లు

26 నుంచి తరగతుల నిర్వహణ 

పెద్దదోర్నాల, సెప్టెంబరు 13: పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు ప్రభుత్వం దోర్నాలకు డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. అయితే అందుకు తగిన వసతులు కల్పించలేదు. టీచింగ్‌, నాన్‌టీచింగ్‌  సిబ్బందిని నియమించలేదు.

ప్రస్తుతం డిగ్రీలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో విద్యార్థులకు వెబ్‌ ఆప్షన్లు ఈ నెల 14వ తేదీ నుంచి ఉన్నాయి. 26వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్‌ టీఎస్‌ రాజేంద్రకుమార్‌ తెలిపారు. మొత్తంగా తరగతులు షురూ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, సిబ్బంది నియామకం పూర్తికాలేదు. ప్రధానంగా అధ్యాపక సిబ్బంది 25 మందిని నియమించాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శ కాలు రాలేదు. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఒక్కరూ కూడా లేకపోవడం గమనార్హం. నియామకం గురించి వారంరోజుల్లో జీవో రావచ్చని ప్రిన్సిపల్‌ ఆశాభావం వ్యక్తం చేస్త్తున్నారు. మరో వైపు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఆరుగురి నియామకం కోసం పెద్దసంఖ్యలో ధరఖాస్తులు ప్రిన్సిపాల్‌కు అందజేశారు. వైసీపీ మండల నాయకుల వద్ద ఆశావహులుపైరవీలు ముమ్మరం చేశారు. విద్యా కమిషనర్‌ ఆదేశాల మేరకు జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మహాలక్ష్మమ్మ కళాశాలలోని 6 గదులు డిగ్రీ కళాశాలకు కేటాయించారు. అవి సరిపోకపోతే శిధిలావస్థలో ఉన్న గదులకు మరమ్మత్తులు నిర్వహించాల్సి ఉంది. ఎంఈవో మస్తాన్‌నాయక్‌ చొరవతో ప్రిన్సిపాల్‌ గదిలో కొద్దిపాటి ఏర్పాట్లు చేశారు. నాడు-నేడులో భాగంగా నూతనంగా బోరుబావి తవ్వించారు. ప్రస్తుతం ఈ ఏడాది బీఎస్సీ(మ్యాఽధ్స్‌,పిజిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌) బీఎస్సీ (బాటనీ, కెమెస్ర్టీ, హార్టికల్చర్‌),బీకాం(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) బీఏ (హిస్టరీ,ఎకనామిక్స్‌, పొలిటకల్‌ సైన్స్‌) గ్రూపులతో 160 మంది విద్యార్ధులతో  తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ తెలిపారు.

స్థలం ఎంపిక కీలకం

నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాల కోసం సుమారు రూ.14.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఐదు ఎకరాల భూమి అవసరమని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహిస్తున్నందున తాత్కాలికంగా జూనియర్‌ కళాశాలలోనే కొన్ని గదుల్లో తరగతులు బోధించేలా చర్యలు చేపట్టారు. అయితే కళాశాల మంజూరు ప్రకటన వెలువడిన వెంటనే ఎంపీపీ గుమ్మా పద్మజ భర్త ఎల్లేశ్‌ రెండెకరాలు ఉచితంగా ఇస్తామన్నాడు. అలాగే దోర్నాల ఉపసర్పంచి షేక్‌ రసూల్‌ పట్టా భూమి 5ఎకరాలు ఇస్తానని చెప్పాడు. అవి పట్టణానికి కిలోమీటరున్నర దూరం కావడంతో వైసీపీ వర్గంలోనే కొందరు విభేధిస్తున్నారు. జూనియర్‌ కళాశాలలోనే చాలా స్థలం ఉందని ఇక్కడే డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని మంత్రి సురేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇద్దరు వైసీపీ నేతలు కావడంతో జాప్యం జరిగే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

Read more